సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో కోవిడ్–19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ మహమ్మారి విజృంభిస్తుండటంతో సిటీజనుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. లాక్‌డౌన్ నిబంధనలు సడలింపులతో ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. భౌతికదూరం.. మాస్కుల వంటి జాగ్రత్త చర్యలు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం గమనార్హం. దీంతో కరోనా తీవ్రరూపం దాలుస్తోంది. గ్రేటర్ పరిధిలో బుధవారం 881 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఎల్‌బీనగర్ : జీహెచ్‌ఎంసీ ఎల్‌బీనగర్ మూడు సర్కిళ్ల పరిధిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. వారం రోజులుగా కరోనా విశ్వరూపం ప్రదర్శిస్తుండటంతో ఎల్‌బీనగర్ నియోజకవర్గ పరిధిలో సర్వత్రా ఆందోళన నెలకొంది. కోవిడ్ సోకిన వారిలో ఇప్పటికే 132 మంది హోం క్వారంటౌన్‌లో ఉండగా మరికొందరు గాంధీ, ఇతర ఆస్పత్రుల్లో చికిత్స నిమిత్తం చేరారు. ఒక్క బుధవారం రోజే చంపాపేట, çహయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సూరాబాద్, నాగోల్ తదితర డివిజన్ల పరిధిలో 20 మంది మహమ్మారి బారిన పడ్డారు. పాజిటివ్ వచ్చిన వారిలో దినసరి కూలీలు, వాపారులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండటంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. (భారత్‌లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు)
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో...
వెంగళరావునగర్: జూబ్లీహిల్స్ పరిధిలో 11 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ, రహమత్‌నగర్, వెంగళరావునగర్ డివిజన్ల పరిధిలో ఇద్దరి చొప్పున, బోరబండ డివిజన్‌లో ముగ్గురికి కరోనా సోకింది.
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రిలో...
ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 120 మంది కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్టు సూపరింటెండెంట్ పరమేశ్వరనాయక్ తెలిపారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన దాదాపు 245 మందికి కరోనా ఉచిత వైద్య పరీక్షలను నిర్వహించామన్నారు. వారి పరీక్షల రిపోర్టుల ఆధారంగా పాజిటివ్ వచ్చిన వారిని గాంధీ ఆస్పత్రి.. లేదా స్థానికంగా ఉన్న ఎర్రగడ్డ ఆయర్వేద ఆస్పత్రిలో చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ఎర్రగడ్డ ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో బుధవారం నాటికి మొత్తం 88 మంది రోగులు ఉండగా, వారిలో 46 మంది పాజిటివ్ రోగులు ఉన్నారని సూపరింటెండెంట్ మహబూబ్‌ఖాన్ తెలిపారు. 15 మందిని డిశ్చార్జ్ చేశామని, మిగిలిన రోగుల పరీక్షల వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
ముషీరాబాద్ నియోజకవర్గంలో...
ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో 8 మందికి కరోనా సోకినట్లు ఏఎంవోహెచ్ డాక్టర్ హేమలత తెలిపారు. రాంనగర్ డివిజన్ రిసాలకు చెందిన ఓ మహిళ (45), అదే ప్రాంతానికి చెందిన మరో మహిళ (45)కు కరోనా సోకిందన్నారు. చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తికి, రాంనగర్ డివిజన్ జెమిని కాలనీకి చెందిన ఓ యువతికి, అదే ప్రాంతానికి చెందిన మరో మహిళకు కరోనా సోకిందని తెలిపారు. చిక్కడపల్లి స్ట్రీట్ నం. 10లో నివసించే ఓ మహిళకు, అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యిందన్నారు. ముషీరాబాద్‌లోని కృష్ణానగర్‌కు చెందిన ఓ వృద్ధునికి కరోనా సోకినట్లు తెలిపారు.
బోడుప్పల్‌లో...
