కిరసనాయిలు కంపు | funday story to world | Sakshi
Sakshi News home page

కిరసనాయిలు కంపు

Published Sun, Apr 15 2018 12:35 AM | Last Updated on Sun, Apr 15 2018 12:35 AM

funday story to world - Sakshi

పంజాబీ మూలం : అమృతాప్రీతం
అనువాదం: సుంకర కోటేశ్వరరావు

బైట ఆడగుర్రం సకిలించింది. ఆ సకిలింతను గుర్తించిన గువేరి ఇంట్లోంచి పరుగున బైటికి వచ్చింది. ఆ గుర్రం తన పుట్టినింటి గ్రామం నుంచి వచ్చింది. ఆమె తన తలను దాని మెడపైన.. అది తన పుట్టింటి గుమ్మం అయినట్లు ఆనించింది.గువేరి తల్లిదండ్రులు చంబా గ్రామంలో ఉంటారు. ఎల్తైన కొండ ప్రాంతాన వున్న తన భర్త ఊరికి అది కొద్ది మైళ్ల దూరంలో ఉంది. అక్కడికెళ్లే రాస్తా వంపులు తిరిగి కొండ దిగువకు జారుతున్నట్లు దిగుడుగా ఉంటుంది. ఈ గుట్ట ప్రాంతం నుంచి చూస్తే సుదూరంగా ఆ రాస్తా అడుగున చంబా గ్రామం పడి వున్నట్లుగా కనిపిస్తుంది. గువేరికి ఎప్పుడైనా తన పుట్టింటిపైన మనసు మళ్లినప్పుడు తన భర్త మానెక్‌ని వెంటబెట్టుకుని ఈ గుట్ట ప్రాంతానికి వచ్చి ఎండ వెలుతురులో మినుకు మినుకుమంటూ కనిపించే చంబా గ్రామ ఇళ్లను చూసి తన మనసు నిండా గర్వాన్ని, వెలుగుని నింపుకుని యింటికి తిరిగి వెళ్తుంది. సంవత్సరానికొకసారి పంటలు ఇళ్లకు చేరిన తర్వాత కొద్దిరోజులు తల్లిదండ్రులతో గడపడానికి గువేరీని అనుమతించేవారు. ఆమెను చంబాకు తీసుకురావడానికి వాళ్లొక మనిషిని పంపుతారు. చంబా గ్రామం బైటి ప్రాంతాల కుర్రాళ్లను పెళ్లాడిన ఆమె స్నేహితురాళ్లిద్దరు కూడా అదే సమయంలో చంబాలోని తన ఇళ్లకు వస్తారు. వీళ్ల వార్షిక సమావేశాల కొరకు ఈ ఆడపిల్లలు ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతిదినం ఎన్నెన్నోగంటలు వాళ్లవాళ్ల అనుభూతులు, సంతోషాలు, విచారాలూ మాట్లాడుకుంటూ గడుపుతారు. వాళ్లు కలిసి వీధులన్నీ తిరుగుతారు. ఆ సమయంలో అక్కడ పంటకోతల పండుగ జరుగుతుంది.అందుకొరకు ఆ ఆడపిల్లలు కొత్తబట్టలను సిద్ధం చేసుకుంటారు. తమమేలి ముసుగు వోణీలకు రంగులద్దించి గంజిపెట్టుకుని తళుకులీనేలా చేసుకుంటారు. చేతుల నిండుగా రంగురంగుల గాజులు వేయించుకుని, చెవులకు కొత్త జూకాలను ధరిస్తారు.

గువేరి ఎప్పుడూ పంట కోతలకాలం ఎప్పుడా అని దినాలు లెక్కించుకునేది. ఆకురాలు కాలపు పవనాలు రుతుమేఘాల నుండి ఆకాశాన్ని విముక్తి పరచగానే ఆమె చంబాలోని తమ ఇంటికి దాపున ఉన్నట్లే చిరుభావన పొందేది. ఆమె తన దినచర్య.. పశువులకు మేతపెట్టడం, భర్త తల్లిదండ్రులకు వంట సిద్ధం చేయడం ఆ తర్వాత ఒకచోట చేరబడి పుట్టింటి నుండి తనకొరకు ఎన్ని దినాలకు మనిషి వస్తాడా.. అని లెక్కవేస్తూ ఉండటం...ఇప్పుడు తన వార్షిక సందర్శన సమయం వచ్చింది. గుర్రాన్ని ఆమె సంతోషంగా విశ్వాసంతో స్పర్శించింది. గుర్రంతో వచ్చిన తన పుట్టింటి సేవకుడు నాటూను మన్నన చేసింది. తర్వాతి రోజు ఊరు వెళ్లడానిగ్గాను అంతా సిద్ధం చేసింది. గువేరీలో పొంగుతున్న సంతోషాన్ని మాటలలో చెప్పటం కుదరదు. భావప్రకాశమానమైన ఆమె ముఖం చూస్తే చాలు.ఆమె భర్త మానెక్‌ కళ్లు మూసుకుని హుక్కా పీలుస్తున్నాడు. ‘‘చంబా ఉత్సవం రోజుకు నువ్వొస్తావుగదూ.. రావూ? కనీసం ఆ ఒక్క దినమైనా నువ్వువచ్చెయ్‌’’ బ్రతిమిలాడుతూ అడిగిందామె. మానెక్‌ సమాధానం చెప్పలేదు.‘‘సమాధానం చెప్పవేంది?’’ కొద్దిపాటి ధైర్యం తెచ్చుకుని పదునుగా అడిగింది...‘‘నీకొక విషయం చెప్పనా?’’ మళ్లీ అంది.‘‘నువ్వేం చెప్తావో నాకు తెలుసులే...’’ ‘సంవత్సరానికొక్కసారేగదా నేను నా పుట్టింటికి వెళ్లేది’ అని. అవును, క్రితం నిన్నెప్పుడూ ఆపలేదుగదా!’’‘‘మరి, ఈ ఏడాదెందుకని ఆపాలనుకుంటున్నావు?’’ గట్టిగా నిలదీసింది.‘‘ఈ ఒక్క సంవత్సరం...’’ బ్రతిమాలుతున్నట్లు అన్నాడు.‘‘మీ అమ్మగారి అభ్యంతరమేమీలేదు. మరి నువ్వెందుకు అడ్డుకుంటున్నావు?’’ గువేరీ చిన్న పిల్లలా మంకుపట్టుతో అడిగింది.‘‘మా అమ్మ...’’ మానెక్‌ పూర్తిగా చెప్పలేక ఆగాడు.బహుకాలం ఎదురుచూసిన ఆ ఉదయం... పొద్దుపొడవకముందే పెందలకడే తయారయింది. తనకు సంతానం లేకపోవడం ఒక సౌలభ్యమైంది. ఉంటే వాళ్లను తనతో వెంటబెట్టుకునేనా వెళ్లాలి. లేదంటే తన భర్త తల్లిదండ్రుల వద్దనన్నా వదలాలి. నాటూ మానెక్‌ తల్లిదండ్రుల వద్ద సెలవు పుచ్చుకుని గుర్రంపై జీనువేసి సిద్ధం చేశాడు. వాళ్లు ఆమె తలను స్పర్శించి దీవించారు.‘‘నేను నీతో కొంత దూరం వస్తాను’’ అన్నాడు మానెక్‌.

గువేరి అందుకు సంతోషించింది. ఆమె తన దుపట్టా చాటున అతని పిల్లన గ్రోవిని దాచింది. ఖజియార్‌ గ్రామం తర్వాత రాస్తా నిట్టనిలువుగా చంబావైపు కిందికి దిగుతుంది. గువేరి అక్కడ తను దాచితెచ్చిన మురళిని బైటికి తీసి మానెక్‌ చేతికిచ్చింది. అతనిచేతిని తన చేతిలోకి తీసుకుంటూ ‘‘ఇప్పుడు వాయించు మురళిని’’ అంటూ అడిగింది. కానీ మానెక్‌ ఆలోచనలనే కోల్పోయి ఆమె కోర్కెను లక్ష్యపెట్టలేదు.‘‘నువ్వెందుకని మురళిని వాయించవు?’’ మంచిగా ఒప్పించాలనే ధోరణిలో అడిగింది. మానెక్‌ ఆమెవంక దీనంగా చూస్తూ మురళిని తన పెదవులకు చేర్చి ఒక చిత్రమైన వేదనామయ దుఃఖస్వరాన్ని వినిపించాడు. ఇక వాయించలేనన్నట్లు దానిని తిరిగి ఆమెకు ఇస్తూ ‘‘గువేరీ! నువ్వు వెళ్లొద్దు. నేను నిన్ను మళ్లీ అడుగుతున్నా ఈసారికి నువ్వు వెళ్లొద్దు.’’ అర్థిస్తూ అడిగాడు.‘‘ఎందుకని?’’ అడిగిందామె. తిరిగి అంది... ‘‘చూడూ.. నువ్వు ఉత్సవం రోజుకు అక్కడకు వచ్చెయ్‌. మనిద్దరం కలిసి వచ్చేద్దాం. నేను నీకు మాటిస్తున్నా. నేనక్కడనే ఆగిపోను.’’మానెక్‌ మళ్లీ అడగలేదామెను. వాళ్లు దారిపక్కన ఆగారు. జంటకు ఏకాంతం కల్పించాలని నాటూ గుర్రాన్ని కొద్ది అడుగుల దూరం అవతలికి తీసుకెళ్లాడు.మానెక్‌ మనసులో ఏవో కదలికలు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున తనూ తన మిత్రులు చంబాలో జరిగే పంటకోతల ఉత్సవానికని ఇదే రాస్తాపై ఇటువైపు వచ్చారు. ఆ ఉత్సవంలోనే మానెక్‌ తొలిసారి గువేరీని చూశాడు. ఇద్దరూ ఒకరికొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు. తర్వాత మానెక్‌ గువేరీని ఒంటరిగా కలవడానికి వచ్చేవాడు. అతనామె చేతిని అందిపుచ్చుకొని ‘‘బాగా పొలుపోసుకుని ఇంకా పక్వానికి రాని మొక్కజొన్న కండెలా ఉన్నావు.’’ అని అనడం ఇంకా గుర్తే. సమాధానంగా ఆమె ‘కోతకురాని కండెలకోసం పశువులు ఎగబడతాయి. మనుషులు వాటిని కాల్చుకుని తినడానికి ఇష్టపడతారు’ చివుక్కున చేతిని విడిపించుకుంటూ అంది. ‘నన్ను ఇష్టపడితే నా చేయిపట్టడానికి వెళ్లి మా నాన్ననడుగు’ అని కూడా చెప్పింది.పెళ్లికి ముందు పెళ్లి కొడుకు తరపు పెద్దలు వచ్చి కన్యాశుల్కం నిశ్చయపరచుకోవటం సంప్రదాయం. గువేరి తండ్రి కన్యాశుల్కం ఎంత కోరబోతాడోననే జంకుతో మానెక్‌ నరాల కంపనతో ఉన్నాడు. కానీ ఆమె తండ్రి ఉన్నవాడు, పట్టణ ప్రాంతాలలో మసలిన వాడూ అవటం వలన ఆయన తన కుమార్తెకు డబ్బు పుచ్చుకోకూడదని ఒట్టుపెట్టుకుని ఉన్నాడు. అయితే ఆమెనో మంచి కుటుంబంలోని యోగ్యుడైన యువకునికి ఇవ్వాలనుకున్నాడు. మానెక్‌లోని లక్షణాలకు సమాధానపడి నిర్ణయించుకున్నాడు. వెనువెంటనే గువేరీ మానెక్‌ల వివాహం జరిగింది.

గువేరి తన చేతితో అతని భుజాన్ని తట్టడంతో మానెక్‌ పాత జ్ఞాపకాల నుండి బైటకివచ్చాడు. ‘‘ఏమిటి అంతటి దీర్ఘాలోచనలు?’’ భర్తను ఆటపట్టించాలని అడిగింది. అతని నుండి సమాధానం లేదు.అసహనంతో గుర్రం చేసిన సకిలింతతో ప్రయాణం గుర్తుకు వచ్చి గువేరి లేచింది. మౌనంగా ఉన్న అతన్ని చూస్తూ ‘‘ఇక్కడికి రెండు మైళ్లదూరంలో గందెనపూల అడివి ఉందట నీకు తెలుసా? ఎవరైనా ఆ అడివిగుండా నడిస్తే వాళ్లకి చెముడు ప్రాప్తిస్తుందట’’ అంది.‘‘అవును.’’‘‘నాకనిపిస్తుంది. నువ్వెప్పుడో ఆ అడివిగుండా నడిచివుంటావేమోనని.. నేనేదడిగినా నువ్వు వినిపించుకోవడంలేదు మరి.’’‘‘నిజమే గువేరీ! నువ్వేం చెప్పినా నేను వినలేకపోతున్నాను’’ ఒక దీర్ఘనిట్టూర్పువిడిచి సమాధానంగా అన్నాడు మానెక్‌.ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కానీ, ఒకరికొకరు అర్థంకావడం లేదు. ‘‘సరే ఇకనేను బయల్దేర్తాను. ఇంటికి వెళ్లు. చాలాదూరం వచ్చావు’’ సౌమ్యంగా అంది గువేరి.‘‘నువ్వింత దూరమూ నడిచావు. ఇక గుర్రం ఎక్కడం మంచిది.’’‘‘ఇదిగో... నీ మురళి, తీసుకో...!’’‘‘దాన్ని నీతోనే పట్టుకెళ్లు’’‘‘మరి ఉత్సవం నాడు వచ్చి దాన్ని వాయిస్తావా?’’ చిరునవ్వుతో అడిగింది. ఆమె కళ్లలో వెలుగులు. చంబావైపు కదిలింది. మానెక్‌ ఇంటికి తిరిగివెళ్లాడు.ఇంట్లోకి ప్రవేశిస్తూనే నిస్పృహతో మంచంపైన కూలబడ్డాడు.‘‘చాలాసేపు నడిచినట్లున్నావు. పూర్తిగా చంబా వరకూ వెళ్లావా?’’ పెద్ద కంఠంతో అడిగింది తల్లి.‘‘పూర్తిగా కాదులే, గుట్టపై వరకూ మాత్రం వెళ్లా’’ మానెక్‌ స్వరం బరువుగా ఉంది. ‘‘ముసలమ్మలా అలా కాకి మూలుగుడెందుకు? మగవాడిలా ఉండు’’ క్రూరంగా ఉంది తల్లి.‘‘నువ్వూ ఆడదానివి. ఒక మార్పునాశించే వాళ్లలాగా నువ్వెందుకని ఏడవవు?’’ అంటూ ఒక గట్టి ఎదురు సమాధానం చెబ్దామనుకున్నాడు మానెక్, కానీ మూగగా ఉండిపోయాడు. తల్లి పట్ల, సంప్రదాయంపట్ల విధేయత కలిగిన మానెక్‌ శరీరం నూతన యువతిపట్ల ప్రతిస్పందించింది. కానీ, అంతర్గతంగా అతని ఆత్మ చచ్చిపోయింది.

