అయ్యో.. చనిపోయింది నా కొడుకేనా!
ఓ కన్నతండ్రి గుండె కోత..
విధి ఆడిన వింత నాటకం
సెక్యూరిటీ సూపర్‌వైజర్: ‘హలో.. సార్.. మీ పోలీస్‌స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.. ఒకరు చనిపోయారు.. ఇద్దరు గాయపడ్డారు.. వారిని ఆసుపత్రికి తెచ్చారు.. మీ ఎస్సైని ఆసుపత్రికి పంపించండి..’ పోలీసులు: ఇప్పుడే వస్తున్నాం..!
కాసేపటి తర్వాత..
పోలీసులు వచ్చారు.. క్షతగాత్రులు, మృతుడి వివరాలు రాసుకుంటున్నారు.. సూపర్‌వైజర్ అక్కడే ఉన్నాడు.. పోలీసులు బైక్ నంబర్ రాశారు.. మృతుడి పేరు రాశారు.. ఆ వివరాలు చూడగానే పక్కనే ఉన్న సూపర్‌వైజర్‌కు గుండెలో పిడుగుపడింది! ఎందుకంటే ఆ బైక్ తన కొడుకుదే! చనిపోయింది ఎవరో కాదు.. ఆయన కొడుకే!! ‘అయ్యో దేవుడా... నా కొడుకు చనిపోయాడని నేనే పోలీసులకు చెప్పుకున్నానా..’ అంటూ ఆ తండ్రి గుండెలవిసేలా విలపించడం పలువురిని కంటతడి పెట్టించింది. విధి ఆడిన ఈ వింత నాటకానికి హైదరాబాద్‌లోని ఒవైసీ హాస్పిటల్ వేదికైంది.
నోట్ బుక్ కోసమని వెళ్లి..
నగరంలోని రియాసత్‌నగర్ దర్గా బర్హానే షా ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీం సంతోష్‌నగర్‌లోని ఒవైసీ ఆసుపత్రిలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. ఈయన కుమారుడు మహ్మద్ అబ్దుల్ ఆసీం(14) స్థానికంగా ఉన్న మాగ్నటిక్ హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఆసీం.. ఇద్దరు స్నేహితులు మహ్మద్ అబ్రార్(14), మహ్మద్ ఫౌజెన్(14)లతో కలసి చాంద్రాయణగుట్టలో ఉన్న మరో స్నేహితుడి ఇంటికి నోట్‌బుక్ తీసుకునేందుకు మ్యాస్ట్రో ద్విచక్ర వాహనం (ఏపి 11ఏటి7352)పై వెళ్లారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి బయల్దేరారు.
డీఎల్‌ఆర్‌ఎల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన స్కార్పియో (ఏపి09బిజి1867) వీరి వాహనాన్ని ఓవర్‌టేక్ చేసి అకస్మాత్తుగా యూ టర్న్ తీసుకుంది. దీంతో ఒక్కసారిగా విద్యార్థుల ద్విచక్ర వాహనం స్కార్పియోను ఢీకొంది. ముగ్గురు విద్యార్థులు ఎగిరి అవతలి వైపు రోడ్డులో పడిపోయారు. అటుపక్క వస్తున్న స్కార్పియో (ఏపీ 09 సి ఇ 3131) కింద పడబోయారు. కానీ డ్రైవర్ బ్రేక్‌లు వేశాడు.
వెంటనే అదే వాహనంలో వారిని సమీపంలోనే ఉన్న ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. ఆ వెంటనే ఆసీం మృతి చెందాడు. ఈ విషయాన్ని అదే ఆసుపత్రిలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న అలీం స్వయంగా చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు వచ్చి వివరాలు రాసుకుంటున్న సమయంలో.. అందులో తన కుమారుడి పేరు, బైక్ నంబర్ చూసిన అలీం కుప్పకూలాడు. వెంటనే వార్డులోనికి వెళ్లి కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు.
- హైదరాబాద్