ఏపీకి ఖమ్మం డీఈవో బదిలీ
ఖమ్మం : రెండేళ్లుగా డీఈవోగా పనిచేస్తున్న రవీంద్రనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో డీఈవో బదిలీ అనివార్యమైంది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఈవో వెంకటరెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర పుస్తకాల విభాగం డిప్యూటీ డెరైక్టర్‌గా బదిలీ కావడంతో రవీంద్రనాథ్‌రెడ్డి డీఈవోగా వచ్చారు. 2013లో జిల్లాకు వచ్చిన ఆయన అప్పటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఏజెన్సీ ఉపాధ్యాయుల వివాదం పరిష్కారంలో తనదైన ముద్ర వేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన తర్వాత ఆంధ్రా కేడర్‌కు చెందిన రవీంద్రనాథ్‌రెడ్డిని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీఈవో జిల్లా నుంచి బదిలీ అయ్యారు.
పోస్టు కోసం పోటాపోటీ
కాగా, ఖమ్మం జిల్లా డీఈవోగా వచ్చేందుకు పలువురు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ డీఈవోగా పనిచేస్తున్న విజయలక్ష్మీ బాయి, జిల్లాకు చెందిన రాజీవ్‌తోపాటు గతంలో జిల్లాలోని ఏజెన్సీ డీఈవోగా పనిచేసిన రాజేష్ మహబూబ్‌నగర్ డీఈవోగా పనిచేస్తూ ఇటీవల ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఆయన కూడా జిల్లాకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. వీరితోపాటు జిల్లాకు చెందిన లింగయ్య, శ్రీనివాసచారి కూడా ఖమ్మం డీఈవోగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిసింది. ఇది ఒకటి, రెండు రోజుల్లో తేలనుంది. కాగా, కొత్త డీఈవో నియామకం జరిగే వరకు జిల్లా విద్యాశాఖాధికారి బాధ్యతలను ఆర్‌జేడీ బాలయ్యకు అప్పగించారు.