ప్రేమపెళ్లి కోసం వెళ్తే.. రాళ్లతో కొట్టి చంపారు
కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మనసుకు నచ్చని పెళ్లిని వ్యతిరేకించిన ముస్లిం యువతిని రాళ్లతో కొట్టి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అఫ్ఘాన్ మీడియా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేయడంతో ఈ అమానుషం వెలుగు చూసింది. అఫ్ఘానిస్తాన్‌లోని రాక్ సహానా అనే ముస్లిం యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఈ పెళ్లి ఇష్టం లేని ఆమె తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి పారిపోయి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని ప్రయత్నించింది. అదే ఆమె చేసిన నేరం. తాలిబన్లు ఆమెపై తమ ప్రతాపాన్ని చూపించారు. ప్రియుడితో కలిసి వెళుతుండగా పట్టుకుని అతి దారుణంగా రాళ్లతో కొట్టి చంపేశారు. ఈ మొత్తం వైనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు మీడియాలో బయటపడింది.
దాదాపు 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో 20 ఏళ్ల వయసున్న రాక్ సహానా హృదయ విదారక రోదనలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. అక్కడున్నవాళ్లంతా ఈ దృశ్యాలను చూస్తూ ఉండిపోయారు తప్ప ఏమీ చేయలేదు. ఆమెపై రాళ్లు విసురుతున్న శబ్దం, షహాదా అంటూ ఆమె పెట్టిన ఆర్తనాదాలు క్రమేపీ సన్నగిల్లడం ఈ వీడియోలో స్పష్టంగా ఉంది.
ఆ అమానుషం గతవారం ఘర్ రాష్ట్రంలోచోటుచేసుకుందని స్థానిక మహిళా గవర్నర్ సీమ జోయేంద్ర తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సమస్యలు ఎదుర్కొంటున్నా, ఘర్ ప్రాంతంలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మతపెద్దలు, ఇతర సాయుధుల సమక్షంలో ఆ యువతిని రాళ్లతో కొట్టి చంపారని ఆమె తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.