ఏర్పాట్లు ముమ్మరం చేసిన నేతలు
పార్టీ బలోపేతం, కార్యకర్తల్లో ఉత్సాహమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనెల 24, 25 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ర్ట కాంగ్రెస్ సదస్సును ఏఐసీసీ ప్లీనరీ తరహాలో జరపాలని టీపీసీసీ భావి స్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. రెండురోజులపాటు జరిగే ఈ సదస్సు లో 10 అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, గత ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారిని తిరిగి పార్టీలోకి రప్పిం చడం, గ్రామ, పట్టణ, నగరాల్లో ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ పథకాల అమలు విషయుంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల విశ్వాసం పొందేందుకు అనుసరించాల్సిన వ్యూహం, ప్రతిపక్షంగా ప్రజల మన్ననలు పొండడం వంటి అంశాలను సదస్సులో చర్చిం చనున్నారు.
ఈ సదస్సుకు వచ్చే వారిని వారి ఆసక్తి మేరకు ఒక్కో అంశంపై ఒక్కో బృందం చొప్పున మొత్తం 10 బృందాలుగా విభజిస్తారు. ఆయా అంశాలపై బృందాల వారీగా చర్చించి ముసాయిదా తీర్మానాలు రూపొందిస్తారు. ఆ తర్వాత అవసరమైన మార్పులు చేసి తీర్మానాలను ఆమోదిస్తారు. మరోవైపు ఈ సదస్సుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వస్తారా.. లేదా.. అనేది ఇంకా ఖరారు కాలేదు.
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, కార్యదర్శి రామచంద్ర కుంతియా, కేంద్ర మాజీ మంత్రులు జైరాం రమేశ్, సల్మాన్‌ఖుర్షీద్, సచిన్ పైలట్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. మరికొందరు ఏఐసీసీ నాయకులు కూడా వచ్చే అవకాశాలున్నాయని టీపీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, పార్టీ బలోపేతంపై చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందిం చడం వంటి అంశాలపై ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై ఈ సదస్సు ఏర్పాట్లపై చర్చించారు.
ప్లీనరీ తరహాలో కాంగ్రెస్ సదస్సు
Published Fri, Aug 22 2014 2:40 AM | Last Updated on Fri, Aug 17 2018 6:00 PM
Advertisement