నైట్‌షెల్టర్లకంటే.. నడిరోడ్డే నయం! | middle road better than night shelters | Sakshi
Sakshi News home page

నైట్‌షెల్టర్లకంటే.. నడిరోడ్డే నయం!

Published Fri, Jan 3 2014 11:33 PM | Last Updated on Wed, Oct 17 2018 5:37 PM

middle road better than night shelters

 న్యూఢిల్లీ: సాధారణ టెంట్ల స్థానంలో పోర్టాక్యాబిన్లతో నైట్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించినా నైట్‌షెల్టర్లలో రాత్రిబస చేసేందుకు చాలామంది ఇష్టపడడంలేదు. నైట్‌షెల్టర్లకంటే నడిరోడ్డమీద ఉన్న దుప్పటేదో కప్పుకొని పడుకోవడానికే ఇష్టపడుతున్నారు. అందుకు కారణం నైట్‌షెల్టర్లలో భద్రత ప్రశ్నార్థకంగా మారడమే. ‘వయసుకొచ్చిన ఆడపిల్లలను తీసుకొని వెళ్లి ఆ నైట్‌షెల్టర్లలో ఎలా ఉంటాం? అక్కడ తాగుబోతులు చేసే హంగామా అంతాఇంతా కాదు. నా పిల్లలు సురక్షితంగా ఉండాలనే అభిప్రాయంతోనే రోడ్డుపక్కన ఇలా ఉన్న దుప్పటేదో క ప్పుకొని పడుకునేందుకే ఇష్టపడతాను. తెలిసి తెలిసి ఆ నైట్‌షెల్టర్లలోకి మాత్రం వెళ్లమ’ని సునీత అనే కార్మికురాలు పేర్కొంది.

అక్కడ తనకే భద్రత లేదని, వయసుకొచ్చిన తన కూతుళ్లకు ఎలా భద్రత ఉంటుందని ఆమె ప్రశ్నిస్తోంది. టెంట్లకంటే చలి నుంచి కాస్త రక్షణ కల్పించే పోర్టా క్యాబిన్లను ఏర్పాటు చేసినా భద్రత విషయంలో ఈ ప్రభుత్వం ఎటువంటి హామీని ఇంతవరకు ఇవ్వలేదని, అందుకే నైట్‌షెల్టర్లకు తాము దూరంగా ఉంటున్నామని పేర్కొంది. సరాయి కాలేఖాన్ ఇంటర్-స్టేట్ బస్ టెర్మినల్ సమీపంలో, రోడ్డు పక్కనే రాత్రంతా ఈ కుటుంబం గడుపుతోంది. సునీత పుట్టింది, పెరిగింది ఢిల్లీలోనే కావడం గమనార్హం. అయినప్పటికీ ఆమెకు ఇంకా ఓ ఆశ్రయం లేదు.

 ఇలాంటివారు ఢిల్లీ మహానగరంలో ఎందరో ఉన్నారు. వారంతా నైట్‌షెల్టర్లను ఉపయోగించుకునేందుకు జంకుతున్నారు. ఫ్లైఓవర్ల కింద కొంతకాలం, ఫుట్‌పాత్‌లపై మరికొంతకాలం రోజులు వెళ్లదీస్తున్నారు. ‘పుట్టినప్పటి నుంచి ఢిల్లీ రోడ్లపైనే బతుకుతున్నాను. రోజంతా చెత్త సేకరించే పని చేస్తాను. చలిని భరించలేక ఓ రోజు నైట్‌షెల్టర్‌లో తలదాచుకుందామని వెళ్లాను. నా మూడేళ్ల బిడ్డతోపాటు నన్నూ బలవంతంగా బయటకు గెంటేశారు. చలిని తట్టుకోలేక నా బిడ్డ కన్నుమూసింద’ని రాజ న్ బసోర్ అనే మహిళ తన ఆవేదనను చెప్పుకుంది. ఒకవేళ జాలి చూపించి ఎవరైనా నైట్‌షెల్టర్లలోకి రానిచ్చినా కూడా అందులో నిర్భయంగా నిద్రపోడం ఆసాధ్యమని పేర్కొంది. తాగుబోతులు, మత్తుమందులు సేవించేవారు, పొగతాగేవారు చేసే వెధవ వేషాలు చెప్పడానికి కూడా బాగుండదని రుక్సానా అనే మరో బాధితురాలు పేర్కొంది.

నిజానికి నైట్‌షెల్టర్లేవీ ఉండడానికి, పడుకోడానికి వీలు గా ఉండవని, బురద, మట్టి, చెత్తతో నిండి ఉంటాయని పేర్కొంది. నైట్‌షెల్టర్ల కేర్‌టేకర్లతో కొంతమంది కుమ్మక్కై వాటిని తమ సొంత ఇంటిలా మార్చుకుంటున్నారని, పేకాట ఆడుతూ, తాగుతూ ఇతరులకు నిద్రపోనీయకుండా చేస్తున్నారని పేర్కొంది. తెలిసీ చిక్కుల్లో ఎందుకు ఇరుక్కోవాలని ప్రశ్నించింది. నైట్‌షెల్టర్ల విషయంలో ప్రభు త్వ వివరణ కోరుతూ జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

 నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కోరింది. నగరవ్యాప్తంగా 175 నైట్‌షెల్టర్లు ఉన్నాయని, అం దులో సుమారు 7,000 మంది నిరాశ్రయులు ఆశ్ర యం పొందుతున్నారని, వీటిలో సరైన మౌలిక సదుపాయాలు లేవని,  ఢిల్లీ అభివృద్ధి సంస్థ ప్రణాళిక ప్రకారం లక్ష జనాభా ఉన్న ప్రతి ప్రాంతానికో నైట్‌షెలర్ చొప్పున ఏర్పాటు చేయాలని, కాని నగరంలో అటువంటి పరిస్థితి లేదనే ఆరోపణల నేపథ్యంలో కమిషన్ ఈ నోటీసులు జారీ చేసింది. మౌలిక వసతులు, ఇతర విషయాలపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే భద్రత విషయంలో ఎలాంటి హామీని ఇవ్వనుందనే విషయమై ఇంకా ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement