మోడల్ మార్కెట్ ముందుకు సాగేనా! | Bhuvanangiri agricultural market | Sakshi
Sakshi News home page

మోడల్ మార్కెట్ ముందుకు సాగేనా!

Published Thu, Oct 30 2014 3:25 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

మోడల్ మార్కెట్ ముందుకు సాగేనా! - Sakshi

మోడల్ మార్కెట్ ముందుకు సాగేనా!

 భువనగిరి : భువనగిరి వ్యవసాయ మార్కెట్‌ను అన్ని హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు గత కాంగ్రెస్ సర్కార్  2012 జూన్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీఓను కూడా జారీ చేసింది. వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని నాటి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందే తడవుగా అధికార యంత్రాంగమూ స్థల సేకరణకు కసరత్తు ప్రారంభించింది. ఇదిగోఅదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప.. రెండేళ్లవుతున్నా స్థల సేకరణ పూర్తి చేయలేదు. మోడల్ మార్కెట్ ఏర్పాటైతే ధాన్యం అమ్ముకోవడానికి, నిల్వ చేసుకోవడానికి ఇబ్బందులు ఉండబోవని ఆశించిన ఈ ప్రాంత రైతాంగానికి నిరాశే మిగిలింది. వర్షం వస్తే ధాన్యం తడవడం, కొట్టుకుపోవడం రైతన్నకు షరా మామూలైంది.
 ఎంపికైన నాలుగిట్లో భువనగిరి  ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు అత్యాధునిక వ్యవసా య మార్కెట్లు ఏర్పాటు చేయాలని గత పాలకు లు తలపెట్టిన వాటిలో భువనగిరి ఒకటి.  ఇందులో భాగంగా ఈ మార్కెట్లలో విశాలమైన యార్డుతో పాటు ధాన్యం నిలువ చేసేందుకు గోదాంలు,  హర్వేస్టింగ్, ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజీ గోదాంలు, రైతులకు విశ్రాంతి గదులు, మంచినీటి వసతి, ప్లాట్ ప్లామ్స్, ఆధునిక తూకం యంత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు అతీగతి లేదు.
 
 స్థల సేకరణలో జాప్యం
 మెడల్ మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణలో తీవ్రజాప్యం జరుగుతోంది.  స్థల సేకరణకోసం అప్పట్లో జాయిట్ కలెక్టర్, మా ర్కెటింగ్ ఉప సంచాలకులు, అర్డీఓ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఆధ్వర్యంలో కమి టీ కూడా ఏర్పాటు చేశారు. కాగా మార్కెట్‌కు సుమారు 20 ఎకరాలకు పైగా స్థలం సేకరించాలని కమిటీ నిర్ణయించింది. ముందుగా పట్టణంలోని మూడుచోట్ల ప్రైవేట్, ప్రభుత్వ  స్థలాలను అధికారులు పరిశీలించారు. ఆ తర్వాత ముగ్దుం పల్లి, అనాజిపురం, తుక్కాపురంలోనూ స్థలాల ను పరిశీలించి వాటిని కొనుగోలు చేయటానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించా రు. చివరకు బొమ్మాయపల్లి శివారులోగల ప్రైవే ట్ స్థలం కొనుగోలు చేయాలని నిర్ణయించి అం దుకు రంగం సిద్ధం చేశారు. అయితే అనంతా రం వద్ద ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉండటంతో ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి లక్షల రూపాయలు వృథా చేయడమెందుకని పలువురు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. స్థలం కొనుగోలుకు కోట్లాది రూపాయలు చెల్లిస్తే మిగతా పనులకు నిధుల కొరత ఏర్పడే అవకాశం ఉందని భావించిన ఉన్నత అధికారులు నిర్ణయాన్ని మార్చుకున్నారు.
 
 అనంతారం శివారులోనే అనువైన స్థలమని..
 అనంతారం గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 200లో 30 ఎకరాల స్థలం మోడల్ మార్కెట్ యార్డుకు అనువైన స్థలంగా  భూసేకరణ కమిటీ నిర్ధారించింది. ఈ స్థలంలో మార్కెట్ యార్డును అన్ని హంగులతో నిర్మించవచ్చునని అధికారులు భావించారు.    అనంతారం స్థలం మార్కెట్ యార్డు ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించడం జరిగిందని,  ప్రభుత్వం వద్ద ఫైల్ పెండింగ్‌లో ఉందిని, త్వరలోనే ఆమోదం పొందుతుందని అప్పట్లో భువనగిరికి వచ్చిన జాయింట్ కలెక్టర్ కూడా చెప్పారు. కానీ రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినా ఆ ఊసే ఎత్తడం లేదు. ఏది ఏమైనా ఈ ప్రాంత రైతుల అవసరాలను గుర్తించి మోడల్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ నానాటికీ ఊపందుకుంటోంది. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి కూడా అధికారులతో కలిసి అనంతా రం వద్ద స్థలాన్ని పరిశీలించారు.
 
 మోడల్ మార్కెట్‌కు కృషి చేస్తా :
 - పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే, భువనగిరి
 భువనగిరిలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు అన్ని విధాలా కృషి చేస్తా. మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన 30 ఎకరాల స్థలం కోసం అధికారులతో మాట్లాడుతా. భువనగిరి శివారులో ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని, లేకుంటే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా భూసేకరణ చేస్తాం. ఇందుకు సంబంధించి నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. మోడల్ మార్కెట్‌ను ఏర్పాటు చేసి రైతుల ఇబ్బందులను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement