ఆ సమయంలో సంగీతం వద్దు!
లండన్: శస్త్రచికిత్స చేసే సమయంలో సంగీతం వినిపించేలా చేయడం వల్ల రోగులకు, వైద్యులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. శస్త్రచికిత్స సమయంలో మ్యూజిక్ ప్లే చేస్తే సీనియర్, జూనియర్ డాక్టర్ల మధ్య సయన్వయ లోపం తలెత్తవచ్చని, ఇది చివరకు వారిలో ఒత్తిడికి దారి తీయవచ్చని పరిశోధకులు అన్నారు. అంతిమంగా రోగిపై ఇది ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 50-70 శాతం శస్త్రచికిత్సలకు మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. శస్త్రచికిత్స చేసే సమయంలో సంగీతం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే అంశంపై లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్‌కు చెందిన షరాన్ వెల్డన్ బృందం అధ్యయనం జరిపింది.
దీనిలో భాగంగా బ్రిటన్‌లో 20 శస్త్రచికిత్సల్ని పరిశీలించారు. ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా పరికరం కావాల్సి వచ్చినప్పుడు సంగీతం వల్ల ఎక్కువ సార్లు అడగాల్సి వస్తుంది. ఇలాంటి ఇబ్బందుల వల్ల రోగి భద్రత విషయంలో సమస్యలు తలెత్తవచ్చని వెల్డన్ వెల్లడించారు. అయితే సంగీతం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నప్పటికీ, ఇబ్బందులే ఎక్కువని ఆయన అన్నారు.