హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభకు ధీటుగా తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగసభ నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. మే నెలాఖరులో నిర్వహించే మహానాడు తరువాత ఈ భారీ సభ జరపాలని భావిస్తున్నట్లు ఆపార్టీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలిపారు. మంగళవారం ఏపీ సచివాలయంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, పార్టీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎ. రేవంత్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, జి. సాయన్న, సండ్ర వెంకట వీరయ్య తదితరులు చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా సోమవారం టీఆర్‌ఎస్ సభకు హాజరైన జనం, కేసీఆర్ ప్రసంగిస్తూ చంద్రబాబుపై చేసిన విమర్శలపై చర్చించారు.
‘10లక్షల జనం వస్తారని గొప్పలు చెప్పుకున్నారు. తీరా చూస్తే 2 లక్షలు కూడా దాటలేదు. మనం తలచుకుంటే అంతకన్నా ఎక్కువ మందిని తీసుకురావచ్చు. మహానాడు తరువాత పెరేడ్‌గ్రౌండ్స్‌లోనే టీడీపీ సభ పెట్టి తఢాఖా చూపిస్తాం’ అని రేవంత్, ఎర్రబెల్లి తదితర నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. అందుకు ఒప్పుకున్న ఆయన పకడ్భందీగా ప్లాన్ చేసి సభ నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిసింది. అంతకన్నా ముందు మే నెలలో ఖమ్మంలో సభ నిర్వహించి ఆ జిల్లా టీడీపీ వెంటే ఉందన్న సందేశాన్ని పంపించాలని నాయకులకు సూచించినట్లు సమాచారం. మహానాడును హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించినందున రెండు రాష్ట్రాల ప్రతినిధులు హాజరవుతారని, అందుకోసం సరైన వేదికను నిర్ణయించాలని నేతలు చంద్రబాబును కోరినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను వచ్చే డిసెంబర్‌లోపు నిర్వహించాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పటిష్టతపై దృష్టిపెట్టాలని ఆదేశించినట్లు సమాచారం. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి, పార్టీ ముఖ్య నాయకులు ఒక్కొక్కరు 20 డివిజన్‌ల బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న తీరుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం, టీఆర్‌ఎస్ అమలు చేస్తున్న పథకాల్లో అవినీతి, కుటుంబపాలన తీరు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు ఉద్భోదించినట్లు తెలిసింది. కాగా టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం ఉదయం 11 గంటలకు స్పీకర్ మధుసూదనాచారిని కలిసేందుకు పార్టీ నేతలు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు.