కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న దేవ్ చిత్ర యూనిట్ వరదల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలిలో జరుగుతుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు చిత్ర బృందం షూటింగ్‌ను రద్దు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ సినిమాకు పనిచేస్తున్న 140 మంది వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతుండటం వల్ల వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిత్ర నిర్మాత లక్ష్మణ్‌కు దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వాటిలినట్టు తెలుస్తోంది. వారికి ప్రస్తుతానికి తినడానికి ఏం దొరకడం లేదని తెలుస్తోంది.
‘మంచు కురిసేటప్పుడు కొన్ని సీన్లు చిత్రీకరించడానికి.. మేము ఇక్కడికి వచ్చాం. మాకు ఇక్కడున్న వాతావరణం కూడా చాలా బాగా కుదిరింది. ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీచేయలేదు. నిన్నటి వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడానికి వీలులేకుండా దారులన్నీ మూసుకుపోయాయి. నేను కారులోనే నాలుగైదు గంటలు కూర్చుండిపోయాను. తర్వాత దగ్గరలోని ఓ గ్రామానికి వచ్చాను. కొండపై భాగంలో ఈ చిత్రానికి పనిచేస్తున్న 140 మంది ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా చిక్కుకుపోవడం బాధగా ఉంద’ని కార్తీ ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.
Published Mon, Sep 24 2018 5:04 PM | Last Updated on Mon, Sep 24 2018 6:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment