వర్క్ స్టేషన్ మార్పులతో ఉపశమనం | With changes to the workstation relief | Sakshi
Sakshi News home page

వర్క్ స్టేషన్ మార్పులతో ఉపశమనం

Published Wed, Sep 23 2015 12:10 AM | Last Updated on Wed, Apr 3 2019 5:45 PM

With changes to the workstation relief

హోమియో కౌన్సెలింగ్
ఇటీవల పగటిపూట, ఉదయంవేళల్లో వాతావరణం చాలా వేడిగానూ, రాత్రివేళల్లో చాలా చలిగానూ ఉంటుంది. ఈ వెంటవెంట మార్పులతో నాకు అలర్జీ ఎక్కువగా వస్తోంది. పైగా పగటివేళ కాలుష్యం, దుమ్ముతోనూ, రాత్రివేళల్లో తేమతోనూ ఆస్తమా వస్తోంది. నా సమస్యకు హోమియో వైద్య విధానంలో పరిష్కారం చెప్పగలరు.
- నీలకంఠరావు, సూళ్లూరుపేట

 
మీరు పేర్కొన్న వాతావరణం ఇటీవల ఎక్కువగా కనిపిస్తోంది. చాలాసేపు ఒకే విధమైన వాతావరణం ఉంటే సాధారణంగా శరీరానికి ఏ ఇబ్బందీ ఉండదు. అయితే వెంటవెంటనే ఉష్ణోగ్రతల మార్పు వల్ల శరీర ఉష్ణోగ్రత లోనూ మార్పులు వస్తాయి. ఆ తరహా వాతావరణ మార్పులు అంత శ్రేయస్కరం కాదు. వాతావరణంలో ఇలాంటి మార్పులకు గురికావడంతో పాటు దుమ్ము, ధూళి, పొగకు ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యేవారిలో అది ఆస్తమాకు దారితీసే అవకాశాలు ఎక్కువ. దానివల్ల...  కొద్దిపాటి పని చేసినా తీవ్రమైన అలసట  ఎక్కువసార్లు జలుబు చేయడం  ముక్కులు బిగుతుగా మారడం  ఊపిరి పీలుస్తున్నప్పుడు పిల్లికూతలు వినిపించడం  రాత్రి వేళల్లో శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి పదేపదే కనిపించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, ఫలితంగా ఇతర ఇన్ఫెక్షన్లకు తేలిగ్గా గురికావడం జరుగుతుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం కూడా తగ్గుతుంది. తర్వాతి దశల్లో అది బ్రాంకైటిస్, నిమోనియా వంటి వ్యాధులకూ దారితీయవచ్చు.
 
వాతావరణంలో తరచూ చోటుచేసుకునే ఈ మార్పుల వల్ల వచ్చే ఆస్తమాకు హోమియో వైద్యవిధానంలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ విధానంలో శారీరక లక్షణాలతో పాటు, మానసికమైన అంశాలనూ పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. యాంటిమోనియమ్ టార్ట్, ఆర్సినిక్ ఆల్బ్, హెపార్‌సల్ఫ్, సోరియమ్, నేట్రమ్ సల్ఫ్ వాటిలో కొన్ని ముఖ్యమైన మందులు. ఇవి రోగిలో వ్యాధి నిరోధకతను పెంచి, తద్వారా ఆస్తమా రాకుండా చేస్తాయి.
 
మీరు నిపుణులైన హోమియో వైద్యులను సంప్రదించి, వారి పర్యవేక్షణలో మందులు తీసుకోండి. వ్యాధి తీవ్రతతో పాటు మీ మనస్తత్వం, వ్యక్తిగత అంశాలను పరిగణనలోకి తీసుకొని మీ మందులనూ, మోతాదును నిర్ణయిస్తారు. హోమియో వైద్యవిధానం ద్వారా మీ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు.
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
ఫిజియో అండ్ రీహాబ్ కౌన్సెలింగ్
నా వయసు 45 ఏళ్లు. రోజూ 8-10 గంటలు కూర్చొనే పనిచేస్తాను. అప్పుడప్పుడూ నడుము నొప్పి వస్తుండేది. ఇప్పుడు ఆ నొప్పి క్రమంగా కాళ్లకూ పాకుతోంది. కాళ్ల తిమ్మిర్లు వస్తున్నాయి. సరిగా నిలబడలేకపోతున్నాను. పరిష్కారం చెప్పండి.
- రామ్మోహన్, హైదరాబాద్

 
నడుము నొప్పి అనేక కారణాలతో వస్తుంటుంది. కంప్యూటర్ ముందు చాలా సేపు కూర్చొని పనిచేసే చాలామందిలో ఇది కనిపిస్తూ ఉంటుంది. కొందరిలో అపసవ్య భంగిమలో కూర్చోవడం వల్ల నడుము నొప్పి వస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో కిడ్నీకి సంబంధించిన జబ్బులు, పేగులకు సంబంధిత వ్యాధులు ఉన్నా ఇలా నడుమునొప్పి రావచ్చు. మహిళల్లో గైనిక్ సమస్యలు ఉండటం కూడా నడుము నొప్పికి ఒక కారణం కావచ్చు. పోషకాహార లోపం వల్ల ముఖ్యంగా విటమిన్-డి తగ్గడం వల్ల కూడా ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చి ఈ తరహా నొప్పులు వచ్చేందుకు అవకాశం ఉందని కొత్త పరిశోధనలు తెలుపుతున్నాయి. మీరు ముందుగా డాక్టర్‌కు చూపించి, అసలు ఏ సమస్య కారణంగా నడుమునొప్పి వస్తోందో తెలుసుకోవాలి. ఒకవేళ ఎముకలు లేదా నరాలకు సంబంధించిన అంశాల కారణంగా నడుము నొప్పి వస్తుంటే, దాన్ని నిర్దిష్టంగా నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. నొప్పి కాళ్లవైపునకు పాకుతోందనీ, కాళ్లు తిమ్మిర్లుగా ఉంటున్నాయని చెప్పిన లక్షణాలను బట్టి, ఇది చాలావరకు నరాలకు సంబంధించిన సమస్య కావచ్చు.

