సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లో ఆశా (అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ ఆక్టివిస్ట్స్) కార్యకర్తలు డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొత్తం దేశంలో దాదాపు పది లక్షల మంది ఆశా కార్యకర్తలు ఉండగా వారిలో 93,687 మందితో దేశంలోనే రెండో స్థానంలో బిహార్ ఉంది. వీరంతా 12 డిమాండ్లతో డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు పూర్తిగా స్తంభించి పోయాయి. డిసెంబర్ 13, 14 తేదీల్లో ఆశా కార్యకర్తలు జిల్లా ఆస్పత్రులను, సివిల్ సర్జన్ కార్యాలయాలను దిగ్బంధం చేశారు. చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడించారు.
రాష్ట్రంలోని మూడు ఆశా యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆశా సంయుక్త్ సంఘర్శ్ మంచ్ పిలుపు మేరకు ఆశా కార్యకర్తల సమ్మె దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్ద వారు రాత్రనక, పగలనకా భైఠాయింపు సమ్మె చేస్తున్నారు. వారికి మద్దతుగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. వారు ఆశా కార్యకర్తలకు అన్న పానీయాలను అందించడంతోపాటు రాత్రిపూట చలిని తట్టుకునేందుకు బ్లాంకెట్లు కూడా తెచ్చి ఇస్తున్నారు. తమకు కూడా ప్రభుత్వ హోదా కల్పించి కనీసవేతనంగా 18 వేల రూపాయలు ఇవ్వాలని, పింఛను సౌకర్యం కల్పించాలని, ఈఎస్‌ఐ, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సౌకర్యాలను కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వారిని ఆరోగ్య కార్యకర్తలుగా ప్రభుత్వం పరిగణస్తూ టోకున గౌరవ వేతనం చెల్లిస్తుండగా, ఇక గ్రామీణ ప్రజలేమో ఇప్పటికీ వారిని సామాజిక కార్యకర్తలుగా పరిగణిస్తున్నారు.
తమ డిమాండ్‌లు ఇప్పుడే చేస్తున్న కొత్త డిమాండ్లేవి కావని, 2015లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నవేనని ఆశా కార్యకర్తల నాయకులు తెలియజేస్తున్నారు. నెలవారి జీతాలను, పని పరిస్థితులను హేతుబద్ధం చేయడానికి 2015లో ఉన్నత స్థాయి కమిటీని వేశారని, ఆ కమిటీ చేసిన సిఫార్సులను కూడా నేటికి అమలు చేయడం లేదని నాయకులు విమర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని తరగతుల వారు, పట్టణ ప్రాంతాల్లో పేద వాళ్లు, దిగువ తరగతి వాళ్లు ఆశాను నమ్ముకొని బతుకుతున్నారు. ‘జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి మందికి ఒకరు చొప్పున ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా వారు ప్రతిరోజు 18 గంటలపాటు పనిచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment