పాతబస్తీలో మళ్లీ ఎన్‌ఐఏ సోదాలు | NIA raided again in the Old City | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో మళ్లీ ఎన్‌ఐఏ సోదాలు

Published Wed, Jul 6 2016 3:19 AM | Last Updated on Wed, Sep 19 2018 8:17 PM

పాతబస్తీలో మళ్లీ ఎన్‌ఐఏ సోదాలు - Sakshi

పాతబస్తీలో మళ్లీ ఎన్‌ఐఏ సోదాలు

- ఉగ్రమూకలు వెల్లడించిన సమాచారం ఆధారంగా సోదాలు
- కంప్యూటర్లు, స్కానర్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఐఏ
- నాందేడ్‌లో సీసీ కెమెరాలకు చిక్కకుండా రాత్రుళ్లు సంచారం
- ఇబ్రహీంకు షఫీ ఆర్మర్‌ను పరిచయం చేసిన వారిపై ఆరా
- గతంలో పట్టుబడిన సానుభూతిపరుల విచారణ
 
 సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) అధికారులు మంగళవారం మళ్లీ సోదాలు నిర్వహించారు. బార్కాస్, తలాబ్‌కట్టల్లో మూడు బృందాలుగా నిర్వహించిన ఈ సోదాల్లో 17 బుల్లెట్లు, రెండు స్కానర్లు, రెండు కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్రపన్నిన ఉదంతంలో ఎన్‌ఐఏ ఇప్పటికే ఐదుగురు ఉగ్ర సానుభూతిపరులను అరెస్టు చేయడం తెలిసిందే. దర్యాప్తులో ఐదు రోజులుగా వారు వెల్లడించిన అంశాల మేరకు ఎన్‌ఐఏ మళ్లీ సోదాలు నిర్వహించింది. తాలాబ్‌కట్టలోని ఇబ్రహీం నివాసంపై దాడి చేసి కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మీద పట్టున్న హబీబ్ నివాసంలో కంప్యూటర్‌తో పాటు 9 ఎంఎంకు చెందిన 17 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ కంప్యూటర్ ద్వారానే హబీబ్ తరచూ ఐసిస్ ముఖ్య నేత షఫీ ఆర్మర్‌తో మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు. ఇబ్రహీం బావమరిదికి చెందిన షాలిమార్ మీసేవా కేంద్రంలోని మరో కంప్యూటర్, స్కానర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

 నాందేడ్‌లో ఆధారాలు మాయం
 ఉగ్రమూకలు తమ కుట్రను గుట్టుగా ఉంచేందుకు వీలైనంత వరకు రాత్రుళ్లలోనే పని చేసుకుపోయినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది. ఐదుగురు ముఠా సభ్యులు తరచూ రాత్రిళ్లే సమావేశమయ్యేవారని ఉగ్ర సానుభూతిపరులు విచారణలో వెల్లడించారు. ఆయుధాల కోసం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పర్యటన కూడా పూర్తిగా రాత్రుళ్లే జరిగింది. విచారణలో భాగంగా అధికారులు వారిని నాందేడ్ తీసుకెళ్లి, వారు తిరిగిన ప్రాంతాలను పరిశీలించారు. చీకట్లో ముసుగులతో ఉన్న వీడియోలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పైగా నాందేడ్‌లో ఇబ్రహీం యజ్దానీ కలిసిన వ్యక్తులు పరారైనట్టు తెలిసింది.

 గతంలో పట్టుబడ్డవారితో సంబంధాలు?
 వరుస పేలుళ్లకు కుట్ర పన్నారని ఎన్‌ఐఏ అనుమానిస్తున్న ఉగ్రముఠా సభ్యులంతా కొత్తవారే. మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ అలియాస్ ఇబుతో పాటు మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, హబీబ్ మహ్మద్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్, అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఆమోదీ అలియాస్ ఫహాద్‌లను అన్సరుల్ తవ్హిద్ పి బిలాద్ అల్ హింద్ (ఏయూటీ)లో చేర్చిందెవరనే విషయంపై ఎన్‌ఐఏ లోతుగా ఆరా తీస్తోం ది. సిరియాలోని ఐసిస్ ముఖ్యనేత షఫీ ఆర్మర్‌ను వీరికి పరిచయం చేసిందెవరనే విషయం లో అధికారులకు స్పష్టత రావడంలేదు. గత సానుభూతిపరుల పాత్రను ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. దీనిపై ఉగ్ర ముఠా నోరు మెదపడం లేదని ఎన్‌ఐఏ వర్గాలంటున్నాయి.

 గతంలో చిక్కిన వారిని విచారిద్దాం
 దేశంలో పలు ప్రాంతాల నుంచి యువత భారీగా ఐసిస్‌లో చేరేందుకు వెళ్తూ నిఘా వర్గాలకు పట్టుబడ్డారు. గత జనవరి, ఫిబ్రవరిల్లో 16మంది సిరియా వెళ్లేందు కు సరిహద్దులు దాటుతూ పశ్చిమబెంగాల్, కశ్మీర్లలో పట్టుబడ్డారు. మార్చిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు యువకులు సిరియా వెళ్లబోతూ మహారాష్ట్రలోని నాగపూర్ విమానాశ్రయంలో ఎన్‌ఐఏకు పట్టుబడ్డారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన వారు గతేడాది కూడా టర్కీ వెళ్లబోయి పట్టుబడ్డారు. పోలీసులు వీరందరికీ కౌన్సెలింగిచ్చి వదిలేశా రు. కొత్త వారికెరికైనా వీరు సహకరించారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో గతంలో పట్టుబడిన వారిని మరోసారి విచారించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. కొం దరికి ఇప్పటికే నోటీసులిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement