రెట్టింపు రేట్లకు సీసీ కెమెరాల కొనుగోలు?
♦ ఒక్కో కెమెరాకు రూ.10,364
♦ మానిటరింగ్ యూనిట్‌కు రూ.20,431
♦ టీఎస్‌టీఎస్‌ను కాదని {పైవేటు సంస్థకు అప్పగింత
♦ కమీషన్ల దందాలో ఇంటర్మీడియట్ విద్యాశాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చాక్ పీసులకు నిధుల్లేవు. ప్రయోగశాలల్లో ప్రయోగ పరికరాలకు దిక్కులేదు. కానీ, జూనియర్ కాలేజీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు భారీగా నిధులు వెచ్చిం చేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సిద్ధమైంది. విద్యార్థులు చెల్లించిన స్పెషల్ ఫీజుల నిధుల్లోంచి సీసీ కెమెరాలు కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ విషయంలో ప్రభుత్వసంస్థ అయిన తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్(టీఎస్‌టీఎస్)ను సంప్రదించలేదు. కనీసం కాలేజీల వారీగా స్థానికంగా కెమెరాలను కొనుగోలు చేసుకోవాలని చెప్పలేదు. కాలేజీల్లో ఉన్న డబ్బును ఇంటర్మీడియట్ కమిషనరేట్‌కు తెప్పించి మరీ కేంద్రీకృత కొనుగోళ్లకు సిద్ధమైంది. ఒక్కో కెమెరాను రూ. 10,364తో కొనేందుకు ఓ ప్రైవేటు సంస్థను ఎంపిక చేసింది. అయితే రూ. 5 వేలు కూడా మించని ఒక్కో కెమెరాను కమీషన్ల కోసమే రెట్టింపు రేట్లతో కొనుగోలు చేస్తుందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
అక్రమాలకు ఆస్కారం!
ప్రస్తుతం రాష్ట్రంలోని 402 ప్రభుత్వం జూనియర్ కాలేజీలు ఉండగా వాటిల్లో ఒక్కో కాలేజీలో 4 చొప్పున 1,608 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 2,65,59,340 వెచ్చిస్తోంది. అత్యధిక సామర్థ్యం పేరుతో ఒక్కో కెమెరాకు రూ. 10,364 చొప్పున వెచ్చించి అక్రమాలకు తెరతీసినట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. 402 కాలేజీల్లో ఒక్కో మానిటరింగ్ యూని ట్‌కు రూ.20,431 చొప్పున వెచ్చిస్తోంది. తమకు కమీషన్లు ఇచ్చే ఎలక్ట్రానిక్ సంస్థతో కుమ్మక్కు అయి ఈ కొనుగోళ్లకు సిద్ధమైందన్న విమర్శలు ఉన్నాయి.
భద్రత కోసం ఈ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ కమిషనరేట్ పేర్కొంటున్నా ప్రిన్సిపాల్ రూమ్‌లు, స్టాఫ్ రూమ్‌లలో ఎందుకన్న విమర్శలు అధ్యాపక సిబ్బంది నుంచి వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం 220 కాలేజీల్లో ఇంట ర్నెట్ సదుపాయమే లేదు. 90 శాతం కాలేజీలకు ప్రహరీలు, 50 కాలేజీలకు విద్యుత్తు సరఫరా లేనేలేదు. నెట్ సదుపాయమే లేనప్పుడు అక్కడ ఏ జరుగుతుందో హైదరాబాద్‌లో ఉన్న ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఎలా చూస్తారన్నది అంతుచిక్కని ప్రశ్న. ప్రహరీలు, నైట్ వాచ్‌మెన్‌లు లేని కాలేజీల్లో కెమెరాలకు భద్రత ఎలా ఉంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభు త్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి.మధుసూదర్‌రెడ్డి డిమాండ్ చేశారు.