రిస్క్ చేస్తున్న తమిళ హీరో
తమిళనాట వరుస సినిమాలతో దూసుకుపోతున్న తెలుగబ్బాయి విశాల్. తెలుగులో కూడా మంచి మార్కెట్ సాధించుకున్న విశాల్, తన ప్రతీ సినిమాను తమిళ్తో పాటు తెలుగులో కూడా భారీగా రిలీజ్ చేస్తుంటాడు. విశాల్ హీరోగా ఇటీవల తమిళంలో రిలీజ్ అయిన సినిమా కత్తి సండై. కోలీవుడ్లో అక్టోబర్ లోనే రిలీజ్ అయిన ఈ సినిమాను నవంబర్ 18న తెలుగులో ఒక్కడొచ్చాడు పేరుతో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో రిలీజ్ వాయిదా వేసుకున్నారు.
ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయాలని భావించినా.. తాజాగా సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్లతో పాటు శతమానంభవతి సినిమాతో శర్వానంద్ కూడా బరిలో దిగుతున్నాడు. ఇంత పోటిలో విశాల్, ఓ డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ అన్న టాక్ వినిపిస్తుంది. మరి విశాల్, ఆ రిస్క్ చేయడానికి రెడీ అవుతాడో..? లేక డిసెంబర్లో ఒక్కడొచ్చాడు సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తాడో .? చూడాలి.