మీ బుజ్జి తల్లికి బుల్లి గిఫ్ట్!
ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ అందం వేరు. తనని చక్కగా తయారు చేయడంలో తల్లి పడే ఆనందమే వేరు. మంచి గౌను వేసి, తలను అందంగా దువ్వి, అందమైన క్లిప్పులు పెట్టి పాపను బుట్టబొమ్మలా తయారు చేస్తుంటారు అమ్మలు. నిజానికి మీ పాపకు అవసరమైన వస్తువులను చాలావరకూ మీరే తయారు చేసుకోవచ్చు తెలుసా? మెళ్లోకి గొలుసులు, చేతికి గాజులు, చెవులకు బుట్టలు, జుత్తుకు క్లిప్పులు... ఇలా అన్నీ చేయవచ్చు. ప్రస్తుతానికి క్లిప్స్ తయారు చేయడమెలాగో చూద్దామా!
వెల్వెట్ క్లాత్‌గానీ, మరేదైనా దళసరి గుడ్డను కానీ తీసుకోండి. దానిమీద మీకు నచ్చిన ఆకారంలో పువ్వును గీయండి. దాన్ని కత్తిరించి, ఓ పెన్నును తీసుకుని మధ్యలో గట్టిగా పొడవండి. దాన్ని అయిదు వేళ్ల మధ్యనా ఉంచి, మొగ్గలా ముడిచి వదిలి పెట్టండి. అప్పుడది నిజంగానే పువ్వు ఆకారంలోకి ఒదిగిపోతుంది. అలాంటిదే మరో చిన్ని పువ్వును కూడా చేయండి. ఆ రెండిటినీ ఒకదాని మీద ఒకటి పెట్టి, మధ్యలో ఓ అందమైన పూస పెట్టి కుట్టేయండి. ఈ పువ్వును బేబీ క్లిప్‌కు వైరుతో కుట్టండి. గ్లూతో అతికించినా ఫర్వాలేదు. ఆ క్లిప్ మీ బుజ్జాయి తలపైన ఎంత అందంగా ఉంటుందో మీరే చూసుకోండి!