ఒక పొద్దుటి పూట మానెక్‌ పొగతాగుతూ కూర్చుని ఉన్న సమయంలో తన పాతమిత్రుడొకరు అటుగా పోతూండటం గమనించి కేకేశాడు.‘‘ఏయ్‌ భవానీ! పొద్దున్నే ఇంత పెందరాళే ఎక్కడికి వెళ్తున్నావు?’’భవానీ ఆగాడు. అతని భుజాన చిన్న మూటవుంది. ‘‘అంత విశేషంగా ఎక్కడికీ లేదులే!’’ తప్పించుకునే ధోరణిలో బదులిచ్చాడు.‘‘సరే, ఏదోపని మీద ఎక్కడికో వెళ్తున్నావులే కానీ, పొగతాగుతావా?’’ కేకేసి అడిగాడు మానెక్‌.భవానీ వచ్చి పక్కనే కూర్చున్నాడు. ‘‘నేను చంబా ఉత్సవానికి వెళ్తున్నా’’ చివరికి చెప్పాడు.భవానీ కబురు మానెక్‌ గుండెలో ముల్లులా గుచ్చుకుంది. ‘‘ఉత్సవం ఈరోజేనా?’’ అడిగాడు.‘‘ప్రతి సంవత్సరం ఇదే రోజున గదా?’’ భవానీ పొడిగా సమాధానం ఇచ్చాడు. ‘‘ఏడేళ్ల క్రితం మనమంతా ఒకటిగా కలిసి వెళ్లి పాల్గొన్నాంగదా! నీకు గుర్తులేదా?’’ భవానీ ఆపైన ఏమీ అనలేదు. కానీ తననతనేమైనా తప్పు పడతాడేమోననే ఆలోచన కలిగి కించపడ్డాడు. భవానీ తన మూటనందుకున్నాడు. ఆ మూటలోంచి అతని పిల్లనగ్రోవి పైకి కనిపిస్తోంది. మానెక్‌ వద్ద సెలవు పుచ్చుకుని వెళ్లిపోయాడు భవానీ. అతను కనిపించినంత దూరం మానెక్‌ ఆ మురళిపైననే చూపును నిలిపాడు.తర్వాతి రోజు పొద్దువాలిన వేళ మానెక్‌ పొలంలో వుండగా తిరిగివస్తున్న భవానీని గమనించి బుద్ధిపూర్వకంగా ముఖం వేరేవైపుకు తిప్పుకున్నాడు మానెక్‌. భవానీతో మాట్లాడ్డానికిగానీ, ఉత్సవం విషయాలు తెలుసుకోవడానికి గానీ అతనికి ఇష్టంలేదు. అయితే భవానీ చుట్టూ తిరిగి, నేరుగా అతని వద్దకే వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. వెలిగిఆరిపోయిన మసిబొగ్గులా విషాదంగా ఉంది అతని ముఖం.‘‘గువేరి చనిపోయింది’’ అన్నాడు. అతని స్వరం సాధారణంగానే ఉంది.‘‘ఏ....మి...టీ..?’’‘‘నీ రెండో పెళ్లి గురించి వినగానే ఆమె తన ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించేసుకుంది.’’మానెక్‌ వేదనతో మూగబోయాడు. తన శరీరమే కాలిపోతున్న అనుభూతితో అలాగే చూస్తూ ఉండిపోయాడు.

రోజులు చెల్లిపోతున్నాయి. మానెక్‌ పొలాలవైపు వెళ్లడానికి అలవడ్డాడు. భోజనం ఎవరైనా పెట్టినప్పుడు తింటాడు. జీవంలేని వాడిలా తయారయ్యాడు. ముఖంలో ఏ భావాలు లేవు. కళ్లలో వెలుగులు లేవు.అతని రెండవ భార్య ‘‘నేనాయన భార్యగాలేను, ఎవరో దారినపోయే దాన్ని తెచ్చిపెట్టుకున్నట్లుంది’’ అంటూ మొరపెట్టుకునేది. అయితే త్వరలోనే ఆమె గర్భవతైంది. తన కోడల్ని చూసుకుని మానెక్‌ తల్లి ఎంతో సంతోషపడిపోయింది. ఈ విషయం మానెక్‌తో చెప్పింది. అతను అయోమయంగా చూశాడు. అతని చూపులలో జీవంలేదు.అతని తల్లి కోడలితో కొద్దిరోజులు భర్త పరిస్థితిని భరించమని ధైర్యం చెప్పింది.  బిడ్డపుట్టిన తర్వాత అతని ఒడిలో పెడితే తానే మారతాడని ఆమె భరోసాగా అనేది. మానెక్‌ భార్య మగబిడ్డను కన్నది. మానెక్‌ తల్లి ఉప్పొంగిపోతూ బిడ్డకు స్నానం చేయించి మంచి బట్టలువేసి ఎత్తుకెళ్లి మానెక్‌ ఒడిలో ఉంచింది.ఒడిలోని బిడ్డవైపు తేరిపారజూశాడు. చాలాసేపు అలాగే రెప్పవేయకుండా చూశాడు. ఎప్పటిలానే అతని ముఖంలోని ఏ భావాలూ లేవుగానీ, హఠాత్తుగా వెలుగులు ఇంకిన అతని కళ్లు భీతితో పెద్దవయ్యాయి. ఒక్కసారిగా భయంతో పెద్దగా కేకపెట్టాడు.మానసిక అస్థిరతతో స్మృతిని కోల్పోయిన వాడిలా ‘‘వీణ్ని తీసుకెళ్లిపో! కిరసనాయిలు కంపుగొడుతున్నాడు. తీసుకెళ్లిపో వీణ్ని!’’ అంటూ కేకలు పెట్టాడు.
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement