ప్రధానమంత్రి మోదీకి సీఎం సవాల్
- మీలో ఎంత దమ్ముందో చూస్తానంటూ వ్యాఖ్య
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ధూలాగఢ్ ప్రాంతం మతఘర్షణలు, లూటీలు, దాడులతో అట్టుడికిపోతున్నది. ఈ నేపథ్యంలో గతవారం రోజులుగా మౌనంగా ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యంగా పరుషమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. 'రాజకీయ హింసలో ఎలాంటి అర్థం లేదు. ఇదే విషయం నరేంద్రమోదీకి, బీజేపీకి చెప్పదలుచుకున్నాను. ఎవరినీ గాయపరచాల్సిన అవసరం లేదు. నన్ను ఒక్కరిని అరెస్టు చేయండి సరిపోతుంది. మమతా బెనర్జీపై మీకున్న రాజకీయ కక్ష తీరిపోతుంది' అని ఆమె ఆగ్రహంగా పేర్కొన్నారు.
నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న ధూలాగఢ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోలాఘాట్‌లో గురువారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీకి, బీజేపీకి బంహిరంగ సవాళ్లు విసిరారు. బెంగాల్‌లో మతఘర్షణలు రేకెత్తించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. 'మీలో ఎంత దమ్ముందో నేను కూడా చూస్తాను. మీరు ఎన్ని ఘర్షణలు సృష్టిస్తారో, ఎంతగా లూటీ చేస్తారో చూద్దాం. మీరు నన్ను ఆపాలనుకుంటున్నారు. ఎన్నో కుట్రలు చేస్తున్నారు. మీ కుట్రలన్నీ చూశాను. మీకు చాలెంజ్ చేస్తున్నాను' అని మమత విరుచుకుపడ్డారు.
గత అక్టోబర్ నెల నుంచి బెంగాల్‌లో తరచూ మతఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ధూలాగఢ్‌లో మహమ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తుండగా ఘర్షణలు చెలరేగి.. దాడులు, లూటీలు సంభవించాయి. అయితే, మరోవైపు సీఎం వెళ్లిపోగానే అదే ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఈ ప్రాంతంలో ఘర్షణలకు అధికార తృణమూల్ పార్టీయే కారణమని, ఇందులో సీఎం మమత, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తముందని ఆరోపించారు.