దూసుకొస్తున్న ఇర్మా.. 'దేవుడు రక్షిస్తాడు'
బార్బుడా: ఇప్పటికే అమెరికాలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేసి హార్వీ తుఫాను వెళ్లిపోగా మరో పెను తుఫాను వాయువేగంతో దూసుకొస్తోంది. అది కూడా హార్వీని మించిన రీతిలో ఐదో కేటగిరికి చెందిన తుఫాను ఉధృతంగా ప్రతాపం చూపించనుంది. బుధవారంనాటికి కరేబియన్ దీవుల్లోని ఈశాన్య భాగంలోకి వ్యాపించిన ఇర్మా.. ప్యూరిటో రికో, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, క్యూబా గుండా వారంతంలోగా ఫ్లోరిడాను చుట్టుముట్టనుంది. ఇప్పటికే దీని తీవ్రతను పరీక్షించిన వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలంతా తగిన జాగ్రత్తలతో సిద్ధంగా ఉండాలని, ప్రభుత్వం ఏర్పాటుచేసిన రక్షణ స్థావరాల్లోకి చేరుకోవాలని చెబుతున్నారు.
అంతేకాకుండా.. 'దేవుడు మనందరినీ ఇర్మా బారీ నుంచి రక్షించునుగాక' అంటూ కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. మియామిలోని అమెరికా జాతీయ తుఫాను హెచ్చిరికా కేంద్రం నమోదు చేసిన వివరాల ప్రకారం ఈ తుఫాను కేంద్రం చుట్టూ గంటకు 295కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న గాలులు ఉన్నాయి. ఇప్పటికే కరేబియన్ దీవుల్లో అడుగుపెట్టిన ఇర్మా కారణంగా స్థానిక ఫోన్ లైన్లు దెబ్బతిన్నాయని, రేడియోలు ఆగిపోయాయని పలు శిధిలాలు ఆకాశంలో పక్షుల మాదిరిగా ఎగురుతున్నాయని తెలుస్తోంది. సరిగ్గా 1.47గంటల ప్రాంతంలో బార్బుడాను ఇర్మా దాటిందని ఫ్లోరిడా వైపు పరుగెడుతోందట.