పాక్‌లో ‘ఇండియా’పై సర్వే: అనూహ్య ఫలితాలు
ఇస్లామాబాద్: ఉడీ ఉగ్రదాడి, పీవోకేలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ ఘటనల తర్వాత.. ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య ఎడతెగని కాల్పులు, సరిహద్దు గ్రామస్తుల తరలింపు.. దాదాపు యుద్ధవాతావరణం తలెత్తడం తెలిసిందే. సరిగ్గా ఆ సమయంలోనే (సెప్టెంబర్ 26- అక్టోబర్ 3) ఇండియాతో సంబంధాల విషయమై పాకిస్థాన్‌లో ఒక సర్వే జరిగింది. ప్రపంచ ప్రఖ్యాత గాలప్ సర్వే సంస్థ తన పాకిస్థాన్ శాఖ ద్వారా నిర్వహించిన సర్వే ఫలితాలు కొద్ది గంటల కిందటే వెల్లడయ్యాయి.
పాకిస్థాన్ పంజాబ్, సింధ్, బలూచ్, ఖైబర్ ఫక్తునక్వా రాష్ట్రాల్లోని పలు గ్రామాలు, పట్టణాల్లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 2000 మందిని ఒకే ప్రశ్న అడిగారు. ‘ఇండియాతో చర్చలకు మీరు అనుకూలమేనా?’అన్న ప్రశ్నకు 68 శాతం మంది ‘అవును’అనే సమాధానం ఇచ్చారు. చర్చల ద్వారా మాత్రమే ఇరు దేశాల్లో శాంతి నెలకొంటుందని, భారత్-పాక్ భాయిభాయి అనుకుంటే దక్షిణాసియాలో ఎదురే ఉండదని మెజారిటీ పాకిస్థానీలు అభిప్రాయపడ్డారు.
కాగా, 31 శాతం మంది మాత్రం ఇండియాతో పాకిస్థాన్ చర్చలకు వ్యతిరేకమని తేల్చిచెప్పారు. ఒక్క శాతం మంది మాత్రం ‘తెలియదు’అనే సమాధానం ఇచ్చారు. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సహకరిస్తున్నదనే విషయాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఐక్యరాజ్యసమితి సహా, సార్క్, హార్ట్ ఆఫ్ ఆసియా లాంటి అంతర్జాతీయ వేదికలపై ఆ దేశాన్ని ఏకాకిని చేయడంలో భారత్ సఫలమైన నేపథ్యంలో ఈ సర్వేకు ప్రాధ్యాన్యం లభించింది. తమ దేశ జైళ్లల్లో బంధీలుగా ఉన్న 218 మంది భారత జార్లను శుక్రవారం విడుదల చేసిన పాక్.. ఆ చర్యను స్నేహపూర్వక సంకేతంగా అభిర్ణించడం గమనార్హం.