పండుగలా అవతరణ వేడుకలు
- పల్లె నుంచి ఢిల్లీ దాకా ఘనంగా నిర్వహించాలి: సీఎం
- జూన్ 2న ఉత్సవాలు.. 3న కేసీఆర్ కిట్స్ పంపిణీ
- 4న ఒంటరి మహిళలకు భృతి
సాక్షి, హైదరాబాద్: పల్లె నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రావతరణ దినోత్సవాలను పండుగలా నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో నివాళి అర్పించి, రాష్ట్ర అవతరణ ఉత్సవాలను ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రావతరణ దినోత్సవ ఏర్పాట్లకు సంబంధించి మంగళవారం ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. జూన్ 2న రాష్ట్రవ్యాప్తంగా అవతరణ దినోత్సవం నిర్వహించాలని, జూన్ 3న కేసీఆర్ కిట్స్, జూన్ 4న ఒంటరి మహిళలకు భృతి కార్యక్రమాలు ప్రారంభిం చాలని ఆదేశించారు. మండలం యూనిట్‌గా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతీ మండలంలో ఓ ప్రముఖుడు పాల్గొనేలా కార్యక్రమం రూపొందించుకోవాలని సూచించారు.
జిల్లా కేంద్రాల్లో మంత్రులతో పాటు ప్రభుత్వ విప్‌లు పతాకావిష్కరణ చేస్తార న్నారు. మండలాల్లో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ముఖ్య అతిథులుగా పాల్గొనాలన్నారు. అమరవీరుల స్తూపాలు లేని జిల్లా కేంద్రాల్లో తాత్కాలిక స్తూపాలు ఏర్పాటు చేసి నివాళులు అర్పిం చాలని, శాశ్వత అమరవీరుల స్తూపాలు నిర్మించాలన్నారు. హైదరాబాద్‌లో తానే స్వయంగా గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తానని చెప్పారు.