కోహ్లిని వెనక్కునెట్టిన రైనా
కోల్‌కతా: టీ20 స్పెషలిస్ట్ సురేశ్ రైనా మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో అర్ధసెంచరీతో జట్టును గెలిపించిన గుజరాత్ లయన్స్ కెప్టెన్ మళ్లీ టాప్ ప్లేస్ సొంతం చేసుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లిని వెనక్కు నెట్టి మొదటి స్థానానికి దూసుకొచ్చాడు. 4,341 పరుగులతో అందరికంటే ముందు నిలిచాడు. 4,264 పరుగులతో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ(3923), కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్(3863) మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్ లో ఇప్పటిరకు 153 మ్యాచుల్లో 149 ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనా 139.09 స్ట్రైక్ రేటుతో 4,341 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 167 సిక్సర్లు, 384 ఫోర్లు బాదాడు. అయితే రైనా, కోహ్లి మధ్య పరుగుల తేడా తక్కువగా ఉండడంతో టాప్ ప్లేస్ కోసం వీరిద్దరూ పోటీపడుతున్నారు. ఈ సీజన్ లోనే రైనాను అధిగమించి కోహ్లి అగ్రస్థానానికి వెళ్లాడు. మళ్లీ ఇప్పుడు రైనా టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు.