మణిరత్నంతో లారెన్స్ ఢీ
ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నంతో ప్రముఖ నృత్య దర్శకుడు నటుడు, దర్శకుడు లారెన్స్ ఢీ కొడుతున్నారు. వీరిద్దరి మధ్య పోరు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? వృత్తిపరమైన పోరే లెండి. విషయం ఏమిటంటే రేపు మణిరత్నం దర్శకత్వం వహించిన ఓ కాదల్ కణ్మణి, లారెన్స్ నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కాంచన -2 చిత్రాలు తెరపైకి రానున్నాయి. ఈ రెండు చిత్రాల మధ్య చాలా పోలికలు వున్నాయి. రెండింటిపైనా మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాల విజయం ఇటు మణిరత్నంకు, అటు లారెన్స్‌కు చాలా అవసరం కూడా. కారణం మణిరత్నంకు ఇటీవల సరైన హిట్స్ లేవు. అదే విధంగా లారెన్స్ నటించిన ముని-2 (కాంచన) తెరపైకికొచ్చి చాలా కాలమైంది. ఆ తరువాత ఆయన చిత్రాలేవీ విడుదల కాలేదు. అయితే రేపు తెరపై ఢీ కొంటున్న ఓ కాదల్ కణ్మణి, కాంచన-2 రెండూ వేర్వేరు ఇతివృత్తంతో రూపొందిన చిత్రాలే.
ఓ కాదల్ కణ్మణి :
చాలాకాలం తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన పూర్తి వైవిధ్యభరిత, ప్రేమ కథా చిత్రం ఓ కాదల్ కణ్మణి. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, బాలీవుడ్ ప్రముఖ గాయని లీలా సంసన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. వివాహం కాకుండానే సహజీవనం చేసే ఓ యువ జంట ఇతివృత్తంగా తెరకెక్కించిన ఈ చిత్రంతో మణిరత్నం ఒక సంచలనానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం మద్రాసు టాకీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ సంస్థ విడుదల చేస్తోంది. తమిళం, తెలుగు భాషల్లో తెరపైకి రానుంది.
కాంచన -2 :
లారెన్స్ రూపొందించిన కాంచన చిత్రం అందించిన విజయోత్సాహంతో కాంచన -2 తెరకెక్కించారు. ఈ చిత్రంలో తాప్సీ హీరోయిన్. కాంచన -2 చిత్రంలో లారెన్స్ పలు వండర్స్ చేశారట. ఏడేళ్ల బాలుడి నుంచి 70 ఏళ్ల బామ్మ వరకు పలు గెటప్‌లలో ఆయన విస్మయం కలిగించనున్నారు. చిత్రం ఫస్ట్‌లుక్ ఫొటోలు చూసి సూపర్‌స్టార్ రజనీకాంతే ఆశ్చర్యపోయారని లారెన్స్ పేర్కొన్నారు. రాఘవేంద్రస్వామి ఆశీస్సులున్నాయి. నీకు విజయం తథ్యం అని కూడా రజనీకాంత్ ప్రోత్సాహకర వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. చిత్రాన్ని సన్స్ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి థియేటర్లకు పైగా విడుదల చేయనుంది.