ప్రజ్ఞాశాలి మాలవీయ
న్యూఢిల్లీ: బెనారస్ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడైన మదన్ మోహన్ మాలవీయ బహుముఖ వ్యక్తిత్వం కలిగిన విద్యావేత్త. హిందూ మహాసభ తొలినాళ్ల నాయకుడైన మాలవ్యా సమాజ సంస్కర్త, విజయవంతమైన పార్లమెంటేరియన్. స్వాతంత్య్రోద్యమ పథనిర్దేశకులలో ఒకరిగా చెప్పుకోదగిన మాలవీయ మితవాదులకు, అతివాదులకు మధ్య వారధిగా పనిచేశారు. 1886లో కోల్‌కతా (అప్పటి కలకత్తా)లో జరిగిన రెండవ కాంగ్రెస్ మహాసభలో స్ఫూర్తిదాయకమైన తన ప్రసంగంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. యాైభైఏళ్లపాటు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడుగా నాలుగుసార్లు పనిచేశారు. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపుతో 1930లో ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమాల్లో పాల్గొని స్వచ్ఛందంగా అరెస్టయ్యారు.
- ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ(అలహాబాద్)లో 1861 డిసెంబర్ 25న విద్యావంతులైన హిందూ కుటుంబంలో మాలవీయ జన్మించారు. అలహాబాద్ జిల్లా స్కూలులో ఉపాధ్యాయుడుగా ఉద్యోగ జీవితం ప్రారంభించినా, ఉద్యోగంతోపాటు చదువునూ కొనసాగించారు.
- న్యాయవాద విద్యను పూర్తిచేసి, జిల్లాకోర్టు, హైకోర్టులలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. పేదకుంటుంబంలో పుట్టినా న్యాయవాద వృత్తితో భారీగా సంపాదించారు. చివరకు సుఖాలు, సదుపాయాలు, సంపాదననూ వదులుకొని దేశసేవే లక్ష్యంగా స్వరాజ్య సమరంలో ప్రవేశించారు. మళ్లీ పేదరికానికే చేరువయ్యారు.
- అలహాబాద్‌నుంచి ప్రచురితమయ్యే ‘లీడర్’ అనే శక్తిమంతమైన ఆంగ్లపత్రికను 1909లో ప్రారంభించారు.
- అలహాబాద్ మునిసిపల్ బోర్డు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని, 1903-1920 మధ్య ప్రొవిన్సీయల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడుగా పనిచేశారు. 1910-20మధ్య సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడుగా, 1916-18 మధ్య ఇండియన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడుగా ఉన్నారు. 1931లో రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
- 1937లో క్రియాశీలక రాజకీయాలకు స్వస్తి చె ప్పి, సామాజిక సమస్యలపై దృష్టి కేంద్రీకరించారు. మహిళల విద్యావకాశాలకోసం, వితంతు పునర్వివాహాల కోసం కృషిచేశారు. బాల్యవివాహాలను తీవ్రంగా వ్యతిరేకించారు. -మాలవ్యా 1946 నవంబర్ 12న కన్నుమూశారు.