సాక్షి, ముంబై : సమర్థంగా బస్సు సేవలను అందించడంలో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్‌ఆర్టీసీ) విఫలమవుతోంది. బస్సులు, సిబ్బంది కొరత, రోడ్డుపైనే నిల్చిపోవడం వంటి సమస్యల వల్ల ప్రయాణికులు ప్రభుత్వ బస్సులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల కారణంగా ఏటా ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న విషయం అందరికే తెలిసిందే.
దీంతో ఎంఎస్‌ఆర్టీసీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఏప్రిల్ 15-జూన్ 15 మధ్య ప్రత్యేకంగా అదనపు బస్సులను నడపనున్నట్టు ప్రకటించినా, ఆ హామీ ఆచరణ సాధ్యం కావడం లేదు. డ్రైవర్ల కొరత వల్ల తరచూ బస్సుల సేవలను రద్దు చేస్తున్నారు. దాదాపు ఆరు వేల మంది డ్రైవర్ల ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో ట్రిప్పుల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడున్న వాటిలో చాలా బస్సులు మొరాయిస్తున్నాయి. వీటిలో చాలా వరకు తరచూ మార్గమద్యలోనే నిలిచిపోతున్నాయి. బస్సుల సంఖ్యను మరింత పెంచాల్సి ఉన్నా అధికారులు ఆ పని చేయడం లేదు.
వేసవి సెలవుల్లో ప్రయాణికుల సంఖ్య ముంబైలో గణనీయంగా పెరుగుతుంది. రద్దీని తట్టుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నా, ఏవో కారణాల వల్ల బస్సు సేవలకు తరచూ అంతరాయం ఏర్పడుతోంది. 2014 వేసవి సెలవుల్లో అదనపు బస్సులను నడిపేందుకు సరిపడా డ్రైవర్ల ఉద్యోగాల భర్తీ కోసం పరీక్షలు నిర్వహించాలని ఎంఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలా జాప్యం తరువాత పరీక్షలు నిర్వహించారు.
ఈ నియామకాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. పరీక్షలు నిర్వహించినప్పటికీ ఫలితాలు ఎప్పుడు విడుదల చేసేదీ తెలియజేయకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈసారి వేసవి సెలవుల ప్రత్యేక బస్సులకు సరిపడా డ్రైవర్లు ఎంఎస్‌ఆర్టీసీకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు.
బయటి నుంచి కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోవాలని ఆలోచన ఉన్నా, అభ్యర్థులు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. దీంతో అనేక బస్సులను రద్దు చేయాల్సి వస్తోంది. ముంబై, ఠాణే, రాయగఢ్, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ మొదలగు ప్రాంతాల్లోని బస్సు సేవలకు తీవ్ర అంతరాయాలు కలుగుతున్నాయి. ఫలితంగా ఈ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రెండేళ్లుగా కొత్త సెమీ-లగ్జరీ బస్సులు లేవు...
ఎంఎస్‌ఆర్టీసీ సాదా బస్సులతోపాటు లగ్జరీ, సెమీ-లగ్జరీ, డీలక్స్ బస్సులను నడుపుతోంది. అయితే వీటిలో సెమీ-లగ్జరీ (హిరకనీ)బస్సులకు అత్యధిక డిమాండ్ ఉంది. గత రెండేళ్లుగా ఈ తరహా బస్సులను కొనుగోలు చేయడం లేదు. ప్రస్తుతం ఎంఎస్‌ఆర్టీసీ వద్ద సుమారు 1,300 సెమీ-లగ్జరీ బస్సులున్నాయి.
కొనసాగుతున్న ప్రైవేటు బస్సుల దోపిడీ
ఎంఎస్‌ఆర్టీసీ సరిపడా బస్సులు నడపడంలో విఫలమవడంతో చాలా మంది ప్రైవేట్ బస్సులను ఎంచుకోకతప్పడం లేదు. ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపించడంలేదని కొందరు ప్రయాణికులు పేర్కొంటున్నారు. చాలా బస్సులు మార్గమధ్యలోనే నిలిచిపోవడంతో ఎంఎస్‌ఆర్టీసీకి ఆదరణ పడిపోతోంది. దీంతో బస్సు ప్రయాణం తరచూ ఆలస్యమవుతోందని వాపోతున్నారు. అందుకే చార్జీలు అధికంగా ఉంటున్నా ప్రైవేటు బస్సులనే ఎక్కుతున్నామని ముంబైవాసి ఒకరు అన్నారు.
బస్సుల్లేక బాధలు
Published Fri, May 2 2014 10:26 PM | Last Updated on Mon, Oct 8 2018 6:08 PM
Advertisement