అల్లుడికి పవర్
సోనియా కుటుంబంపై మోడీ నిప్పులు
రైతుల భూములు లాక్కున్నారు
మీ బావకు ఏ విధానం ప్రకారం భూములిచ్చారు రాహుల్
ఏడు తరాల్లో ఎవరూ చూడనట్లుగా కాంగ్రెస్‌ను ఓడించాలి
ఝాజర్/జయల్/పాలీ: ఇప్పటి వరకూ కాంగ్రెస్ విధానాల్ని విమర్శిస్తూ వస్తున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ.. రాజస్థాన్, హర్యానాల్లో జరిగిన ఎన్నికల సభల్లో సోనియాగాంధీ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. భూముల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రాని లక్ష్యంగా చేసుకుని పరోక్షంగా విమర్శించారు. రైతులు అయినకాడికి భూములు అమ్ముకునేలా చేసి, అభివృద్ధి పేరుతో అల్లుడికి అధికారం అప్పగించారని ఆరోపించారు. పాలీ సభలో మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ న్యూక్లియర్ పవర్, హైడ్రో పవర్, విండ్ పవర్, సోలార్ పవర్‌లను చూశామని, కానీ రాజస్థాన్‌లో దామాద్ (అల్లుడు) పవర్ అనే కొత్త మాట వినిపిస్తోందని చలోక్తులు విసిరారు. సోలార్ పవర్ పేరు చెప్పి యువరాజుగారి బావగారికి రైతులకు చెందిన వేలాది ఎకరాలు కట్టబెట్టారని విమర్శించారు. ఈ విషయంలో కాంగ్రెస్ మౌనముద్ర దాల్చిందన్నారు. ఏ విధానం ప్రకారం మీ బావకు భూములు కట్టబెట్టారో చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని నిలదీశారు. ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో.. ఇప్పుడు కూడా అలాంటి దుర్గతినే ఎదుర్కోబోతోందని మోడీ చెప్పారు. కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని, అయితే ఆ పార్టీకి వీడ్కోలు ఎలా పలకాలన్నదే ఇప్పుడు ప్రశ్న అన్నారు. ఏడు తరాల్లో ఎవరూ చూటనట్లుగా కాంగ్రెస్‌కు వీడ్కోలివ్వాలని చెప్పారు.
ఆ మ్యాజిక్ ఆ కుటుంబానికే తెలుసు..
ఝాజర్‌లో మాట్లాడుతూ.. భూముల వ్యాపారాన్ని హర్యానాలో తండ్రీ-కొడుకు, ఢిల్లీలో తల్లీ-కొడుకు చేస్తున్నది చాలక.. ఇప్పుడు అల్లుడు కూడా ఆ వ్యాపారంలో దిగాడన్నారు. హర్యానాలో పైసా లేకుండా మూడు నెలల్లో రూ. 50 కోట్లు సంపాదించవచ్చని, ఆ మ్యాజిక్ యువరాజు కుటుంబానికి మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో, యుద్ధ విమానాలు కూలిపోతుండడాల్లో, జలాంతర్గాముల మంటల్లో మన జవాన్లను కోల్పోతున్నామని చెప్పిన మోడీ.. మరో పక్క లక్షలాది రైతులూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.
‘మోడీ ప్రధాని అయితే ప్రమాదం’
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రధాని అయ్యే అవకాశముండడంపై వందమందికిపైగా ప్రముఖులు భయాందోళన వ్యక్తం చేశారు. మోడీని బలమైన నేతగా చూపేందుకు 2002 నాటి గుజరాత్ ముస్లింల ఊచకోతలో ఆయన దుర్మార్గ పాత్రను మరుగుపరుస్తున్నారని ఆరోపించారు. ‘ప్రస్తుతం దేశానికి మోడీ అవసరమని మీడియా ద్వారా జనానికి బలవంతంగా నచ్చజెబుతున్నారు. ఆయన ప్రధాని అయితే దేశంలో మతోన్మాదం, ప్రజల మధ్య విద్వేషాలు, వ్యవస్థీకృత హింస చెలరేగే ప్రమాదముందని ప్రజలను హెచ్చరిస్తున్నాం’ అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రముఖ రచయిత, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత యూఆర్ ఆనంతమూర్తి సోమవారమిక్కడ దీన్ని విడుదల చేశారు.