ఆన్లైన్లో అమ్మకానికి అఖిలేష్ ల్యాప్టాప్లు
ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఆర్భాటంగా పంపిణీ చేసిన ఉచిత ల్యాప్టాప్లు ఆన్లైన్లో అమ్మకానికి వెళ్తున్నాయి. మొరాదాబాద్లో ఓ టీచర్ ఇలా వచ్చిన ఉచిత ల్యాప్టాప్ను ఆన్లైన్లో అమ్మకానికి పెట్టి దొరికిపోయారు. ఆవిడ 14వేల రూపాయలకు దాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ అసలు ప్రభుత్వం వీటిని ఇచ్చింది విద్యార్థులు, విద్యార్థినులకు అయితే.. టీచర్ చేతికి ఎలా వచ్చిందని ఆరా తీస్తే.. ఓ విద్యార్థిని తండ్రా ఆ ల్యాప్టాప్ను సదరు టీచర్కు అమ్మాడట. 'ములాయం వాలా ల్యాప్టాప్ ఔర్ సాథ్మే నెట్ సెట్టర్, న్యూ కీబోర్డ్, మౌస్' అనే డిస్క్రిప్షన్తో ఆమె ఆ యాడ్ పెట్టారు. తాను బీఎస్సీ మ్యాథ్స్, బీఈడీ చేశానని, ప్రభుత్వోద్యోగం ఉన్నా కూడా డబ్బులు చాలక దీన్ని అమ్ముతున్నానని ఆమె చెప్పారు.
2012 సంవత్సరంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 10 నుంచి 12వ తరగతి వరకు చదివిన పిల్లలకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేశారు. కానీ చాలామంది వాటిని ఉపయోగించుకోకుండా.. ఇలా చేతులు మార్చుకున్నట్లు మొదట్లోనే కథనాలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆన్లైన్ అమ్మకాలు కూడా మొదలు కావడంతో వ్యవహారం బట్టబయలైంది. మొరాదాబాద్ జిల్లాలో ఒక్కోటీ రూ. 19వేల విలువ చేసే 24,143 ల్యాప్టాప్లను పంచినట్లు జిల్లా స్కూల్స్ ఇన్స్పెక్టర్ శర్వణ్ కుమార్ యాదవ్ తెలిపారు.