జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పూర్వాషా షిండే జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటింది. విజయనగరం జిల్లాకు చెందిన ఈ క్రీడాకారిణి సబ్-జూనియర్ కాంపౌండ్ బాలికల విభాగంలో బంగారు పతకం గెలుపొందింది. గచ్చిబౌలీలోని ‘శాప్’ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో బుధవారం జరిగిన బాలికల ఈవెంట్‌లో పూర్వాషా ఫైనల్లో వరుసగా 338 పాయింట్లు, 342 పాయింట్లు సాధించి మొత్తం 680 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకుంది.
మేఘాలయాకు చెందిన పార్వతి నాయర్ 670 స్కోరుతో రెండో స్థానంలో నిలిచింది. జార్ఖండ్ ఆర్చర్ మధుమిత కుమారి 665 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం చేజిక్కించుకుంది. ఈ విభాగంలో రాష్ట్రానికి చెందిన జోత్స్న (645) ఐదో స్థానంలో, గీతిక (627) ఏడో స్థానంలో నిలిచారు. కావ్య 14వ స్థానంతో నిరాశపరిచింది. అనంతరం జరిగిన సబ్-జూనియర్ రికర్వ్ బాలికల విభాగంలో ఏపీ అమ్మాయి బి. హేమలత రజతం గెలుపొందింది.
ఫైనల్ రౌండ్‌లో ఆమె 315+311 పాయింట్లతో మొత్తం 626 స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఆరు పాయింట్ల తేడాతో కొల్లే భాగ్యశ్రీ (మహారాష్ట్ర) చేతిలో స్వర్ణ పతకం కోల్పోయింది. భాగ్యశ్రీ 318, 314 పాయింట్లతో మొత్తం 632 స్కోరుతో బంగారు పతకం గెలిచింది. జార్ఖండ్ ఆర్చర్ సులేఖ సింగ్ 615 స్కోరుతో కాంస్యం చేజిక్కించుకుంది. ఏపీ అమ్మాయి ఎన్.కవిత పాయింట్ తేడాతో కాంస్యం కోల్పోయింది. ఈమె 614 స్కోరుతో నాలుగో స్థానానికి పరిమితమైంది. మరో తెలుగమ్మాయి జి.ప్రణీత 573 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది.
సబ్-జూనియర్ కాంపౌండ్, రికర్వ్ బాలుర ఈవెంట్లలో ఏపీ ఆర్చర్లు నిరాశపరిచారు. కాంపౌండ్ విభాగంలో చిరంజీవి రావు ఫైనల్ రౌండ్‌లో 653 స్కోరుతో ఎనిమిదో స్థానంలో, మోహన్‌కృష్ణ 626 స్కోరుతో 12వ స్థానంలో నిలిచారు. సబ్-జూనియర్ పోటీలు ముగియడంతో గురువారం జూనియర్ కాంపౌండ్, రికర్వ్ బాల బాలికల విభాగాల్లో క్వాలిఫయింగ్ పోటీలు జరుగుతాయి. 30న ఇదే విభాగానికి సంబంధించి ఫైనల్ రౌండ్ పోటీలు నిర్వహిస్తారు.
పూర్వాషాకు స్వర్ణం
Published Thu, May 29 2014 12:10 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement