అర్ధసెంచరీతో ఆదుకున్న మాథ్యూస్‌ |  Mathews' fifty leads Sri Lanka fight back | Sakshi
Sakshi News home page

అర్ధసెంచరీతో ఆదుకున్న మాథ్యూస్‌

Published Sun, Dec 3 2017 5:13 PM | Last Updated on Fri, Nov 9 2018 6:48 PM

 Mathews' fifty leads Sri Lanka fight back - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ మరోసారి తడబడ్డారు. మహ్మద్‌ షమీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్‌ కరుణరత్నే కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. దీంతో లంక పరుగుల ఖాతా తెరవకముందే వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన డిసిల్వా కూడా ఎక్కుసేపు క్రీజులో ఉండలేకపోయాడు. ఇషాంత్‌ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన మాథ్యూస్‌, మరో ఓపెనర్‌ పెరెరాతో ఆచితూచి ఆడాడు. 61 పరుగుల జోడించిన ఈ జంటను జడేజా విడగొట్టాడు. పెరెరా(42)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన చండిమాల్‌తో మాథ్యూస్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. ఈ దశలో 89 బంతుల్లో మాథ్యూస్‌ అర్ధశతకం సాధించాడు. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వేసిన 28వ ఓవర్‌లో రెండు, మూడు బంతుల్లో వరుస సిక్సర్లు బాది అర్ధశతకం పూర్తిచేశాడు.

చాన్నాళ్ల తర్వాత క్రీజులో నిలిచి స్థాయికి తగ్గ ప్రదర్శనతో లంకకు అండగా నిలిచాడు. కెప్టెన్‌ దినేశ్‌ చండిమాల్‌ (25; 81 బంతుల్లో 3ఫోర్లు) అతడికి సహకారం అందించాడు. దీంతో మరో వికెట్‌ కోల్పోకుండా ఈ ఇద్దరు జాగ్రత్తగా ఆడారు. ఇక ఆటముగిసే సమయానికి లంక మూడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. షమీ, ఇషాంత్‌, జడేజాలు తలో వికెట్‌ తీశారు. మరో వైపు భారత్‌ మిస్‌ ఫీల్డింగ్‌ లంకకు కలిసొచ్చింది.

అంతకుముందు కాలుష్య ప్రభావంతో ఫీల్డింగ్‌ చేయలేకపోతున్నామని  లంక ఆటగాళ్లు పదే పదే అంపైర్‌కు ఫిర్యాదు చేయడంతో​ విసుగెత్తిన కోహ్లి తొలి ఇన్నింగ్స్‌ను 536 పరుగుల వద్ద డిక్లెర్‌ ఇచ్చాడు. దీంతో ఇంకా లంక 405 పరుగుల వెనుకంజలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement