మా(య)విజయం వెనుక నయన
ఇటీవల విడుదలైన మాయ చిత్ర విజయం హార్రర్ చిత్రాల హవాను మరోసారి నిరూపించింది. తెలుగు మయూరి పేరుతో అనువాదమై అక్కడా విశేష ప్రజాదరణ పొందుతోంది.క్రేజీ నటి నయనతార టైటిల్ పాత్రలో నటించిన చిత్రం మాయ. ఆరి హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రొటెన్షియల్ స్టూడియో పతాకంపై ఎస్‌ఆర్.ప్రభు నిర్మించారు. దర్శకుడు అశ్విన్‌శరవణన్ తొలి ప్రయత్నం మాయ.చిత్ర విజయాన్ని యూనిట్ శనివారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌ఆర్.ప్రభు మాట్లాడుతూ నిర్మాతగా మాయ తనకు తొలి చిత్రం అన్నారు.అందువల్ల ఈ చిత్ర విజయం తనకు చాలా ముఖ్యమైనదని అన్నారు.ఈ విజయం వెనుక యూనిట్ కృషి చాలా ఉందని పేర్కొన్నారు.
ఎదురు చూసిన విజయం
చిత్ర హీరో ఆరి మాట్లాడుతూ ఎంతకాలంగానో ఎదురు చూసిన విజయం మాయ చిత్రం ద్వారా లభించిందని అన్నారు.నెడుంశాలై తొలి విజయాన్ని అందిస్తే ఈ మాయ చిత్రం మంచి గుర్తింపునిచ్చిందన్నారు.మాయ చిత్రంలో నటిస్తున్నానని తెలియగానే చాలా మంది హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో ఎందుకు నటిస్తున్నావని ప్రశ్నించారని వారందరికీ ఈ చిత్ర విజయమే బదులిచ్చిందని అన్నారు.మాయ చిత్రం తెలుగులో మయూరి పేరుతో విడుదలై అక్కడా విజయం సాధించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో పాల్గొన్నప్పుడు చాలా మంది తనను గుర్తు పట్టి మయూరి చిత్ర హీరో కదూ అంటూ అభినందిస్తూ తనతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపించారని చెప్పారు.మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్నట్లు మాయ చిత్రం విజయం వెనుక నటి నయనతార ఉన్నారని ఆరి అన్నారు.హాలీవుడ్ దర్శకుడు ఎరిన్‌ఇంగిలాత్ మాయ చిత్రం చూసి ప్రశంసించడం చాలా సంతోషాన్నిచ్చిందని అన్నారు.
మాయకు సీక్వెల్ తీస్తా
దర్శకుడు అశ్విన్‌శరవణన్ మాట్లాడుతూ మాయ చిత్ర విజయం తమకు చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.మాయ చిత్రం చూసిన తరువాత చాలా మంది సీక్వల్ తీస్తే బాగుంటుందని పలు సూచనలు చేస్తున్నారనీ కథ బాగా అమరితే కచ్చితంగా మాయ-2 చేస్తాననిదర్శకుడు అన్నారు. ఈ చిత్రాన్ని మయూరి పేరుతో తెలుగులో విడుదల చేసిన సీ.కల్యాణ్ మాట్లాడుతూ తన బ్యానర్‌లో చేసిన 57వ చిత్రం మాయ అని తెలిపారు.