దీనికోసం రేడియాలజీ, ఎమ్మారై పరీక్షలు చేయాల్సి రావచ్చు. ఇలా వచ్చే నడుము నొప్పి తగ్గడానికి కొన్ని రకాల వ్యాయామాలు ఉన్నాయి. అయితే నిర్దిష్టంగా అది ఫలానా కారణంతో అని తేలేవరకూ ఇలాంటి వ్యాయామాలు చేయడం సరికాదు. ఎందుకంటే కారణాలను బట్టి, నొప్పి తగ్గడానికి చేయాల్సిన వ్యాయామాలు మారుతుంటాయి. తగిన వ్యాయామాలు చేయకపోయినా వ్యాధి తీవ్రత పెరగవచ్చు. తగిన వ్యాయామాలు సూచించేందుకు మీరు రీహ్యాబ్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం మంచిది. మీరు ముందుగా డాక్టర్‌ను కలిసి తగిన వైద్యపరీక్షలు చేయించుకోండి. ఇక అప్పటివరకూ మీ కూర్చొనే భంగిమలో ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దుకోండి. మీరు కుర్చీలో వెన్నును నిటారుగా ఉంచి కూర్చునేలా మీ సీట్‌ను అడ్జెస్ట్ చేసుకోవాలి. దీనిని వర్క్ స్టేషన్ మాడిఫికేషన్ టెక్నిక్ అంటారు. ఇందులో భాగంగా ప్రతి గంటకోసారి లేచి నాలుగు అడుగులు వేయాలి. అప్పుడు మీ వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. ఇది చేశాక కూడా మీకు నడుమునొప్పి వస్తూ ఉంటే, వెంటనే డాక్టర్ కలిసి, తగిన వైద్య పరీక్షలు చేయించుకోండి.
 
డాక్టర్ మిద్దె అజయ్‌కుమార్
లెసైన్స్‌డ్ పీటీ (యూఎస్‌ఏ),
డిపార్ట్‌మెంట్ ఆఫ్
న్యూరో రీహాబిలిటేషన్,
కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 
జనరల్ హెల్త్ కౌన్సెలింగ్
నా వయసు 46 ఏళ్లు. నాకు నోటి నిండా పొక్కులు వస్తున్నాయి. నోరు పూసినట్లుగా అవుతోంది.  దాదాపు ప్రతి రెండు నెలలకోసారి ఇలా అవుతోంది. డాక్టర్‌ను కలిస్తే ప్రమాదం ఏమీ లేదని విటమిన్ మాత్రలు ఇచ్చారు. మాటిమాటికీ  అవే మందులు వాడుతున్నాను. ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఏం చేయాలో చెప్పండి.
- వినోద్, జడ్చర్ల

 
మాటిమాటికీ నొటిలో పొక్కులు వస్తున్నాయంటే చాలా సందర్భాల్లో మానసిక ఒత్తిడి వల్ల కావచ్చు. అది నోట్లో మచ్చలుగానీ, ప్లాక్‌లా వస్తే అది ఓరల్ క్యాండిడియాసిస్ కావచ్చు. కొన్నిసార్లు విటమిన్లు, ఖనిజాల లోపం కూడా కావచ్చు. అయితే ఈ నోటిలోని పొక్కులు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు ఒకసారి ఫిజీషియన్‌ను సంప్రదించండి. ఇదే సమయంలో మీకు ఉన్న ఇతర సమస్యలు అంటే... శారీరక వ్యవస్థలకు సంబంధించినవి - కీళ్లనొప్పులు, వ్యాధినిరోధకశక్తికి సంబంధించిన సమస్యలు ఉన్నాయా అని నిర్ధారణ చేయడానికి  తగిన పరీక్షలను సూచిస్తారు.
 
నా వయసు 45 ఏళ్లు. నాకు కుడి చేయి విపరీతంగా లాగుతోంది. నా చేయి నిస్సత్తువ అయిపోయినట్లుగా ఉంది. మెడ దగ్గర నొప్పి వస్తోంది. కళ్లు తిరుగుతూ ఉన్నాయి. కిందపడిపోయినట్లుగా అనిపిస్తోంది. గత మూడు నెలలుగా ఈ నొప్పి ఇలాగే ఉంది. అప్పుడప్పుడూ నొప్పి నివారణ మందులు వాడుతున్నాను. మందులు వాడినప్పుడు నొప్పి తగ్గి మళ్లీ వస్తోంది. నాకు తగిన పరిష్కారం చూపించండి.
- కామేశ్వరరావు, భద్రాచలం

 
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తే బహుశా సర్వికల్ స్పాండిలైటిస్ కారణంగా వెన్నెముక అరిగి, అది మీ నరంపై ఒత్తిడి పడి మీకు నొప్పి వస్తుండవచ్చు. మీరు బీటాహిస్టిన్, గాబాంటిన్, మిథైల్ కోబాలమైన్ వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. మెడకు సంబంధించిన వ్యాయామాలు తెలుసుకొని, వాటిని చేయాలి. దాంతో మెడకండరాలు బలపడి నొప్పి తగ్గేందుకు అవకాశం ఉంది.
 
డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి
కన్సల్టెంట్ - ఇంటర్నల్ మెడిసిన్
అండ్ డయాబెటిస్, కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement