ఉమ్మడి జెడ్పీ.. | Zilla Parishad meetings | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జెడ్పీ..

Published Sat, Oct 22 2016 2:26 PM | Last Updated on Fri, Aug 17 2018 2:56 PM

ఉమ్మడి జెడ్పీ.. - Sakshi

ఉమ్మడి జెడ్పీ..

మరో రెండున్నరేళ్లు పాత జెడ్పీ పాలనే..!
2018 స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆదిలాబాద్‌ కేంద్రంగానే నిర్వహణ
మూడు నెలలకోసారి కలువనున్న నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు
ఆదిలాబాద్‌ జెడ్పీ సీఈవో పరిధిలోనే అన్ని జిల్లాలు


సాక్షి, మంచిర్యాల : గ్రామాల సమస్యల పరిష్కారం స్థానిక పాలనతోనే సాధ్యమవుతుందని భారత రాజ్యాంగంలోని 74వ అధికరణ చెబుతోంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఐదంచెల పాలన వ్యవస్థ కొనసాగుతోంది. ప్రజల చెంతకు పాలన తీసుకురావాలన్న ఉద్దేశంలో భాగంగానే ప్రభుత్వం జిల్లాల పునర్విభజనకు శ్రీకారం చుట్టింది. దీంతో ప్రజాపాలన చేరువైనట్లు కనిపిస్తున్నా.. గ్రామాల అభివృద్ధికి ప్రధానమైన జిల్లా పరిషత్‌ పాలన మాత్రం మరో రెండున్నరేళ్లు దూరంగానే ఉండనుంది. రాష్ట్రంలో 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించినప్పటికీ.. ఉమ్మడి జిల్లాల్లో జిల్లా పరిషత్‌ల కాలం ముగిసే వరకు పాత పద్ధతిలోనే పాలన సాగనుంది. ఆదిలాబాద్‌ నుంచి విడిపోయిన మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లాల స్థానిక పాలన ఆదిలాబాద్‌ కేంద్రంగానే 2018 వరకు సాగనుంది.

నాలుగు జిల్లాలకు ఉమ్మడి చైర్‌పర్సన్‌!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2013లో ఎన్నికైన 52 మంది జెడ్పీటీసీలు, ఎంపీపీల పదవి కాలం 2018 వరకు ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలు విడిపోయినా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు అలాగే కొనసాగుతారు. ఆదిలాబాద్‌ నుంచి కొత్తగా ఆవిర్భవించిన మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలోని గ్రామీణ పాలన కూడా పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నేతృత్వంలోనే సాగనుంది. అంటే ఆదిలాబాద్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ శోభారాణి ఇక నాలుగు జిల్లాలకు బాధ్యత వహిస్తారు. అలాగే ప్రతి మూడునెలలకోసారి జరిగే జిల్లా పరిషత్, స్థాయీ సంఘ సమావేశాలకు ఈ నాలుగు జిల్లాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు ఆదిలాబాద్, నిర్మల్‌ జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు జోగు రామన్న, ఎ.ఇంద్రకరణ్‌ రెడ్డి, పెద్దపల్లి, ఆదిలాబాద్‌ ఎంపీలు బాల్క సుమన్, గోడం నగేష్, 8 మంది ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

ప్రజాప్రతినిధులతో పాటే అధికార యంత్రాంగం
జిల్లా పరిషత్‌ సమావేశాలకు ఎంపీపీ నుంచి ఎంపీ వరకు హాజరై ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించడం పరిపాటి. విభజన నేపథ్యంలో జెడ్పీ పరిధిలో జరిగే సమావేశానికి హాజరయ్యే నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులతోపాటు అధికార యంత్రాంగం కూడా ఆదిలాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజాప్రతినిధులు సమావేశం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల తరఫున జిల్లా కలెక్టర్‌ ఉండాల్సిందే. ఆయన హాజరుకాని పక్షంలో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశానికి వెళ్తారు. ఈ లెక్కన కొత్త జిల్లా పాలన వచ్చే వరకు ఆదిలాబాద్‌లో జరిగే సమావేశాలకుSనాలుగు జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. వారితోపాటు ఆయా ప్రభుత్వ విభాగాలకు చెందిన జిల్లా అధికారులు కూడా వెళ్తారు. ఈ లెక్కన నాలుగు జిల్లాల నుంచి అధికారుల సంఖ్యనే జెడ్పీటీసీ, ఎంపీపీలను మించిపోనుంది. ఈ పరిస్థితుల్లో జిల్లా పరిషత్‌ సమావేశాలకు ప్రస్తుతం ఆదిలాబాద్‌లోని జెడ్పీ హాల్‌ సరిపోకపోతే ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించాల్సి ఉంటుంది.

వైద్య బిల్లులు, ఫైళ్లపై సంతకాలకు తిప్పలే..!
జిల్లా పరిషత్‌ పరిధిలోని పంచాయతీరాజ్‌ ఉద్యోగులకు వైద్య బిల్లులు రూ.50 వేల లోపు ఉంటే జెడ్పీ సీఈవో మంజూరు చేస్తారు. రూ.50 వేలు దాటితే కలెక్టర్‌ ఆమోదంతో సీఈవో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే పాత జిల్లా పరిధిలోని మండల్‌ పరిషత్‌ కార్యాలయాలు, జెడ్పీ పాఠశాలల బోధనేతర సిబ్బంది, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగాల కార్యాలయాల్లోని ఉద్యోగులు కూడా జెడ్పీ ద్వారానే వైద్యబిల్లులు తీసుకోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లాలకు చెందిన ఉద్యోగులు రెండున్నరేళ్ల వరకు కొంత ఇబ్బంది పడాల్సిందే. అలాగే జిల్లా పరిషత్‌కు సంబంధించిన ఫైళ్లపై జñ డ్పీ చైర్‌పర్సన్‌ సంతకంతోపాటు జిల్లా కలెక్టర్ల ఆమోదం కూడా తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ మినహా మూడు జిల్లాలకు తిప్పలు తప్పవు. జీపీఎఫ్‌ రుణాలకు కూడా ఇదే పరిస్థితి. ఈ క్రమంలో నాలుగు జిల్లాల స్థానిక పాలన మరో రెండున్నరేళ్లు ఆసక్తి రేపనుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement