సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి జాతిపతి మహాత్మ గాంధీ ట్రైలర్ కావచ్చు కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి గాంధీయే జీవితం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన గురువారం లోక్‌సభలో మాట్లాడుతూ..నూతన భారత్ నిర్మాణానికి రాష్ట్రపతి ప్రసంగం ఎంతో దోహదం చేస్తుందని కొనియాడారు. మహాత్మా గాంధీ చేసిన స్వాతంత్య్ర పోరాటం నాటకమంటూ, చరిత్ర చదువుతుంటే తన రక్తం మరిగిపోతుందని బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెడ్గే తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభలో ప్రధాని మాట్లాడుతుండగా బీజేపీ సీనియర్ నేత అనంత కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపింది.
మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మోదీ స్పందిస్తూ..అంతేనా ఇంకేమైనా ఉందా అంటూ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించగా..ఇది ట్రైలర్ మాత్రమే అని కాంగ్రెస్ లోక్‌సభ పక్ష నేత రంజన్ చౌదరి తెలపగా, మీకు ట్రైలర్ కావచ్చు కానీ మాకు ఆయనే జీవితం అని మోదీ స్పష్టం చేశారు. వ్యవసాయం, రైతు సంక్షేమంపై తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థపై మోదీ స్పందిస్తూ..రైతులు ఎదుర్కొంటున్న కనీస మద్దతు ధర సమస్యకు ఎన్డీయే ప్రభుత్వం పరిష్కారం చూపిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని అన్నారు. మౌళిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలిచ్చాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment