కన్నతల్లి వద్దనుకుంది. పొత్తిళ్లలో ఉన్నప్పుడే మరొకరి చేతిలో పెట్టేసింది. ఆ బిడ్డ పెరిగి పెద్దయ్యాడు. ఏకంగా స్విట్జర్లాండ్ దేశ పార్లమెంట్‌కు ఎంపీగా ఎన్నికయ్యాడు. తల్లి వద్దనుకున్న ఆ బిడ్డే.. తాను కన్న బిడ్డకు ఆ తల్లిపేరే పెట్టుకున్నాడు. ఎన్నోచేసిన తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసే ‘పుత్రరత్నాల’ను ఈ ఎంపీ జీవిత కథ కొంతైనా మారుస్తుంది. మరి ఆ జరిగిన కథేంటో చదివేద్దామా..
నిక్లాస్ శామ్యూల్ గుగ్గర్... స్విట్జర్లాండ్ పార్లమెంట్‌కు ఎంపీగా ఎన్నికైన తొలి భారతీయ సంతతి వ్యక్తి. భారత విదేశాంగశాఖ నిర్వహించిన ‘భారత సంతతి ఎంపీల కాన్ఫరెన్స్’లో పాల్గొన్న ఆయన తనగురించి చెప్పి.. ఎంతోమందిని కదిలించాడు. వేదికపై ఆయన మాట్లాడుతూ.... ‘ నా పేరు నిక్. పూర్తిపేరు నిక్లాస్ శామ్యూల్ గుగ్గర్. పుట్టింది భారతదేశంలోని కర్ణాటకలోని ఉడిపి ప్రాంతంలోగల లాంబార్డ్ మెమొరియల్ హాస్పిటల్‌లో. నా తల్లిపేరు పేరు అనసూయ. పుట్టగానే నా బాబు భారం మోయలేనంటూ అక్కడి డాక్టర్ ప్లగ్‌ఫెల్డర్‌కు అప్పగించి వెళ్లిపోయింది. వారం రోజుల తర్వాత స్విస్‌కు చెందిన ఫ్రిట్జ్, ఎలిజబెత్ దంపతులు నన్ను దత్తత తీసుకున్నారు. నిక్లాస్ అని పేరుపెట్టారు. అక్కడి నుంచి కేరళ వెళ్లి నాలుగేళ్లపాటు అక్కడే ఉన్నాం.
ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లో స్థిరపడ్డాం. పెద్దగా డబ్బున్న కుటుంబం కాకపోవడంతో చదువు కొనసాగించడం కోసం ట్రక్ డ్రైవర్‌గా కూడా పనిచేశాను. 2002లో తొలిసారి వింటర్‌తుర్ అనే సిటీలో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యా. గతేడాది నవంబర్‌లో స్విస్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యా. కేరళలోని ఓ స్వచ్ఛంద సంస్థకు నావంతు సహకారాన్ని అందిస్తున్నా. నాలో ఇండియా, స్విస్ సంస్కృతులు రెండూ ఉన్నాయి. కన్నభూమిని, కన్న తల్లిని ఎప్పటికీ మర్చిపోను. అందుకే నా కూతురుకు ‘అనసూయ’ అనే పేరు పెట్టుకున్నా. ఇన్నేళ్లయినా నా తల్లి ఎక్కడుందో తెలుసుకోలేకపోయా’ంటూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment