సాక్షి, హైదరాబాద్: ఓ వాటర్ బాటిల్ కంపెనీ కేసుపై సీరియస్‌గా వాదనలు జరుగుతున్నాయి. ఇంతలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్ తనకొచ్చిన సందేహ నివృత్తికి వాదనలను ఆపారు. తన సిబ్బందిలోని ఓ వ్యక్తిని పిలిచి, జేబులో నుంచి డబ్బు తీసి హైకోర్టు క్యాంటీన్‌లో వాటర్ బాటిల్ తీసుకురమ్మని ఆదేశించారు. వెంటనే ఆ వ్యక్తి క్యాంటీన్‌కు వెళ్లి వాటర్ బాటిల్ తెచ్చారు. దాన్ని పరిశీలించిన సీజే తన సందేహాన్ని నివృత్తి చేసుకున్నారు. ఈ ఆసక్తికర ఘటన సోమవారం హైకోర్టులో చోటు చేసుకుంది.
ఆ తర్వాత వాటర్ బాటిళ్లపై సరఫరాదారు చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ తదితర వివరాలను పొందుపరచని కంపెనీలను నియంత్రించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు రెండు రోజుల గడువునిచ్చారు. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
ఎవరికి ఫిర్యాదు చేయాలి?
హిందుస్తాన్ కోకాకోలా బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ మెదక్ జిల్లా, పాశమైలారంలోని హిమజల్ బేవరేజస్ ప్రైవేట్ లిమిటెడ్ ‘కిన్లే’బ్రాండ్ కింద తాగునీరు సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 2న తూనికలు, కొలతల శాఖ అధికారులు హిమజల బేవరేజస్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ సరఫరాకు సిద్ధంగా ఉన్న బాటిళ్లపై ఫిర్యాదు ఇవ్వాల్సిన వ్యక్తి పేరు, చిరునామా లేదంటూ దాదాపు లక్ష బాటిళ్లను అధికారులు జప్తు చేశారు. దీనిని సవాల్ చేస్తూ హిమజల్ హైకోర్టును ఆశ్రయించింది.
దీనిపై తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్ ముందు అప్పీల్‌కు అవకాశం ఉండటంతో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో హిమజల్ కంపెనీ కంట్రోలర్ ముందు అప్పీల్ దాఖలు చేసింది. విచారణ జరిపిన కంట్రోలర్ వాటర్ బాటిళ్ల జప్తును సమర్థించారు. దీనిపై కంపెనీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు అధికారుల తీరును తప్పుపట్టారు. ఆ బాటిళ్లపై కేవలం వ్యక్తి పేరు లేదన్న కారణంతో జప్తు చేయడం సరికాదని పేర్కొన్నారు. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ బి.రాధాకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా తూనికలు, కొలతల శాఖ తరఫు న్యాయవాది జ్యోతికిరణ్ వాదనలు వినిపిస్తూ, నిబంధనల మేరకే తాము హిమజల్ కంపెనీలో ఉన్న వాటర్ బాటిళ్లను జప్తు చేశామన్నారు. వాదనలు వింటున్న సీజే తన డబ్బులతో హైకోర్టు క్యాంటీన్‌లో బిస్లరీ వాటర్ బాటిల్ తెప్పించుకుని పరిశీలించారు. ‘ఈ బాటిల్‌పై ఓ టోల్‌ఫ్రీ నంబరే ఉంది. అంతకు మించిన వివరాలు లేవు. ఈ బాటిళ్లలోని నీటిని కొందరు మినరల్ వాటర్ అంటున్నారు. వాస్తవానికి అవి ప్యాకేజ్డ్ వాటర్’ అని ఈ సందర్భంగా సీజే వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment