వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. అలా ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రయాణం ఒక అడుగు.. రెండు అడుగులు..కిలోమీటర్.. పది కిలోమీటర్లు.. వంద కిలోమీటర్లు.. వెయ్యి కిలోమీటర్లు.. రెండు వేల కిలోమీటర్లు.. మూడు వేల కిలోమీటర్లు.. ప్రతి అడుగులోనూ నమ్మకం, భరోసా.. ఆ భరోసాతో లక్షలాది మందికి ఊరట.. భవిష్యత్తు బాగుంటుందని ఆశ.. ఈ ఆశను నిజం చేసుకోవాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాలన్నది ఆకాంక్ష.. ఈ కలను సాకారం చేయడానికి ఎందాకైనా అంటూ ఊరూ, వాడ ఏకమై అడుగులో అడుగేస్తున్నాయి. ఇలా.. ఆయా ప్రాంతాల ప్రత్యేకతలతో జననేతకు అఖండ స్వాగతం పలికేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు. మంగళ హారతులు పట్టే వాళ్లు, ఎర్రనీళ్ళతో దిష్టి తీసేవాళ్లు, వీర తిలకం దిద్ది మరీ విజయఢంకా మోగించే వాళ్లు.. తమ నేతకు ఆప్యాయంగా నోటికందించాలని పండ్లు తీసుకొచ్చే వాళ్లు.. ఇలా గుండెనిండా అభిమానంతో జగన్‌తో కలిసి అడుగులేయాలన్న అనందమే ప్రతీ ఒక్కరిలోనూ ప్రతిబింబిస్తోంది.
ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం గుండె చప్పుళ్లు వింటూ.. దగాపడ్డ పేదలకు కొండంత భరోసానిస్తూ సాగుతున్న విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మరో చారిత్రక ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో 3వేల కిలోమీటర్ల మైలురాయిని దాటబోతోంది. గతేడాది నవంబర్ 6న వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయ నుంచి మొదలైన వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర 11 జిల్లాల మీదుగా సాగింది. ఈ సుదీర్ఘ ప్రయాణం జననేతను జనం గుండె లోతుల్లోకి తీసుకెళ్లింది. ఊరూవాడా జగన్ కావాలంటోంది. కష్టాలు, నష్టాలు, కన్నీళ్లే జీవితంగా కుమిలిపోయే పేదవాడి మనస్సాక్షి ఇప్పుడు ‘జగన్ ముఖ్యమంత్రిగా రావాల’ని కోరుకుంటోంది. పాదయాత్రలో ఆయన ప్రతీ అడుగూ పేద గడప వైపే నడిచిందనేది జనమనోగతం. ఇలాంటి వ్యక్తికి పాలనా పగ్గాలు ఇవ్వాల్సిందేనని ప్రజలు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఊరెళ్లినా జగన్ ఎందుకు రావాలో చెబుతున్నారు. ఏ పేదవాడ్ని కదలించినా జగన్ వస్తే ఏం జరుగుతుందో పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. కాసులిచ్చి అభిమానం కొనితెచ్చుకునే కుటిల రాజకీయాల్లోనూ.. నిజమైన నేతగా జగన్‌ను జనం ఎందుకు నమ్ముతున్నారో ఇట్టే చెబుతున్నారు.
మాటంటే మాటే.. నిలువెత్తు నిబద్ధతే
‘జగన్‌ను మీరెందుకు సీఎంగా చూడాలనుకుంటున్నారు?’.. పాదయాత్ర జరిగిన ప్రాంతాల్లో ఇటీవల ఓ సర్వే సంస్థ ప్రజలకు వేసిన ప్రశ్నిది. దీనికి జనం ఏకపక్షంగానే బదులిచ్చారట. ‘జగన్‌లో నిజాయితీని చూస్తున్నాం.. మాటిస్తే తప్పుకోని తత్వాన్ని చూస్తున్నాం.. ఆయనలో ఓ నిబద్ధత కన్పిస్తోంద’ని వాళ్లు తడుముకోకుండా చెప్పారు. నిజమే.. పాదయాత్ర ఆరంభం నుంచి జగన్ సాధ్యమయ్యే హామీలే ఇస్తున్నారు. వీలుకావని తెలిస్తే ప్రజల మధ్యే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ‘సాధారణంగా ఎన్నికలప్పుడు ఎవరు ఏం అడిగినా వెంటనే హామీ ఇచ్చేయడం రాజకీయ నేత లక్షణం. కానీ, జగన్ దీనికి పూర్తి భిన్నం. అదే ప్రజలకు నచ్చుతోంది’ అని నెల్లూరు పట్టణానికి చెందిన రాజకీయ విశ్లేషకుడు ప్రవీణ్ తెలిపారు. పేదల విషయంలో జగన్ ఏమాత్రం వెనక్కు తగ్గడంలేదు. పాదయాత్రలో ఎదురయ్యే జనం కష్టాలకు తాను అధికారంలోకొస్తే ఏం చేయబోతున్నానో నిక్కచ్కిగా చెబుతున్నారు. మాటిస్తే తప్పుకునే వంశం కాదనే భరోసా జనంలోకి తీసుకెళ్లగలిగారు. ఐదేళ్ల పాలనే తన లక్ష్యం కాదని, ఎన్నో ఏళ్లు పాలించాలన్న జగన్ సచ్ఛీలమైన మనసును ప్రజలు గమనిస్తున్నారు. ఎంతో చేయాలన్న సంకల్పం ఉంటే తప్ప ఇంత ధైర్యంగా ఏ నేత చెప్పడన్న మనోభావం ప్రజల నుంచి వినిపిస్తోంది.
ప్రజల కోసం నిత్యం వారి మధ్యే..
కావాలి జగన్.. రావాలి జగన్.. అంటున్న జనం అందుకు మరో బలమైన కారణాన్ని చెబుతున్నారు. పార్టీ, వ్యక్తిగతం కన్నా.. రాష్ట్ర ప్రయోజనాలకే కట్టుబడే జగన్ నైజానికే జనం బాగా మద్దతు తెలుపుతున్నారు. తండ్రి మరణానంతరం జగన్‌కు అడుగడుగునా ప్రతికూలతలే. ఓదార్పు యాత్రను అపమని చెప్పినా ఇచ్చిన మాటకు కట్టుబడే ఉంటానని తేల్చి చెప్పారు. పార్టీ ఆవిర్భావం నుంచీ రాజకీయంగా అనేక రకాల వేధింపులు ఎదురైనా ఎప్పుడూ వెన్నుచూపలేదు. అనుక్షణం ప్రజల మధ్యే ఉంటున్నారు. ప్రజా సమస్యలపైనే పోరాటం చేస్తున్నారు. ఇద్దరితో మొదలైన పార్టీ బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. అధికార పక్షం ఎన్నో కుట్రలతో గొంతు నొక్కేసినా, విమర్శలు చేసినా అసెంబ్లీలో వాటిని ధీటుగా ఎదుర్కొని ప్రజా సమస్యలపై ఉద్యమించిన ప్రతీ సందర్భాన్ని ప్రజలు గుర్తుచేస్తున్నారు. ఎండా వానలను లెక్కజేయకుండా నిత్యం ప్రజల మధ్యే ఉండే వైఎస్ జగన్‌లో కష్టపడే తత్వం ఉందనే ఏకాభిప్రాయం జనం నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా.. పేదలను అక్కున చేర్చుకుని, ఆప్యాయంగా పలకరించే జగన్ తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. వైరి పక్షం రెచ్చగొట్టిన సందర్భాల్లోనూ, స్వపక్షంలోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడూ జగన్ స్థిరంగానే అడుగులేయడాన్ని జనం గమనిస్తున్నారు.
జనమే జగన్ కుటుంబం
కష్టమొచ్చిన అవ్వను.. కన్నీళ్లు పెట్టిన తాతను.. ఇష్టంగా పలకరించే చెల్లెమ్మలను.. నువ్వొస్తేనే భరోసా అంటూ వేడుకునే నిరుపేదను.. జగన్ దగ్గరకు తీసుకుంటున్న సన్నివేశాలు పాదయాత్రలో ప్రతీ క్షణం కన్పిస్తున్నాయి. వేలమంది సమూహంలోనూ కష్టాలతో వచ్చిన వారితో మాట్లాడేందుకే జగన్ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యకు పరిష్కారం చూపేందుకే ప్రయత్నిస్తున్నారు. ‘ఆయన మా కుటుంబ పెద్దగా పలకరించాడయ్యా.. ఆ బాబు నన్ను తాతా అని పిలిచాడు.. అన్నలా దగ్గరకు తీసుకున్నాడు.. ఆప్యాయంగా గుండెలకు హత్తుకున్నాడు’.. జగన్‌ను కలిసిన అనేకమంది అనే మాటలివి.
జనంలోకి జగన్ విజన్
రాష్ట్రం, రాష్ట్ర ప్రజలపట్ల జగన్‌కు స్పష్టమైన విజన్ ఉంది. పాదయాత్రలో ఆయన అవలంబిస్తున్న విధానాలు, వ్యవహారశైలి, ప్రసంగాల్లో ప్రజలు దీనిని గుర్తించారు. ఇంటికో ఉద్యోగమిస్తానని హామీ ఇచ్చి గాలికొదిలేసిన చంద్రబాబు తరహా రాజకీయం జగన్ చేయడంలేదని ప్రజలు విశ్వసిస్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై తన విధానాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పరిశ్రమలోనూ స్థానిక యువతకే 75 శాతం ప్రాధాన్యం ఇచ్చేలా అసెంబ్లీలో తీర్మానం చేస్తానని చెప్పడం.. సాగుకు సన్నద్ధమయ్యేందుకు నెలరోజుల ముందే పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్న భరోసా, డ్వాక్రా రుణాలు ఏ విధంగా మాఫీ చేస్తానో తెలియజేయడం.. ప్రతీ కులానికీ కార్పొరేషన్ పెట్టి ఆర్థిక పరిపుష్టి కల్పించే ప్రణాళికలు జగన్ ముందుచూపును జనంలోకి తీసుకెళ్లాయి. ప్రజల కోసం.. రాష్ట్రం కోసం కష్టపడే తత్వం ఆయనకు ఉందని, మహానేత బాటలో తమను ఆదుకుంటారన్న నమ్మకం ఉందని, అందుకే జగనే మఖ్యమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
చదవండి: జననేత వెంట జనప్రవాహం
పాలకుల కుట్రలపై జనం కన్నెర్ర
రాజకీయ ప్రభంజనం
బీసీల ఆశా దీపం నువ్వేనన్నా..
Comments
Please login to add a commentAdd a comment