సాక్షి, హైదరాబాద్: ‘అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అనే సామెత తప్పని రుజువు చేస్తూ రైతుల తలరాతలను రైతులే మార్చుకోవాలి. తెలంగాణలో రైతురాజ్యం నడుస్తోంది. అప్పులు లేకుండా సొంత పెట్టుబడితో తెలంగాణ రైతులు వ్యవసాయం చేసుకొనే పరిస్థితి రావాలి’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర రైతాంగానికి పిలుపునిచ్చారు. కేబినెట్ భేటీ అనంతరం సోమవారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించబోయే నూతన వ్యవసాయ విధానానికి సంబం ధించిన అంశాలను వెల్లడించారు.
‘ప్రభుత్వం సూచించిన పంటలు పండించి రైతులు లాభాలు సాధించాలి. రెండు, మూడు రోజుల్లో రైతులతో టీవీ చానల్ వేదికగా ముఖాముఖి నిర్వహిస్తాం. మం త్రులు జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించాలి. రైతుబంధు సమి తులు యాక్టివేట్ అవుతున్నాయి. తెలం గాణ పంటలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయే పరిస్థితి రావాలి. శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేసి రైతాంగం మంచి ఫలి తాలు సాధించాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎం వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే...
వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ..
తెలంగాణ అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా అవతరించేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. విభిన్న రకాల నేలలు ఉండటం వల్లే ఇక్కడ అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ ఏర్పాటైంది. నల్లరేగడి, ఎర్ర, ఇసుక, తేలికపాటి, క్షార నేలలతోపాటు అనుకూలమైన వాతావరణ, పర్యావరణ, సమశీతోష్ణ వలయం ఉండటంతో అన్ని రకాల పంటలకు అనువైన వాతావరణం తెలంగాణలో ఉంది. దీంతో పంటల ఉత్పత్తిలో తెలంగాణ అనేక రికార్డులను బద్దలు చేస్తోంది.
అత్యంత తక్కువగా 700 మి.మీ, అతిఎక్కువగా 1,100 మి.మీ వర్షపాతం మొత్తంగా 900 మి.మీ వార్షిక వర్షపాతం నమోదవుతోంది. ఈదురుగాలులు, తుపానులు, ప్రకృతి వైపరీత్యాలు చాలా తక్కువ. ద్రాక్ష, మామిడి వంటి వాటిలో తెలంగాణకు ప్రత్యేకత ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు కూడా చివరి దశకు చేరుకుంటున్నాయి. వివిధ రకాల పంటలతో దేశ, విదేశాలకు అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదుగుతోంది.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పత్తి..
నియంత్రిత విధానంలో వ్యవసాయం చేసేందుకు నెల రోజులుగా వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ మంత్రులు, ప్రొఫెసర్లు, వ్యాపార సంస్తలతో సమావేశాలు నిర్వహించాం. తెలంగాణ, విదర్భ ప్రాంతంలో సాగవుతున్న పత్తి నాణ్యతలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ఈ ఏడాది నియంత్రిత వి«ధానంలో పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలి. అందరూ ఒకే రకమైన పంట వేసి నష్టపోకుండా మార్కెట్‌లో డిమాండ్ ఉండే పంటలు సాగు చేస్తే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. గతేడాది రెండు పంటలు కలుపుకొని 1.23 కోట్ల ఎకరాల్లో సాగు చేశారు.
ఈ ఏడాది కాళేశ్వరం నీళ్లు అందుబాటులోకి రావడం, మెరుగైన వర్షపాతం ఉంటుందనే అంచనాల నేపథ్యంలో మరో 10 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగి 1.33 కోట్ల ఎకరాలకు చేరే అవకాశం ఉంది. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఈ ఏడాది 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేయాలని కోరుతున్నాం. వర్షాధారంగానే కాకుండా బోర్లు, ప్రాజెక్టుల కింద పత్తి సాగు చేస్తే ఎకరానికి 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడితో ఖర్చులు పోను ఎకరాకు రైతుకు రూ. 50 వేలు మిగులుతుంది. మీరు ధనవంతులు
కావాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
వానాకాలంలో మక్క సాగు వద్దు...
ఈ ఏడాది 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలి. వర్షాకాలంలో ఏ పంటలు వేయాలి, వేటికి డిమాండ్ ఉందనే అంశంపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. వర్షాకాలంలో మొక్కజొన్న సాగు చేసినా పక్క రాష్ట్రాలు తక్కువ ధరకే ఇస్తుండటంతో మన మక్కలను కొనుగోలు చేసేవారే లేరు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మక్కలకు కనీస మద్దతు ధర రూ. 1,760 ఇచ్చి కొనుగోలు చేశాం. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు కాబట్టి ప్రతిసారి కొనుగోలు చేయలేం.
రాష్ట్రంలో కేవలం 25 లక్షల టన్నుల మక్కల వినియోగం మాత్రమే ఉందనే విషయాన్ని గమనించాలి. మొక్కజొన్నకు బదులుగా 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి. రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగవుతుండగా నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల్లో 1.25 లక్షల ఎకరాల్లో పసుపు వేసుకోవచ్చు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట ప్రాంతాల్లో రెండున్నర లక్షల ఎకరాల్లో ఎండుమిర్చి సాగుకు అనుమతి ఉంది. సోయాబీన్, బత్తాయి, మామిడి వంటి పండ్ల తోటల సాగు యధావిధిగా ఉంటుంది.
ఇతర పంటలు సాగు చేస్తే రైతుబంధు కట్..
వరితోపాటు ప్రభుత్వం చెప్పిన పంటలు కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే రైతుబంధు పథకం రాదు. ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేసి రైతుబంధు సదుపాయం పొందాలని కోరుతున్నాం. నియంత్రిత విధానంలో సాగు చేయించేలా రైతులకు అవగాహన కల్పించి రైతుబంధు ఇప్పించడంపై కలెక్టర్లు పోటాపోటీగా పనిచేయాలి. రైతుబంధు పథకం కోసం ఇప్పటికే రూ. 2 వేల కోట్లు కేటాయించాం. అంతర్జాతీయ మార్కెట్‌కు తెలంగాణలో పండే ధాన్యం అమ్ముడుపోవాలి.
అంతర్జాతీయ మార్కెట్‌లో 6.33 మి.మీ కంటే ఎక్కువ పొడవున్న బియ్యానికి డిమాండ్ ఉన్నట్లు మా అ«ధ్యయనంలో తేలింది. తెలంగాణలో 6.55 మి.మీ పొడవుండే వరి రకాలను రూపొందించాలని ఆదేశించాం. తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు సృష్టించిన ‘తెలంగాణ సోనా’వెరైటీలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉందని అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమైంది. ఈ ఏడాది 10 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా సాగు చేసి భవిష్యత్తులో విస్తీర్ణం మరింత పెంచుతాం.
ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్‌ఈజెడ్‌లు, కోల్డ్ స్టోరేజీలు
పంటల సాగుకు సంబంధించి త్వరలో కలెక్టర్లు, అధికారులు, రైతుబంధు సమితితో సమావేశాలు ఏర్పాటు చేస్తాం. జిల్లాలవారీగా ఏయే పంట, ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే అంశంపై వర్క్‌షాప్‌లు నిర్వహిస్తాం. అన్ని జిల్లాలకు అన్ని రకాలైన పంటలను కేటాయిస్తాం. రాష్ట్ర్‌రంలో సాగు విస్తీర్ణానికి సంబంధించిన మ్యాపింగ్ ప్రభుత్వం వద్ద ఉంది. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్‌ఈజెడ్‌లు ఏర్పాటు చేయడంతోపాటు కొత్తగా 40 లక్షల టన్నుల సామర్థ్యంగల గోదాములు నిర్మిస్తాం. ప్రతి నియోజకవర్గంలోనూ కోల్డ్ స్టోరేజీల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ 90 శాతం పూర్తయింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రోత్సాహకాలు..
రాష్ట్ర అవతరణ తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు, సహాయ చర్యలు చేపడుతున్నాం. రైతుబంధు పథకాన్ని కేంద్రంతోపాటు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. రైతు బీమా పథకం కోసం మొదట్లో రూ. 700 కోట్లు ప్రీమియంగా చెల్లించగా ఈ ఏడాది రూ. 1,100 కోట్లు వెచ్చించాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా వారం తిరగకుండానే వారి ఖాతాలో రూ. 5 లక్షలు తెలంగాణ మినహా ఏ రాష్ట్ర్‌రంలోనూ ఇవ్వట్లేదు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాతోపాటు నీటి తీరువా బకాయిలు రద్దు చేశాం. మైక్రో ఇరిగేషన్‌లో 90–100 శాతం, పాలీహౌస్, గ్రీన్‌హౌస్ కల్టివేషన్‌లో 75–95 శాతం సబ్సిడీ ఇస్తున్నాం. ఫామ్ మెకనైజేషన్‌లో భాగంగా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పాడి పశువుల పంపిణీ, పాడి రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.
7 వేల కొనుగోలు కేంద్రాలు..
రాష్ట్ర్‌రంలో నియంత్రిత విధానంలో, అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు 5 వేల ఎకరాలకు చొప్పున 2,604 వ్యవసాయ క్లస్టర్లు ఏర్పాటు చేసి ఏఈఓలను నియమించాం. ఎరువులు, విత్తనాల కొరత అధిగమించడంతోపాటు కల్తీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్టు వంటి చర్యలు చేపట్టాం. వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ. 350 కోట్లు కేటాయించాం. ఎన్నడూ లేనివిధంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పీడీఎస్ కింద ఎఫ్‌సీఐకి సరపరా చేశాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా 7 వేల పైచిలుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరకు వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది వరి పంటలో ఒక్క గింజ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనదు. అన్ని పంటలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయేలా చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment