ఖాట్మండ్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనలో భాగంగా ముక్తినాథ్ దేవాలయాన్ని శనివారం సందర్శించారు. ప్రపంచ నేతలు ఎవరూ కూడా ఇప్పటివరకు ఈ దేవాలయాన్ని సందర్శించలేదు. ఈ ఆలయం గర్భగుడిలో పూజలు నిర్వహించిన మొదటి విదేశీ నేత మోదీనే అని నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తెలిపారు. నేపాల్‌లో రెండో రోజు పర్యటనలో భాగంగా హిందూ బౌద్ధులకు పవిత్రమైన ముక్తినాథ్ వ్యాలీలోని ఆ దేవాలయాన్ని సందర్శించారు.
ఆలయ సందర్శనానంతరం, అక్కడి ప్రజలతో మోదీ మాట్లాడారు. మోదీ బౌద్ధ మత ఆచారం ప్రకారం దుస్తులు ధరించారు. హిందూ, బౌద్ధ మతాల ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఇండియాకు తిరిగివచ్చే ముందు నేపాల్‌లోని పశుపతి దేవాలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నట్లు సమాచారం. రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా నేపాల్‌లోని జనక్‌పూర్‌ను అభివృద్ధి చేయడానికి వందకోట్ల సహాయాన్ని అందించనున్నట్లు మోదీ తెలిపారు. సీతమ్మ వారి పుట్టినిల్లు జనక్‌పూర్ అని, అత్తవారిల్లు అయోధ్య అని.. అందుకే వీటి మధ్య బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ తెలిపారు. జనక్‌పూర్ నుంచి అయోధ్య వరకు నడిచే నేపాల్-ఇండియా బస్సు సర్వీస్‌ను ఆయన ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు మోదీ, ఓలీలు తెలిపారు. అయితే కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ముక్తినాథ్ దేవాలయ సందర్శించడంంపై కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ విమర్శించారు. కర్ణాటకలోని హిందూ ఓటర్లను ప్రభావితం చేసే ఉద్దేశంతో మోదీ దేవాలయాన్ని సందర్శించారని కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment