వెలుగులు నింపుతా
‘పిచ్చుక గూళ్ల లాంటి ఇళ్లల్లో పాతికేళ్లుగా ఎలా నివాసం ఉంటున్నారు.. ఏరోజుకారోజు అన్నట్టుగా రోజు కూలీతో బతుకులీడుస్తున్న మీ భవిష్యత్ ఏమిటి.. ప్రభుత్వం నుంచి సాయం అందకపోతే ఎలా ?..’ అంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విస్తుపోయారు. కూకట్‌పల్లి ఇందిరానగర్, శ్రీశ్రీనగర్ వాసుల సమస్యలు విన్న ఆయన చలించిపోయారు. ‘మీ కష్టాలు..కన్నీళ్లు తుడిచేస్తా..సమస్యలు లేని బస్తీగా చేస్తా.. మీ బతుకుల్లో వెలుగు నింపుతా... సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి దత్తాత్రేయలను తీసుకువస్తా..పక్కా ఇళ్లు నిర్మిస్తా’నని వారికి భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే కృష్ణారావు ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా మంగళవారం వ్యవహరించారు.
ఇందిరానగర్, శ్రీశ్రీనగర్లలో పర్యటించారు. సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరిస్తా.. విద్యుత్, ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ ఆస్పత్రి, డ్రైనేజీలు నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రేషన్‌కార్డులు, అర్హులకు పింఛన్లు ఇప్పించే బాధ్యతను తీసుకుంటానన్నారు. పేదల సమస్యలు పరిష్కరించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు.
- కూకట్‌పల్లి
మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి ఎమ్మెల్యే