వర్గీకరణతో అట్టడుగు వర్గాలకు న్యాయం
ఎంపీ బూర నర్సయ్య గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఓబీసీ కేటగిరీలో ఉప వర్గీకరణ వల్ల బీసీల్లోని అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని టీఆర్‌ఎస్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అభిప్రాయపడ్డారు. వర్గీకరణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం తెలంగాణలో ఇప్పటికే అమలవుతోందని పేర్కొన్నారు. అలాగే క్రీమీలేయర్ కేటగిరీలో ఆదాయ పరిమి తిని రూ. 6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచడంపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లు 20 ఏళ్లుగా అమలవుతున్నా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఓబీసీల సంఖ్య 15 శాతం కూడా దాటక పోవడం శోచనీయ మన్నారు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వశాఖను ఏర్పాటు చేసి చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు.