బాయ్‌ఫ్రెండ్‌ టైమ్‌ వేస్ట్‌ | Model And Actress Juhikhan Special Interview | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌ టైమ్‌ వేస్ట్‌

Published Fri, Nov 1 2019 8:15 AM | Last Updated on Fri, Nov 1 2019 8:15 AM

Model And Actress Juhikhan Special Interview - Sakshi

బాయ్‌ఫ్రెండ్‌ ఉండడం స్టేటస్‌ సింబల్‌గా ఎందరో అమ్మాయిలు ఫీలవుతుంటే.. ‘బాయ్‌ఫ్రెండ్‌ ఓ పెద్ద టైమ్‌వేస్ట్‌ మాత్రమే’ అంటోంది యంగ్‌ బ్యూటీ జుహీఖాన్‌.మోడలింగ్, మ్యూజిక్‌ వీడియోలు, వెబ్‌సిరీస్, అందాల పోటీలు.. అలా అలా సిల్వర్‌స్క్రీన్‌కు కూడా వచ్చేసింది. మొదటి చిత్రంతోనే బాలీవుడ్‌లో నిన్నటి అగ్రహీరోగోవిందాతో జతకట్టింది ఈ నాగ్‌పూర్‌ సుందరి. త్వరలో టాలీవుడ్‌లోనూ తెరంగేట్రం చేయనుంది. ఇటీవల నగరానికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో జుహీఖాన్‌ పంచుకున్నవిశేషాలు ఆమె మాటల్లోనే..

సాక్షి, సిటీబ్యూరో: మా నాన్న బ్యాంక్‌ ఉద్యోగి. అమ్మ గృహిణి అంతేకాదు మంచి రచయిత కూడా. చిన్నప్పటి నుంచీ నా ఇష్టాన్ని తల్లిదండ్రులు ఎప్పుడూ  కాదనలేదు. మనసు ఏది చెబితే అది చేయమనేవారు. యుక్త వయసులో ఏదేదో అవుదామనుకునే చాలా మందిలాగే నేను కూడా అనుకున్నాను. నాకు డ్యాన్స్, సినిమాలపై ఉన్న ఆసక్తి నన్ను ఇటు తీసుకువచ్చింది. అయితే డిగ్రీ పూర్తి చేశాకే ఏదైనా అన్నారు పేరెంట్స్‌. విజువల్‌ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ చేశాను. అందులో ఏడాది పాటు ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సు కూడా ఉంది. ఆ సమయంలో ఎన్నో డాక్యుమెంట్రీలు కూడా చేశాను. ‘జుహీ బీచ్‌’ మీద డాక్యుమెంటరీ చేసింది నేను మాత్రమే. పంజాబీతో సహా పలు మ్యూజిక్‌ వీడియోస్‌లో చేశాను. అలాగే ఇండియన్‌ ప్రిన్సెస్‌ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో ‘మిస్‌ ఇండియా టూరిజం’ టైటిల్‌ గెలుచుకుని అంతర్జాతీయంగా భారత్‌ తరఫున టైటిల్‌కి పోటీపడి టాప్‌–10లో నిలిచాను. తర్వాత గోవిందా సినిమా ‘ఆగయా’ ఆడిషన్స్‌లో సెలక్ట్‌ అయ్యాను. 

‘మీటూ’ భయాల్లేవు..
సినిమా రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవడమంటే అమ్మాయిలకు అంత సులభం కాదని తెలుసు. వ్యయప్రయాసలకు సిద్ధమవాలి. అయినప్పటికీ గ్లామర్‌ రంగం అంటే ఆసక్తితో నాలాంటి ఎందరో యువతులు సినిమాలకు సై అంటున్నారు. అలా అన్నా అవకాశాలు మాత్రం అంత తేలిగ్గా రావడం లేదు. చాలా త్యాగాలకు సిద్ధపడాలి అని అంటున్నారు. ‘మీటూ’ ఉదంతాలు, వివాదాలు నన్నుగాని, నా పేరెంట్స్‌ని గాని భయపెట్టలేదు. ఎందుకంటే ఏ రంగంలో ఎదగాలన్నా ఇప్పుడు పోటీతో పాటు రకరకాల మనుషులను, మనస్తత్వాలను ఎదుర్కోవాలని నాకు తెలుసు.  

వివాదాలతో విజయం రాదు
కావాలని వివాదాలు సృష్టించడం నా వల్ల కాదు. నా టాలెంట్‌తో పేరు తెచ్చుకోవాలని తప్ప మరో రకంగా పేరు రావాలని కోరుకోను. అనుకోకుండా వివాదాలు వస్తే వస్తాయి. వాటిని ఎలా ఫేస్‌ చేయాలో చేస్తా. కొంతమంది కొత్త తారలు చేస్తే చేస్తుండొచ్చు కానీ, వివాదాల ద్వారా పేరు తెచ్చుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోను. అలాగే ఎవరైనా ఒక అమ్మాయిని తన సినిమా కేరక్టర్ల ద్వారా జడ్జ్‌ చేయడం సరైంది కాదని నా అభిప్రాయం. 

హాట్‌ మూవీస్‌కి ‘నో’

అభిమాన హీరోయిన్‌ అంటే చెప్పలేను. నూతన్, శ్రీదేవి, మధుబాల.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా నా అభిమాన తారలు. దక్షిణాది సినిమాలు కూడా చూస్తుంటాను. తెలుగు సినిమాలు కూడా బాగా చూశాను. అల్లు అర్జున్, కమల్‌హసన్‌.. చాలా మంది హీరోల సినిమాలు చూశా. ఐటమ్‌ సాంగ్స్‌కి మాత్రం ప్రస్తుతానికి నో. సినిమా రంగంలో ఎందరో హీరోయిన్లు ఇప్పుడు చేస్తున్న అన్ని రకాల ఫ్యామిలీ, రొమాంటిక్‌ పాత్రలు చేయడానికి నేను సిద్ధం. అయితే, పూర్తిగా హాట్‌ మూవీస్‌ లేదా ‘ఎ’ రేటింగ్‌ అంటే మాత్రం అంగీకరించను. నా తొలి ప్రాధాన్యం అభినయ ప్రధాన పాత్రలకే. బాలీవుడ్‌లో ప్రస్తుతం కొన్ని సినిమాల చర్చలు నడుస్తున్నాయి. టాలీవుడ్‌లో ఒక సినిమా అంగీకరించాను. ఆ వివరాలు త్వరలో నిర్మాత, దర్శకులు ప్రకటిస్తారు.  

టైమ్‌ వేస్ట్‌ బాయ్‌ఫ్రెండ్స్‌
యుక్త వయసులో ఉన్నప్పుడు నా స్నేహితురాళ్లు ఒక్కొక్కరు ఇద్దరు ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్‌ని మెయిన్‌టెయిన్‌ చేయడం నాకు తెలుసు. అయితే అదంతా టైమ్‌ వేస్ట్‌ అని నా అభిప్రాయం. అందుకే నాకు బాయ్‌ఫ్రెండ్స్‌ లేరు. అందాల పోటీలకు వెళ్లినప్పుడు చాలా మందిని చూశాను. ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు ఉండేవారు. వాళ్లతో చాటింగ్, కాల్స్‌.. ఎంత టైమ్‌ వేస్టో.. బాయ్‌ఫ్రెండ్‌/గాళ్‌ ఫ్రెండ్స్‌ అంతా టైమ్, డబ్బు అన్నీ వేస్ట్‌ అని నా అభిప్రాయం. తొలుత మనం ఎంచుకున్న కెరీర్‌లో రాణించడం మీద దృష్టి పెట్టాలి.

నాకు డ్యాన్సింగ్‌ టాలెంట్‌ ఉంది. చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌తోనే చాలా గుర్తింపు పొందాను. పాటలు, కవితలు రాయగలను. ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మ్యూజిక్‌ వీడియోస్‌కి రాయడం అంటే ఇష్టం. ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్త తీసుకుంటాను. ఫిట్‌నెస్‌ అంటే.. యోగా ప్రాక్టీషనర్‌ని. జిమ్‌కు ఎక్కువగా వెళ్లనుగాని అప్పుడప్పుడు చేస్తాను. నేను బాగా తింటాను. అయితే ఏం తింటున్నా అనే స్పృహతో తింటాను. మంచి ఫుడ్, సరైన టైమ్‌కి తినాలి. అదే నా ఆరోగ్య సూత్రం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement