లోక్‌సభ బరిలో 845 మంది
Published Thu, Apr 10 2014 1:34 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
సాక్షి, చెన్నై : రాష్ర్టంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. డీఎంకే నేతృత్వంలో డీపీఏ, బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటములు, అన్నాడీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. పంచ ముఖ సమరం నెలకొన్న రాష్ట్రంలో గెలుపు లక్ష్యంగా ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళుతున్నారు. ఓ వైపు ప్రచారం ఆగమేఘాలపై సాగుతోంటే, మరో వైపు ఎన్నికల ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం వేగవంతం చేసింది. గత నెల 29 నుంచి నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టారు. తొలి రోజు నామినేషన్లు పెద్దగా పడనప్పటికీ, ఆ తర్వాతి రోజు నుంచి వేగం పుంజుకుంది. నామినేషన్ల పర్వం చివరి రోజు నాటికి 1318 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 1198 పురుషులు, 117 మహిళలు, ఒకరు ఇతరులు ఉన్నారు. పరిశీలన ప్రక్రియలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
చివరగా 906 నామినేషన్లు పరిగణనలోకి తీసుకున్నారు. బుధవారం నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ జరిగింది. 61 మంది అభ్యర్థులు మాత్రమే నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
రేసులో 845 మంది
906 నామినేషన్లలో 61 మంది ఉప సంహరిం చుకోవడంతో ఎన్నికల బరిలో 845 మంది రేసు లో నిలబడ్డారు. వీరిలో 789 మంది పురుషు లు, 55 మంది మహిళలు ఉన్నారు. ఇతరుల కేటగిరిలో ఓ చోట హిజ్రా నామినేషన్ వేశారు. 39 స్థానాలకు గాను 845 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నట్టు ఎన్నికల యంత్రాం గం ప్రకటి ంచింది. అత్యధికంగా దక్షిణ చెన్నైలో 42, కనిష్టంగా నీలగిరిలో పది మంది అభ్యర్థు లు ఎన్నికల రేసులో నిలబడ్డారు. ఉత్తర చెన్నైలో -40, సెంట్రల్ చెన్నైలో -20, తిరుచ్చిలో-29, వేలూరు-27, అరక్కోణం-24, కృష్ణగిరి-15, పెరంబలూరు-21, నామక్కల్-26, సేలం -25, కరూర్-28, ఆరణి-19, రామనాథపురం - 31, తిరునల్వేలి-27, కోయంబత్తూరు-21, మదురై-31, శివగంగై-27, చిదంబరం-15 మంది ఎన్నికల బరిలో ఉన్నట్టు వివరించారు. 2009 ఎన్నికల్లో కంటే, ఈ ఎన్నికల్లో 22 మంది అభ్యర్థులు అధికంగా పోటీ చేస్తున్నారు.
చిహ్నాలు
నామినేషన్ల ఉప సంహరణ పర్వం ముగియడంతో ఎన్నికల కమిషన్ గుర్తింపు లేని పార్టీలకు చిహ్నాల కేటాయింపులు జరిగాయి. టోపీ, కొవ్వొత్తి, క్రికెట్ వీరుడు, టార్చిలైట్స్, బెల్ట్స్, ఫ్యాన్, రొట్టె, చెప్పులు, కేక్, క్యాలికులేటర్, కెమెరా, క్యారంబోర్డు, క్యారెట్, కాలీఫ్లవర్, ఏసీ, బ్రెడ్, గౌను తదితర 87 గుర్తులను అభ్యర్థుల ముందు ఉంచారు. స్వతంత్ర అభ్యర్థులు, ఎన్నికల గుర్తింపు లేని పార్టీలు తమకు కావాల్సిన చిహ్నాల్ని ఎంపిక చేసుకున్నాయి. అయితే, కొన్ని చోట్ల ఒకే చిహ్నం కోసం ఇద్దరు, ముగ్గురు చొప్పున పట్టుబట్టడంతో చిహ్నాల కేటాయింపుల్లో జాప్యం నెలకొంది. అర్ధరాత్రికి ఈప్రక్రియ ముగించే అవకాశాలు ఉన్నాయి. గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులందరికీ ఒకే విధంగా ఏఏ చిహ్నాలు దక్కాయన్నది గురువారం తేలనున్నది.
ఆలందూరు బరిలోబన్రూటి రామచంద్రన్ రాజీనామాతో ఆలందూరు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనున్నది. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆయా పార్టీల అభ్యర్థులతో పాటుగా 14 మంది నామినేషన్లు సమర్పించారు. ఇందులో ఇద్దరు మహిళలు. నామినేషన్లు ఏ ఒక్కరూ ఉప సంహరిం చుకోక పోవడంతో ఎన్నికల బరిలో 14 మంది నిలిచారని ఈసీ ప్రకటించింది.
Advertisement