నయవంచనకు మారుపేరు బాబు | TDP And Congress Alliance Illegal Says ABK Prasad | Sakshi
Sakshi News home page

నయవంచనకు మారుపేరు బాబు

Published Tue, Nov 6 2018 12:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

TDP And Congress Alliance Illegal Says ABK Prasad - Sakshi

ఎన్టీఆర్‌ చివరిక్షణం వరకు బద్ధశత్రువుగా పరిగణించిన కాంగ్రెస్‌ పార్టీకి అదే టీడీపీని ఇప్పుడు తాకట్టుగా సమర్పించిన చంద్రబాబు రాజకీయాల్లో నయవంచనకు మారుపేరుగా నిలిచిపోయారు. కాంగ్రెస్‌తో పొత్తు నిర్ణయం ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ఉద్దేశంతో తీసుకొన్నదేనని బుకాయించడంతో పాటు, అది జగన్‌పై హత్యాప్రయత్న ఘటనవల్ల పుట్టుకొచ్చిన వ్యతిరేకత ఫలితంగా తీసుకున్న నిర్ణయం కాదనీ ఊరూనాడూ చెప్పుకొనలేక చంద్రబాబు నానా ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ జీవితం ప్రారంభం నుంచి మొదలెట్టిన నయవంచనను నేటికీ కొనసాగించటమే చంద్రబాబు ప్రత్యేకత.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబునాయుడు ఇన్నేళ్లుగా కాంగ్రెస్‌ను వ్యతిరే కిస్తూ ఇప్పుడు పొత్తు కలిసి దేశ వ్యాప్తంగా బీజేపీ, కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల ముందే వివిధ పార్టీలతో ఐక్య సంఘటన కట్టడాన్ని, అదీ నాలుగేళ్లుగా మోదీ ప్రభుత్వంతో భాగస్వామిగా ఉంటూనే చడీచప్పుడూ లేకుండా ఈ పని చేయడాన్ని జీర్ణించు కోలేకుండా ఉన్నానని ఒక టీడీపీ మంత్రి పెదవి విరి చాడు. అయినా ఆ మంత్రి  మాటను బాబు లెక్కచేయలేదని పత్రికా వార్తలు (1–11–2018)

ఎన్టీఆర్‌ హయాం నుంచీ కాంగ్రెస్‌కు ఆగర్భశత్రువుగా ఉంటూ వచ్చిన టీడీపీ మౌలిక విధానానికి వ్యతిరేకంగా దాని భవిష్యత్తునే తాకట్టుపెట్టే యాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన దరిమిలానే కాంగ్రెస్‌తో తనకు అంతకు ముందునుంచీ ఉన్న కుట్రపూ రిత రాజకీయాలు ఆధారంగా చంద్రబాబు పెంచి పోషిస్తూ వచ్చింది. టీడీపీని కాదు, కాంగ్రెస్‌తో తనకు ఉన్న రక్తసంబంధాన్ని మాత్రమేనని మర్చి పోరాదు. అందుకు ఎన్టీఆర్‌ టీడీపీని రద్దు చేయకుండానే ‘‘దడిలో పెడుదునా, ఒడిలో పెడుదునా’’ అన్నంత తొందర్లో జాతీయస్థాయిలో కొన్ని ప్రతి పక్షాల్ని సమావేశపరిచే నిమిత్తం అక్టోబర్‌ 27న చేరుకుని అరవింద్‌ కేజ్రీవాల్‌ (ఆమ్‌ ఆద్మీ), బహుజన సమాజ్‌ పార్టీ అధ్యక్షురాలు మాయా వతి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా, ఎల్‌.జె.పి నాయకుడు శరద్‌పవార్, కేంద్ర మాజీమంత్రి యశ్వంత్‌ సిన్హా ప్రభుత్వాన్ని ఎందుకు కలవవలసి వచ్చింది? ఈ ఐక్యసంఘటనలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపత్తి ఏమిటన్న ప్రశ్నకు ఒక ‘‘జాతీయ స్థాయి పార్టీ లేకుండా, కేంద్రప్రభుత్వాన్ని ఏర్పర్చలేం గదా? ఈ విషయంలో నేడు ప్రజలలో విశ్వాసం కల్పించాలి. అందుకని దేశప్రయోజనాలను, దేశ శ్రేయస్సును కోరేవారంతా తక్షణం ఒకటి కావాల’ని ఢిల్లీలో ఒక ఉప న్యాసం దంచాడు (27–10–2018) కానీ, ‘తక్షణం ప్రతిపక్షాలన్నీ ఒకటి కావాల’న్న బాబు ఆపద్ధర్మ ప్రేలాపనకు ఆ ‘గావుకేక’కూ కారణం ఏమై ఉంటుంది? నాలుగున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు క్షణాల మీదనే ఆయనకు ఎందుకిలా ఆలోచించివలసి వచ్చింది? బాబు ఢిల్లీ యాత్రనుంచి తిరిగి ఇంటికి చేరకముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కాంగ్రెస్‌–టీడీపీ ఐక్య సంఘటన నుంచి వివిధ స్థాయి నాయకులు కొందరు పొత్తుల నుంచి బయటకు రావలసి వస్తోంది.

ఏడాదిగా టీడీపీ విధానాలను ఎండగడుతూ రాష్ట్రం నలుమూల లకూ శరవేగంగా విస్తరిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి తలపెట్టిన చరిత్రాత్మకమైన అఖండ పాదయాత్రను భగ్నం చేయడా నికి ఎనిమిది మాసాల నాడే కుట్రకు మూలం మొదలైంది. నాటినుంచే బాబుకు సన్నిహితుడైన, సినీ రంగంలో పరాజయ పరంపరను చవిచూ సిన శివాజీ అనే ఒక గరుడపక్షి జగన్‌ భవిష్యత్తుకు ఒక తీతుపు పిట్టగా మారి, రాష్ట్ర సీఎం తరఫున ద్వంద్వార్థ సందేశాలు ఇస్తూ వచ్చింది. పైగా ఆ అశుభాన్ని పలికే, లేదా పలికించే శక్తిగా మారి సరాసరి బాబు కేబినెట్‌ సమావేశంలోనే కూర్చున్న వీడియో సందేశాన్ని కూడా విన్నాం. చూశాం. అదే జగన్‌పై హత్యాప్రయత్న సందేశం! అది కాస్తా ఇటీవల అక్టోబర్‌ నెలాఖరులో (2018) దేశం పార్టీ కోడికత్తిగా ఆచరణ దాల్చి, జగన్‌ అప్ర మత్తత వల్ల బలమైన గాయంతోనే ఆయన ప్రాణహాని నుంచి తప్పిం చుకుని, ఇంకా చికిత్స పొందుతూనే ఉన్నారు. త్వరలో తిరిగి ఆంధ్ర ప్రదేశ్‌ ఏకైక ప్రతిపక్ష నాయకుని హోదాలోనే తన ప్రజాసంకల్ప యాత్రను లక్షలాది ప్రజల ఆశీçస్సులతో జయప్రదంగా ముగిస్తారు. బాబు తాను అనుకోని (అనుకున్నా గుంభనంగా దాచుకోలేని) పరిష్కారం ఏదో తన నెత్తిపైకి రాజకీయ ‘మిత్తి’గా లేదా ‘సుత్తి’గా వచ్చి పడిందన్న నిజమైన వాదో, అపవాదో నిమిషాలమీద ఆయన్ని ఢిల్లీ పరు గెత్తించింది! కాంగ్రెస్‌ సహా మనం అంతా కలిసి కుమ్మక్కై ఐక్యసంఘటన కట్టకపోతే తాను అంతకు క్రితం కొద్ది రోజు లదాకా భాగస్వామిగా ఉన్న మోదీ ప్రభుత్వం నుంచి అందులో తాను చేరినందువల్ల ఉభయులూ కలిసి ఏపీకి తలపెట్టిన ఉమ్మడి మోసం ఏదో తాను ఇప్పుడు తొలగి పోయినందువల్ల ‘మాఫీ’ అయి పోయినట్టుగా భావించమని బాబు మొత్తుకుంటున్నాడు. కాళ్లావేళ్లా పడి కాంగ్రెస్‌ను, దేశ ప్రతిపక్షాలనూ బహుశా అతనికి స్వరాష్ట్రంలోని ప్రతిపక్షాన్ని ఆ ఐక్య సంఘటనకు ‘అంటరానిది’గా చూపడం బాబు ఉద్దేశం. అది నెరవేరే పని కాదు.  

ఏ తెలుగు ప్రజల ప్రయోజనాలకు, వారి ఆత్మ గౌరవానికి చేటు కలిగే విధంగా నాటి కాంగ్రెస్‌ పాలకులు వ్యవహరిస్తూ వచ్చారో వాటిని ‘మడమ’ తిప్పకుండా ఎదుర్కొంటూ టీడీపీని స్థాపించి, 9 నెలలు తిర క్కుండానే కాంగ్రెస్‌ను తన రాష్ట్రవ్యాప్త పర్యటనల ఫలితంగా ఎన్నికల్లో మట్టికరిపించాడు ఎన్టీఆర్‌. తెలుగువారి చరిత్రలో ఆ అపూర్వ ఘట్టానికి చరమాంకం పాడుతూ, ఏ కాంగ్రెస్‌ బీజం నుంచి బాబు మొలకెత్తుకు వచ్చాడో తిరిగి ఆ కాంగ్రెస్‌ మురికి కూపంలోనే ఎన్టీఆర్‌ పార్టీని ముంచేసి ‘జాతీయ ఐక్య సంఘటన’ నాయకత్వం కోసం మరోసారి వెంపర్లాట ప్రారంభించాడు. బాబు ఢిల్లీ యాత్రకి ముక్కు లేదు, ముఖం లేదు, రూపురేఖలే లేవు, రావు కూడా. అవకాశవాద రాజకీయాలు, తన పదవీ కాంక్ష రక్షణ మినహా మరో యావ పట్టని బాబు ప్రస్తుతం రాజ కీయాల్లో నెగ్గుకు వస్తున్న పాత్ర–రష్యాలో నికోలస్‌ చక్రవర్తులకు ‘దైవాంశ సంభూ తుని’గా, మాంత్రికుని ఫోజులో పరిపాలనా తీరుతెన్నుల్ని శాసించజూచి, తుదకు దేశద్రోహిగా దేశ బహిష్క రణకు గురైన రాస్పుటిని తలపిస్తుంది. చివరికి జారు చక్రవర్తుల తరఫున రష్యన్‌ పార్లమెంట్‌ సభ్యుడైన వ్లాడి మీర్‌ పురిష్కేవిచ్‌ తుపాకీ తూటాలకి రాస్పుటిన్‌ గురికాక తప్పలేదు.

టీడీపీని కాంగ్రెస్‌ ‘గదారం’లో కలిపేయడానికి చంద్రబాబు ఎప్పుడు నిర్ణయించుకుని ఉంటాడు? రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోను ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజలు జగన్‌కి ఉధృతంగా నీరాజనాలు పడుతూ, రాష్ట్రంలో ఇక ‘దేశం’ పాలనకు ‘నూకలు’ చెల్లిపోయాయని ఈ ఏడాది కర్ణాటక సీఎంగా కుమారస్వామి బెంగళూరులో ప్రమా ణస్వీ కారం (మే 23) చేయడానికి సిద్ధమవుతున్న సమయంలోనే చంద్ర బాబు నిర్ణయించుకుని ఉండాలి. ఎందుకంటే ఆ సమయంలోనే అక్కడికి హాజరైన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో మొదటిసారిగా ‘గ్రీట్‌’ చేయడంతోనే సరిపెట్టుకోకుండా, కాంగ్రెస్‌ అధ్యక్షునితో భుజంతట్టి, ఆప్యాయంగా వీపు నిమరడం వరకు మహా కలివిడిగా బాబు రాసుకు తిరగడం వీడియోలన్నీ ప్రదర్శించాయి. ఇక ఆ తరువాత కేవలం కొద్ది రోజుల్లోనే సీను మారిపోయింది. ‘కన్యాశుల్కం’లో గిరీశం చెప్పినట్టు తాను దేశ ప్రతిపక్ష ఐక్యసంఘటన పేరిట ఆ నరుకుడు కాస్తా ఇటు టీడీపీతోనే ప్రారంభించి కాంగ్రెస్‌ను బురిడీ కొట్టించడం ద్వారా ‘నలభై ఏళ్ల కుట్రల రాజకీయ’ అనుభవంతో కాంగ్రెస్‌కు దగ్గరగా చేరి తన దృష్టిలో ‘కుర్ర కుంక’ అయిన రాహుల్‌ స్థానంలో తాను ప్రధానమంత్రి పదవికి ఎగబాకాలన్న కోరిక బాబు బుర్రలో పురుగై తొలచదని భావిం చడం మన తప్పిదం అవుతుంది. అందుచేత ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా స్థానం, స్థాయి కోల్పోతూ దారీతెన్నూ లేని స్థితిలో టీడీపీని రద్దు చేసో లేదా రద్దయ్యే పరిస్థితులు కల్పించో అంతిమంగా తన ఉనికిని తాను ‘ఊసరవెల్లి’లా కాపాడుకోవడానికి బాబు యత్నించడని భావించడం మన పొరపాటు అవుతుంది.

అందుకే కావచ్చు.. రామన్‌ మెగసెసే ప్రఖ్యాత అంతర్జాతీయ పుర స్కార గ్రహీత సందీప్‌ పాండే ‘రాజ్యాంగ రక్షణ గౌరవయాత్ర’ను తల పెట్టిన సందర్భంగా.. అమరావతిలో పంటభూముల్ని ‘రాజధాని పేరుతో కోల్పోయిన రైతుల్ని పరామర్శించిన’ అనంతరం చంద్రబాబు చేపట్టిన చర్యలు పరమ మూర్ఖంగా ఉన్నాయని, అది రఫేల్‌ విమానా లను మోదీ కొనుగోలు చేసిన రూ. 33 వేల కోట్ల కుంభకోణంకంటే పెద్దదని, అమరావతి భూముల కుంభకోణం రూ. 50 వేల కోట్లనీ ప్రక టన చేయవలసి వచ్చింది. కేంద్రంలో గతంలో ఐక్య సంఘటన ప్రభు త్వాల్ని ముంచడానికి, యూపీఏ రెండు ఫ్రంట్‌ ప్రభుత్వాల్ని మధ్యలో ముంచేయడానికి, బయటనుంచి కాంగ్రెస్‌ బలపర్చిన దేవెగౌడ (కేంద్ర) ప్రభుత్వాన్ని కూల్చడానికి చేయూతనిచ్చిన వ్యక్తి ఈనాడు, జగన్‌ ప్రభం జనాన్ని తట్టుకోలేక ‘చిక్కడు–దొరకడు’ లాంటి శివాజీ యుక్తులకు ప్రాణం పోసిన బాబేనని లోకం కోడై కూస్తోంది.

ఎన్టీఆర్‌ ఉన్నంతవరకు ‘దేశం’ పార్టీలోనే ఉంటూ, 2014 ఎన్నికల్లో అసెంబ్లీలో బలం కోసం బీజేపీతో అంటకాగి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభు త్వంలో భాగస్వామి అయ్యాక దాన్నుంచి మొన్ననే విడిపోయిన ‘తంతు’ ఒకటి కాగా, రాష్ట్రంలో 67 అసెంబ్లీ స్థానాలు మొదటిసారిగా గెల్చుకున్న వైసీపీ కాంగ్రెస్‌ నుంచి 23 మందిని కొనేసి ‘దేశం’లో కలుపుకుని, అలాగే వైసీపీ తాలూకు ముగ్గురు ఎంపీలనూ ప్రలోభానికి గురిచేసి బలం పెంచుకున్న ‘దేశం’ ప్రభుత్వానిది బలుపుకాదు, వాపు అని ప్రపంచానికి ఏనాడో తెలిసిపోయి, ప్రస్తుతం అది ‘వెంటిలేటర్‌’ మీద చావుబతుకుల్లో ఉందనీ రుజువవుతోంది. అయినా కాంగ్రెస్‌కు టీడీపీని తాకట్టుగా సమ ర్పించిన బాబు తన నిర్ణయం ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ ఉద్దేశంతో తీసు కొన్నదేనని బుకాయించడం, జగన్‌పై హత్యాప్రయత్నం ఘటనవల్ల పుట్టుకొచ్చిన ప్రచారం ఫలితంగా తీసుకున్న నిర్ణయం కాదనీ ఊరూ నాడూ చెప్పుకొనలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంద ర్భంగా ‘కులభ్రష్టుడిని, వంశ భ్రష్టుడిని వెలివేయాల’న్న సామెత తెలుగులో ఉంది. రాజకీయ నీతి అనేది ఈ సూత్రంపైనే ఆధారపడి ఉండాలి!

abkprasad2006@yahoo.co.in
ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement