స్నేహితులతో భార్యను చంపించిన భర్త
ఝాన్సీ: తన స్మార్ట్ ఫోన్ చూడనీయకుండా లాక్ కోడ్ పెట్టుకుందన్న అక్కసుతో భార్యను అంతమొందిచాడో భర్త. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూనమ్ వర్మ అనే మహిళ ఆగస్టు 29న హత్యకు గురైంది. పూనమ్ భర్త వినీత్ కుమార్ స్నేహితులు ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. వినీత్ కుమార్ ను అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయడంతో అసలు విషయం వెల్లడించాడు. తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు.
కాన్పూర్ కు చెందిన వినీత్, పూనం.. ఝాన్సీ నగరంలో నివసిస్తున్నారు. మొదట్లో చిన్న ఉద్యోగం చేసిన వినీత్ తర్వాత వ్యాపారంలోకి ప్రవేశించాడు. దీంతో కాన్పూర్-ఝాన్సీ మధ్య తిరుగుతుండేవాడు. గత నెలలో స్మార్ట్ఫోన్ కొనిచ్చినప్పటి నుంచి తన భార్య ప్రవర్తనలో మార్పు వచ్చిందని పోలీసులతో వినీత్ చెప్పాడు. తనను, తమ నాలుగేళ్ల కుమార్తెను నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టిందన్నాడు. ఎవరూ తనఫోన్ ఓపెన్ చేయకుండా లాక్ కోడ్ పెట్టుకుందని వెల్లడించాడు.
భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న వినీత్.. ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు లక్ష్మణ్, కమల్ లకు రూ. 80 వేలు ఇచ్చి పూనమ్ ను హత్య చేయించాడు. ఆ సమయంలో కాన్పూర్ లో ఉండడంతో భార్య హత్యతో తనకు సంబంధం లేదని నమ్మబలికాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం కక్కాడు.