బుల్లితెర ఎంట్రీకి భారీ స్కెచ్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెర మీద సందడి చేయనున్న సంగతి తెలిసిందే. నార్త్లో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ షో తెలుగు వర్షన్కు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్నాడు. ఇటీవల షోలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోందో రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ను కూడా రిలీజ్ చేశారు షో నిర్వాహకులు. అయితే ఈ షోను ఎలాగైన సక్సెస్ చేయాలని ఎన్టీఆర్ పక్కాగా ప్లాన్ చేస్తున్నాడట.
ప్రస్తుతం చిరంజీవి వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో ఎన్టీఆర్ తన షో అలా కాకూడదని భావిస్తున్నాడట. అందుకే తన షో షూట్కు టాప్ క్లాస్ టెక్నిషియన్స్ను ఎంపిక చేస్తున్నాడు. షూటింగ్ కూడా హైదరాబాద్ లోని స్టూడియోస్లో కాకుండా ముంబైలో చేసేందుకు షో నిర్వహకులను ఒప్పించాడన్న టాక్ వినిపిస్తోంది.
నాగార్జున, చిరంజీవిలు కూడా తమ షోను అన్నపూర్ణ స్టూడియోస్ లోనే షూట్ చేశారు. కానీ ఎన్టీఆర్ మాత్రం టాప్ టెక్నిషియన్స్తో ముంబైలో వర్క్ చేయబోతున్నాడు. ఛానల్ కూడా ఈ షోను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో ఎంత ఖర్చైన వెనుకాడకుండా ఎన్టీఆర్ కండిషన్స్ అన్నింటికీ అంగీకరిస్తుందన్నప్రచారం జరుగుతోంది. జై లవ కుశ షూటింగ్ పూర్తయిన తరువాత ఆగస్టు నుంచి బిగ్ బాస్ షూట్ ప్రారంభించనున్నాడు ఎన్టీఆర్.