- నైజీరియాలో ఆత్మాహుతి దాడి; 78 మంది విద్యార్థుల మృతి
అబుజా: నైజీరియాలోని ఓ స్కూల్లో ఉగ్రవాదులు రక్తపాతం సృష్టించారు. అభం శుభం తెలియని 78 మంది విద్యార్థులను ఆత్మాహుతి బాంబు దాడితో బలి తీసుకున్నారు. ఈ ఘటనలో 45 మంది వరకూ గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని యోబే రాష్ట్రం, పోటిస్కన్ పట్టణంలో ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
ఉదయం తరగతులు ప్రారంభం కావడానికి ముందు ప్రార్థన కోసం 2 వేల మంది విద్యార్థులు ఒకే చోట చేరిన సమయంలో పేలుడు చోటు చేసుకున్నట్లు యోబే రాష్ట్ర పోలీస్ విభాగం ప్రతినిధి ఒజుక్వు ‘జిన్హువా’ వార్తా సంస్థకు తెలిపారు. స్కూల్ డ్రెస్‌లో వచ్చిన ఫిదాయీ ఈ పేలుడుకు పాల్పడినట్లు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారు వెల్లడించారు.
మృతుల సంఖ్యను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. 100 మంది వరకూ బాధితులు చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చినట్లు జిన్హువా పేర్కొం ది. బాంబు పేలుడు బాధితులు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయినట్లు ఓ టీచర్ వెల్లడించారు.