* ఆశలు పెట్టుకున్న కృష్ణయ్య
* సీనియారిటీకి ప్రాధాన్యం అంటున్న ఇతరులు
* పోటీలో తలసాని, సాయన్న, ఎర్రబెల్లి, రేవంత్, సండ్ర
* బీసీకి పార్టీ నాయకత్వం అప్పగించి, అసెంబ్లీ పదవి కూడా వారికేనా: ఓసీ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ ఫ్లోర్‌లీడర్ హోదా కోసం ఎమ్మెల్యేల్లో పోటీ పెరుగుతోంది. ఐదేళ్ల పాటు తెలంగాణలో టీ టీడీఎల్‌పీ నేతగా ముందు వరుసలో కూర్చునేందుకు సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు కొత్తగా అసెంబ్లీకి అడుగుపెట్టబోతున్న నేతలు కూడా ఆసక్తి చూపుతున్నారు. చంద్రబాబు నాయుడు లేని అసెంబ్లీలో తెలంగాణ పార్టీ తరపున అన్నీ తామై స్వతంత్రంగా వ్యవహరించే అవకాశాన్ని వదులుకోకూడదని ఎమ్మెల్యేలు ఎవరికి వారే భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీకి తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇందులో సీనియర్ల కన్నా కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వారే అధికంగా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తే బీసీ నేత ఆర్.కృష్ణయ్యను సీఎం చేస్తానని చంద్రబాబు చేసిన ప్రచారం ఇప్పుడు ఆపార్టీ సీనియర్లకు తలనొప్పిగా మారింది. సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన ఆర్.కృష్ణయ్య ఎల్.బి.నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సాధారణంగా సీఎం అభ్యర్థిగా ప్రచారం పొందిన నేతకే అసెంబ్లీలో పార్టీ పగ్గాలు అప్పగించాల్సి ఉంటుంది. కానీ కృష్ణయ్య విషయంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణయ్య తొలిసారి ఎన్నికవడం, పార్టీనేతలపై పట్టు లేకపోవడం, ఉద్యమపంథా తప్ప రాజకీయచాతుర్యం లోపించడం వంటి అంశాలు ఆయనకు ప్రతిబంధకంగా మారుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ, గెలిచిన ఇతర ఎమ్మెల్యేలను కలుపుకుపోయే విషయంలో ఆయన ఇప్పటి వరకూ పెద్దగా చొరవ చూపలేదన్న విమర్శలున్నాయి. దీంతో సీనియర్ నేతలు కృష్ణయ్యకు సహకరించరన్న విషయం ఇప్పటికే స్పష్టమైంది.
నాకంటే నాకు...
తెలంగాణలో తెలుగుదేశం నుంచి ఎన్నికైన 15 మంది ఎమ్మెల్యేల్లో తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జీ సాయన్నలు సీనియర్లు. తరువాత స్థానాల్లో రెండుసార్లు గెలిచిన ఎ.రేవంత్‌రెడ్డి(కొడంగల్), సండ్ర వెంకటవీరయ్య(సత్తుపల్లి), మంచిరెడ్డి కిషన్‌రెడ్డి(ఇబ్రహీంపట్నం) ప్రకాశ్‌గౌడ్(రాజేంద్రనగర్) ఉన్నారు. బీసీ కేటగిరీలో చూసుకుంటే తనకే అవకాశం వస్తుందన్న ఆశతో తలసాని ఉన్నారు. బీసీలకు అధ్యక్ష పదవి ఇస్తున్నందున ఫ్లోర్ లీడర్ ఎస్‌సీలకు ఇస్తే సాయన్న ముందు వరుసలో ఉంటారు. తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు పార్టీని కాపాడిన నేతలుగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎ.రేవంత్‌రెడ్డిలకు కూడా అవకాశం రావచ్చు. అయితే సామాజికవర్గం చూస్తే వీరికి కష్టమే.
అదే సమయంలో బీసీలు తప్ప తెలంగాణలో ఓసీలు పార్టీకి అవసరం లేదా అనే వాదన కూడా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మొదలైంది. నలుగురు రెడ్డి, ఇద్దరు కమ్మ, ఒకరు వెలమ వర్గం నుంచి టీడీపీ తరుపున గెలిచారని వారు వాదిస్తున్నారు. బీసీ, ఎస్సీల కన్నా సామాజికంగా బలంగా ఉన్న వారిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని నగరం నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని అసెంబ్లీలో పార్టీ గొంతును వినిపించే వారికి అవకాశం ఇవ్వాలని, ఇక్కడ కూడా కులాలను లెక్కలోకి తీసుకుంటే పార్టీకే నష్టమని దక్షిణ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన 72 స్థానాల్లో 15 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఐదు జిల్లాల్లో ఖాతాయే తెరవలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నందున టీ టీడీఎల్‌పీ నాయకుడి ఎన్నికపై చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
టీ టీడీఎల్‌పీ ఫ్లోర్‌లీడర్‌షిప్‌కు పోటాపోటీ
Published Thu, Jun 5 2014 2:40 AM | Last Updated on Sat, Aug 11 2018 6:42 PM
Advertisement
Advertisement