బోడుప్పల్: బోడుప్పల్ లక్ష్మీనగర్ (హుడా) కాలనీలోని ముగ్గురికి కరోనా సోకింది. ఓ కుటుంబంలో భర్త (38), భార్య (30), ఓ డాక్టర్ (32)కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దంపతులను హోం క్వారెంటైన్‌లో ఉంచి.. డాక్టర్‌ను గాంధీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
కాప్రా సర్కిల్ పరిధిలో...
కాప్రా: సర్కిల్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు వందకు చేరువవుతున్నాయి. బుధవారం కొత్తగా మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సర్కిల్ పరిధిలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93కు చేరింది. కొత్తగా నమోదైన కేసులు నాచారం డివిజన్ హెచ్‌ఎంటీ నగర్, దుర్గానగర్‌లో ఒక్కో కేసు, మల్లాపూర్ డివిజన్ భవానీ నగర్‌లో మరో పాజిటివ్ కేసు నమోదైంది.
ఘట్‌కేసర్ మండలంలో...
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ మండలంలోని కొర్రెముల్ గ్రామానికి చెందిన మహిళ(39)కు, కొండాపూర్ గ్రామానికి చెందిన మరొక మహిళ(64)కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని రెడ్ జోన్లలో మున్సిపల్ చైర్ పర్సన్ పావనిజంగయ్య, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్లు బర్ల శశికళదేవేందర్, కొమ్మిడి అనురాధరాఘవరెడ్డి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పరీక్షలు నిర్వహించారు.
శ్రీరంగవరంలో...
మేడ్చల్‌రూరల్: మండలంలోని శ్రీరంగవరం గ్రామంలో ఓ వ్యక్తి(53)కి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆయన మేడ్చల్ పారిశ్రామిక వాడలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇటీవల జ్వరంవచ్చి కరోనా లక్షణాలు కనబడడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
గాజులరామారంలో...
దుండిగల్: గాజులరామారం ఇంద్రానగర్‌కు చెందిన వ్యక్తి (50), ప్రగతినగర్‌కు చెందిన వ్యక్తి (45)కి కరోనా సోకింది.
అమీర్‌పేట: ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న మరో ఎస్‌ఐకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో కరోనా బాధితుల సంఖ్య 18కి చేరింది.
డిప్యూటీ స్పీకర్‌తో కాంటాక్ట్ అయిన వంద మందికి పరీక్షలు
కరోనా బారిన పడ్డ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌తో కాంటాక్ట్ అయిన వంద మందికి నేచర్‌క్యూర్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులతో పాటు నియోజకవర్గానికి చెందిన కొంత మంది నాయకులు ఉన్నారు. రిపోర్టులు రావాల్సి ఉంది.
నారపల్లిలో...
పోచారం: నారపల్లి సబ్ రిజిస్టార్ ఆఫీస్ వద్ద ఓ వ్యక్తి (52)కి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇతను నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒక రోజే దగ్గు, కాళ్ల నొప్పులు రావడంతో ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
మేడ్చల్‌లో...
మేడ్చల్: మేడ్చల్ బస్టాండ్ వెనున ఉన్న గోకుల్ నగర్‌లోని 108 అంబులెన్స్ పైలెట్‌గా పనిచేసే ఓ వ్యక్తి(35)కి కరోనా సోకింది. ఆయనకు ఇటీవల జ్వరంగా ఉండటంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. మండలంలోని శ్రీరంగవరం గ్రామంలో ఓ వ్యక్తి(53) కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఘనాపూర్ తండాకు చెందిన హోంగార్డు కుటుంబంలో భార్య, తల్లి వైరస్ బారిన పడ్డారు. హోంగార్డుకు నెగిటివ్ వచ్చింది. డబీల్‌పూర్‌కు చెందిన ఓ యువకుడికి పాజిటివ్ తేలింది. మేడ్చల్ మున్సిపల్ అధికారులు గోకుల్ నగర్ హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment