‘డిజిటల్’పై సైబర్ నేరగాళ్ల కన్ను
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ నగదు రూపంలో నుంచి క్రమంగా డిజిటల్ రూపంలోకి మారుతోంది. దీన్ని అనుకూలంగా మలుచుకు నేందుకు సైబర్ నేరగాళ్లు కూడా డిజిటల్ వ్యవస్థను కొల్లగొట్టేందుకు మాటేశారు. పెద్ద నోట్ల రద్దు, ఇతర కారణాల వల్ల దేశంలో చాలా మంది తొలిసారి ప్లాస్టిక్ కరెన్సీ (బ్యాంకు కార్డులతో) లావాదేవీలు జరుపుతున్నారు. బాగా చదువుకున్న వారు కూడా డిజిటల్ లావాదేవీల్లో పొరపాట్లు చేస్తున్న నేపథ్యంలో నిరక్షరాస్యులు సులభంగా నష్టపోయే అవకాశముంది. ఐరాస లెక్కల ప్రకారం.. 28.7 కోట్ల మంది నిరక్షరాస్య వయోజనులున్న భారత్‌లో నగదు రహిత లావాదేవీలు ఎలా సాధ్యమన్న ప్రశ్న పుట్టుకొస్తోంది.
భారీ నేరాలు: ఈ ఏడాది మొదట్లో ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులకు చెందిన 32 లక్షల డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు తస్కరణకు గురైన కేసులో పురోగతి కనిపించలేదు. గత ఏడాది ఒకే నెలలో సైబర్ నేరగాళ్లు ప్రపంచ వ్యాప్తంగా 100 బ్యాంకుల సమాచారాన్ని చోరీ చేసి వంద కోట్ల డాలర్లను కొల్లగొట్టారు. అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌లోని గట్టి సైబర్ భద్రత ఉండే కంప్యూటర్ల సమాచారమూ వీరి బారిన పడింది. ప్రపంచవ్యాప్తంగా పలు కేసులను గమనిస్తే.. ఇప్పుడిప్పుడే ప్లాస్టిక్ కరెన్సీకి అలవాటు పడుతున్న భారత్‌లో ఎలక్ట్రానిక్ వాలెట్లు, పేమెంట్ గేట్‌వేలు ఎంతవరకు సురక్షితమనే అనుమానాలు తలెత్తుతున్నాయి.