- కోస్తాకే పరిమితం
- వాతావరణ శాఖ అంచనాలు తారుమారు
- రెండు వారాలు గడిచినా కానరాని జాడ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాల రాక ఆలస్యమవుతోంది. ఇప్పటికే రాష్ట్రమంతా విస్తరించాల్సిన రుతు పవనాలు కోస్తాను దాటి ముందుకు రావడం లేదు. రైతులు తొలకరి జల్లులపై ఆశతో దుక్కులు దున్నడం ప్రారంభించారు.
ఇటీవల పడిన వర్షాలతో రైతుల మోముల్లో చిరు దరహాసం తాండవించగా, ఇప్పుడది కాస్త ఆందోళనగా మారుతోంది. రుతు పవనాలు వారం ఆలస్యమవుతుందని మొదట్లో వాతావరణ శాఖ అంచనా వేయగా, రెండు వారాలు ముగిసినా వాటి జాడ కనిపించడం లేదు. ఈ నెలాఖరు వరకు మంచి వర్షాలు పడే అవకాశాలు లేవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆకాశం మేఘావృత్తం కావడం, అంతలోనే మబ్బులు విడిపోవడం...సాధారణ ధృశ్యాలుగా కనిపిస్తున్నాయి.
గత నెలాఖరులో పడిన వర్షాలకు నేల తడిబారడంతో దుక్కులకు అనువైన వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే చాలా మంది రైతులు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి తదుపరి వర్షాల కోసం దిక్కులు చూస్తున్నారు. గత ఏడాది ఈ సమయానికి బాగా వర్షాలు పడడంతో జలాశయాల్లోకి నీటి ప్రవాహం బాగా పెరిగింది. క్రమేపీ అన్నీ నిండిపోయాయి. ఈసారి వర్షాలు లేకపోవడంతో ఇన్‌ఫ్లో పెద్దగా కనిపించడం లేదు. జూన్ ఒకటో తేది నుంచి ఇప్పటి వరకు సగటు వర్ష పాతం 82 మి.మీ. కాగా 56.5 మి.మీ. మాత్రమే నమోదైంది.