నిజామాబాద్‌అర్బన్ : గతంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్)గా పనిచేసిన బాలకృష్ణ నిబంధనలు తుంగలో తొక్కి.. ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్రమ పదోన్నతులు, బదిలీలు చేపట్టారని, సంబంధిత అధికారులకు తెలుపకుండానే పనులు చేపట్టారని విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జిల్లా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈమేరకు నిబంధనలను తుంగలో తొక్కిన ఆ అధికారి లీలలు త్వరలో బయటకు రానున్నాయి.
అక్రమ నియామకాలు
డీసీహెచ్‌ఎస్‌గా ఉన్నప్పుడు బాలకృష్ణ నిబంధనలను పట్టించుకోకుండా ఎనిమిదిమంది వైద్యులను కాంట్రాక్టు పద్ధతిన నియమిచారు. కనీసం కలెక్టర్, వైద్యావిధాన పరిషత్ కమిషనర్ అనుమతి కూడా తీసుకోలేదు. బాన్సువాడలో నలుగురు, నిజామాబాద్‌లో ఇద్దరు, ఎల్లారెడ్డిలో ఇద్దరు చొప్పున నియమించారు. తన ఇంటి వద్దనే ఉత్తర్వులను ఏర్పాటు చేసుకొని సంతకాలు చేసి మరి నియమకాలు చేశారు. కొత్త డీసీహెచ్‌ఎస్ వారి వేతనాల కోసం కలెక్టర్‌ను సంప్రదించగా ఆయన ఈ నియామకాలపై ఆరా తీశారు. దీంతో బాలకృష్ణ చేసిన అక్రమ నియామకాలు బయటపడ్డాయి. ఈ వ్యవహరంపై ‘సాక్షి’ ఫిబ్రవరి 28న వైద్య‘విధానం’ లేదు.. శీర్షికన కథనం ప్రచురించింది.
మెడికల్ కళాశాలకు సంబంధించిన వెంకటేశ్వర్లు, మరో వైద్యుడికి చెందిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను తారుమారు చేశారు. వీరు ఫిట్‌గానే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యాధికారులు నివేదికలు ఇచ్చారు. కానీ వీరు అన్‌ఫిట్ అంటూ బాలకృష్ణ వైద్యులు ఇచ్చిన నివేదికను చెరిపేసి.. తానే స్వయంగా సంతకం చేసి నివేదికలు ఇచ్చారు. వైద్యాధికారుల వద్ద డబ్బులు తీసుకొని ఈ తతంగం చేశారు. దీంతో నివేదిక ఇచ్చిన వైద్యులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆయన విచారణకు ఆదేశించారు.
ఫిబ్రవరి మొదటి వారంలో అక్రమంగా నలుగురికి పదోన్నతులు కల్పించారు. వీరికి కనీస అర్హతలు కూడా లేవు. నాల్గోతరగతి ఉద్యోగులకు జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించారు. ఇందులో బోధన్‌కు చెందిన ఉద్యోగిని మద్నూరుకు, నిజామాబాద్‌కు చెందిన ఉద్యోగిని బాన్సువాడకు, బాన్సువాడకు చెందిన ఉద్యోగిని ఎల్లారెడ్డికి పంపుతూ పదోన్నతి కల్పించారు. ఇలా పదోన్నతి పొందిన ఉద్యోగులను సంబంధిత ఆస్పత్రుల అధికారులు అనుమతించలేదు. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు.
బోధన్ ఆస్పత్రిలో నిధులు మాయం
బోధన్ ఏరియా ఆస్పత్రిలో నిధుల కుంభకోణం జరిగింది. దాదాపు రూ.32 లక్షలకు ఎలాంటి రికార్డులు లేవని ఉన్నతాదికారులు తేల్చిచెప్పారు. డీసీహెచ్‌ఎస్‌గా ఉన్న బాలకృష్ణారావు ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఈ నిధుల గందరగోళం జరిగింది. జనని సురక్ష యోజనకు సంబంధించి రూ. 4లక్షలు, ఆస్పత్రి అభివృద్ధి సంఘానికి సంబంధించి ఎలాంటి పనులు చేపట్టకుండానే రూ.22 లక్షలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఆస్పత్రి జూనియర్ అసిస్టెంట్, మరో అధికారితో కలిసి మత్తుమందు డాక్టర్ పేరిట బిల్లులు పెట్టి రూ.6 లక్షలను మింగేశారు. ఈ వ్యవహరం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.
అక్రమాలపై విచారణ కమిటీ
డీసీహెచ్‌ఎస్‌గా బాలకృష్ణారావు చేసిన అక్రమాలపై అధికారులు సమర్పించిన నివేదికలపై స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు కమిటీ వేశారు. ఈ కమిటీలో ప్రస్తుత డీసీహెచ్‌ఎస్ శివదాస్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ జిజియాబాయి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్ ఉన్నారు. గత డీసీహెచ్‌ఎస్ అక్రమ బదిలీలు, పదోన్నతులపై విచారణ చేపడుతున్నామని, ఇందులో ఎవరెవరు ఉన్నారనే విషయాలపై ఆరా తీస్తున్నామని డీసీహెచ్‌ఎస్ శివదాస్ తెలిపారు. డీసీహెచ్‌ఎస్‌గా బాలకృష్ణ చేసిన పనులపై త్వరలోనే విచారణ పూర్తిచేసి కలెక్టర్‌కు అందిస్తామని ఆయన చెప్పారు.
తేలనున్న ‘బాలకృష్ణ’ లీలలు
Published Wed, Jun 18 2014 7:59 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
Advertisement