‘స్వచ్ఛ’ నగరాల్లో హైదరాబాద్‌కు 19వ స్థానం
♦ 5వ స్థానం దక్కించుకున్న వైజాగ్
♦ వరంగల్‌కు 32, విజయవాడకు 23వ స్థానం.. అగ్రస్థానంలో మైసూరు
♦ స్వచ్ఛ సర్వేక్షణ్ జాబితా విడుదల చేసిన కేంద్రమంత్రి వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ నగరాల్లో హైదరాబాద్‌కు 19వ స్థానం దక్కింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పరిశుభ్రతను ప్రోత్సహించడానికి, మౌలిక వసతుల కల్పనలో నగరాల మధ్య పోటీ పెంచడానికి స్వచ్ఛ సర్వేక్షణ్-2016 పేరుతో 73 నగరాల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం విడుదల చేశారు. దీనిలో మైసూరు(కర్ణాటక) ప్రథమ స్థానం దక్కించుకోగా.. ఆ తర్వాత వరుస స్థానాల్లో చంఢీగఢ్, తిరుచిరాపల్లి(తమిళనాడు), న్యూఢిల్లీ నిలిచాయి. తెలుగురాష్ట్రాల్లోని విశాఖపట్నం 5వ, హైదరాబాద్ 19, విజయవాడ 23, వరంగల్ 32వ స్థానం దక్కించుకున్నాయి. స్వతంత్ర పరిశీలన ర్యాంకింగ్‌లలో విశాఖ మొదటి స్థానంలో నిలిచి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రెండు అవార్డులను దక్కించుకుంది.
ప్రధాని మోదీ ప్రాతినిధ్య వహిస్తున్న వారణాసికి స్వచ్ఛ నగరాల్లో 65వ స్థానం దక్కడం గమనార్హం. 2014 ఫలితాలతో పోలిస్తే హైదరాబాద్, విశాఖపట్నం గణనీయమైన ప్రగతి సాధించాయి. పరిశుభ్రత విషయంలో నగరాల ప్రయత్నాలను అంచనా వేయడానికి ఈ సర్వేలో నిర్ణయించిన 2,000 మార్కులలో ఘన వ్యర్థాల నిర్వహణకు 60 శాతం, మరుగుదొడ్ల నిర్మాణానికి 30 శాతం, పారిశుధ్య వ్యూహాలు, ప్రవర్తనలో మార్పులకు 5 శాతం చొప్పున కేటాయించారని వెంకయ్యనాయుడు తెలిపారు. 2019 నాటికి పూర్తి స్వచ్ఛ భారత్‌ను సాధించాలన్నది ప్రధాని మోదీ ఆశయమని చెప్పారు.